సభలో పట్టిసీమ మంటలు


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మూడోరోజు బుధవారం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ సభ్యుల మధ్య ప్రాజెక్టులపై వాడివేడి చర్చసాగింది. ముఖ్యంగా పట్టిసీమ ప్రాజెక్టుపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. వైఎస్ఆర్ సీపీ శాసనసభ పక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టగా, అధికార పార్టీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దివంగత మహానేత వైఎస్ఆర్పై ఆరోపణలు చేశారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.



పూర్తికాకుండానే పట్టిసీమ ప్రాజెక్టును జాతికి ఎలా అంకితమిస్తారని వైఎస్ఆర్ సీపీ శాసనసభ పక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది కేవలం ధనార్జన కోసం చేపట్టిన ప్రాజెక్టు అని విమర్శించారు.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు అందించి శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమపై వాస్తవాలు చెప్పాలని, రాయలసీమ ప్రజలను మభ్యపెట్టరాదని హితువు పలికారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం వైఎస్ఆర్ తపించారని, చంద్రబాబుకు చిత్తుశుద్ధిలేదని జ్యోతుల నెహ్రూ విమర్శించారు.



పట్టిసీమ ప్రాజెక్టు అన్నది దశల వారీ పూర్తి అవుతుందని మంత్రి చెప్పారు.. చెబుతూనే ఉన్నారు. పట్టిసీమ పూర్తి కాకుండానే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి ఎలా అంకితం చేశారో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అని దానికి సంబంధించిన పత్రాలను అసెంబ్లీలో చూపిస్తూ.. ప్రజాస్వామ్యానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి పట్టిసీమే నిదర్శనమని ఎద్దేవా చేశారు.



'రాయలసీమ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఆగస్టు 15 కల్లా కృష్ణానదిలోకి నీరు వదులుతామని చెప్పారు. ఇప్పటికీ కాలేదు. రూ.450 కోట్లు ఇస్తే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. పట్టిసీమ ద్వారా నీళ్ల తరలింపు దుర్మార్గం. సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర ఉన్నా కూడా ఎందుకు వినియోగించలేదు' అని ప్రశ్నించారు.



చర్చలో పాల్గొన్న చంద్రబాబు వైఎస్ఆర్ సీపీ నాయకులపై అసహనం వ్యక్తం చేశారు.  చంద్రబాబు ఎదురుదాడి చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్పై ఆరోపణలు చేశారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ దశలో అధికార పార్టీ సభ్యుల అరుపులు, కేకలతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం తర్వాత సభ రేపటికి వాయిదాపడింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top