ప్రాణాధార మందుల పవర్ తగ్గుతోందా?

ప్రాణాధార మందుల పవర్ తగ్గుతోందా?


 బలం పుంజుకుంటున్న వ్యాధి కారకాలు.. మందులకు లొంగని జబ్బులు

యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకంతో ముంచుకొస్తున్న ముప్పు

నిర్మూలనకు వాడాల్సిన ఔషధాలు నివారణ కోసం వినియోగం

మరి మొండి జబ్బులకు, కొత్తగా వచ్చే రోగాలకు మందేది?

వైద్య రంగం ముందు అతిపెద్ద సవాలు

 

     చిన్న పిల్లల్లో సాధారణంగా వచ్చే సెగగడ్డలు మునుపు మామూలు యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోయేవి! కానీ ఇప్పుడు ఏమాత్రం లొంగడం లేదు. గొంతు, చర్మానికి వచ్చే మామూలు ఇన్‌ఫెక్షన్లు ఇంతకుముందు చిన్నచిన్న మందులతోనే మటుమాయమయ్యేవి. ఇప్పుడు ఎంత ఖరీదైన మందులు వాడినా తగ్గనంటున్నాయి!

 

 హైదరాబాద్:

 ప్రాణాలు నిలబెట్టాల్సిన ఔషధాలన్నీ పదును కోల్పోతున్నాయి. వ్యాధికారక క్రిములు జడలు విచ్చుకుంటున్నాయి. వైరస్‌లు, బ్యాక్టీరియాలు మరింత శక్తిమంతం అవుతున్నాయి. వీటి బలం ముందు మందుల ‘పవర్’ దూదిపింజలా తేలిపోతోంది. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగంతో వ్యాధి కారకాలు 'డ్రగ్ రెసిస్టెన్స్' పెంచుకొని ఏ మందుకూ లొంగని స్థాయికి చేరుకున్నాయి. ఈ విపత్కర పరిణామం ఇప్పుడు వైద్య రంగానికే పెనుసవాలు విసురుతోంది! యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగం ఇకనైనా ఆపకుంటే మానవాళి మనుగడే ప్రమాదంలో పడిపోతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.



ఇదో నిశ్శబ్ద విధ్వంసం

 దాదాపు 60 ఏళ్ల క్రితం యాంటీబయాటిక్స్ కనుగొనడం ఒక విప్లవం. ఇప్పుడు వాటి దుర్వినియోగం ఒక నిశ్శబ్ద విధ్వంసంలా సాగిపోతోంది. మామూలు గాయాలు, జబ్బులు, ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గని పరిస్థితి ఎవరో తెచ్చింది కాదు. ఇది మనకు మనం చేసుకుంటున్న కీడు. వ్యాధి నిర్మూలన కోసం వాడాల్సిన మందుల్ని నివారణ కోసమే యథేచ్ఛగా వాడుతున్నందున బ్యాక్టీరియా, వైరస్‌లు మొండిగా తయారై కూర్చుంటున్నాయి. బ్రహ్మాస్త్రంలాంటి యాంటీబయాటిక్స్‌ను పిచ్చుక వంటి చిన్నచిన్న వ్యాధులపై ప్రయోగించడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే  యాంటీబయాటిక్స్ ఉన్నవన్నీ వాడేశాం. గత కొంతకాలంగా కొత్తగా కనుగొన్న యాంటీబయాటిక్స్ ఏమీ లేవు. మున్ముందు కొత్తగా రాబోతున్నవీ కనిపించడం లేదు. దీంతో రాబోయే తరానికి యాంటీబయాటిక్స్ కొరత తీవ్రంగా ఏర్పడబోతోంది. తేలిగ్గా తగ్గిపోయే జబ్బులకు సైతం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అష్టకష్టాలు పడుతూ, ఖరీదైన మందులు వాడడం, వాడినా లొంగని, నయం కాని దుస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఐదేళ్లలో గడ్డం గీసుకుంటే అయ్యే గాయాలూ కూడా మానవేమోనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



 చిన్న జబ్బుకూ యాంటీబయాటిక్సే..

 జలుబుకు మందు లేదు. ఎందుకంటే అది వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే తాత్కాలిక అసౌకర్యం. ఆవిరిపట్టడం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. కానీ చాలామంది అది కూడా తట్టుకోవడం లేదు. మరికొందరు స్వైన్‌ఫ్లూ కావచ్చేమోనన్న భయంతో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. దీంతో ట్యూబర్క్యులోసిస్ (టీబీ), క్లెబిసియెల్లా నిమోనియా కార్బపేనిమేజ్, సూడోమొనాస్ వంటి యాంటీబయాటిక్స్‌కు మామూలుగానే లొంగిపోయే సూక్ష్మక్రిములు మరింత మొండిగా మారుతున్నాయి.



 బలం పుంజుకుంటున్నాయిలా..

 ఇ-కొలి అనే బ్యాక్టీరియా నీళ్ల విరేచనాలు కలగజేస్తుంది. సాధారణ యాంటీబయాటిక్స్‌తో ఈ బ్యాక్టీరియాతో తగ్గిపోయేది. కానీ ఆ మందులకు లొంగకపోగా ఏటేటా మరింత విస్తరిస్తోంది. 2010లో మన దేశంలో 5 శాతం మంది ఈ బ్యాక్టీరియాతో సతమతమైతే.. 2014 నాటికి వారి సంఖ్య 12 శాతానికి పెరిగింది. అలాగే నిమోనియాకు కారణమయ్యే  క్లెబిసియెల్లా నిమోనియా కార్భపేనిమేజ్ ఇన్‌ఫెక్షన్‌తో... 2008లో మనదేశంలో 29 శాతం మంది బాధపడగా.. 2014కల్లా వారి సంఖ్య 57 శాతానికి చేరింది. ఇక హాస్పిటల్స్‌లో కనిపించే ఎమ్‌ఆర్‌ఎస్‌ఏ ఇన్ఫెక్షన్లు 2009లో 29 శాతం ఉంటే.. 2014కల్లా 47 శాతానికి పెరిగాయి.

 

 ఎందుకంత ప్రమాదమంటే..


  •  మన దేహాన్ని ఆవాసం చేసుకొని అనేక రకాల బ్యాక్టీరియాలు జీవిస్తుంటాయి. అవేవీ మనిషికి హాని చేయవు. అయితే విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడేవారిలో ఈ హానిరహితమైన బ్యాక్టీరియా తగ్గిపోవడమేగాకుండా హానికారక బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. అవి చర్మం, మూత్ర వ్యవస్థను దెబ్బతీస్తాయి.

  •  యాంటీబయాటిక్స్‌ను నిర్ణీతకాలం వాడాలి. అలా కాకుండా మధ్యలోనే వదిలేయడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా నిర్మూలన జరగదు.. సరికదా  వ్యాధి కారక సూక్ష్మజీవులు నిరోధకతను పెంచుకుంటాయి. ఉదాహరణకు టీబీ సోకిన వ్యక్తులు తమ లక్షణాలు తగ్గగానే పూర్తి కోర్సు వాడకుండా మందులు మానేస్తుంటారు. దాంతో ఆ క్రిములు మరింత శక్తిమంతం అవుతాయి.

  •  కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

  •  క్లాస్ట్రీడియమ్ డిఫిసైల్ అనే బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకొని పెద్ద వయసువారిలో నీళ్ల విరేచనాలు కలగజేస్తుంది. ఇది చివరికి ప్రాణాలకే ముప్పు తేవొచ్చు.


 


 విచ్చలవిడిగా వాడుతున్న యాంటీబయాటిక్స్ ఇవే...


దగ్గుకూ, జలుబుకూ అజిథ్రోమైసిన్, సెఫాక్సిమ్, సెపడోక్సిమ్, నీళ్ల విరేచనాలకు నార్‌ఫ్లాక్స్‌ట్, ఇంజెక్షన్ల ద్వారా తీసుకునే సెఫ్‌ట్రియాక్సోన్‌తోపాటు అఫ్లాక్సోసిన్, సిప్రోఫ్లాక్సిన్, సిఫ్రాన్, సెప్ట్రాన్, మోనోసెఫ్, పైపర్‌సిలిన్, టాజోబ్యాక్టమ్.

 

 ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?


  •   అనేక రకాల యాంటీబయాటిక్ కాంబినేషన్లను వాడొద్దు.

  •   వైద్యుడు చెప్పిన మోతాదులోనే వాడాలి.

  •   కొందరు నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. డాక్టర్ సలహా లేకుండా ఇవి వాడొద్దు.

  •   యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకాన్ని తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.


 

 ఈ పరిస్థితికి అందరూ కారణమే

 ఈ పరిస్థితికి సొంత వైద్యం చేసుకునే రోగులు, ఔషధాల అమ్మకాలు పెంచుకునే కంపెనీలు, తెలిసీ తెలియక మందులు రాసే వైద్యులూ.. అందరూ కారణమే! ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఇప్పటికి తెలిసిన వైద్యం యాంటీబయాటిక్స్ వినియోగం మాత్రమే. వాటిని మన దేహానికి ఉన్న సహజ రోగ నిరోధక శక్తి దెబ్బతినకుండా అవసరమైన మోతాదులోనే వాడాలి. విచ్చలవిడిగా వాడితే అనేక దుష్పరిణామాలు తప్పవు. సూక్ష్మజీవులు నిరోధకతను పెంపొందించుకుంటే... వ్యాధులు తగ్గడానికి చాలా రోజులు పడుతుంది. మామూలుగా తగ్గాల్సిన జబ్బులూ ముదిరిపోతాయి. దీంతో రోగులు హాస్పిటల్‌లో ఉండాల్సిన వ్యవధితోపాటు వాడాల్సిన మందులు అనేక రెట్లు పెర గవచ్చు. కొన్నిసార్లు మందులు పనిచేయక మృత్యువాత పడే ప్రమాదం ఉండవచ్చు.

 - డాక్టర్ కె.శివరాజు, సీనియర్ ఫిజీషియన్, కిమ్స్, సికింద్రాబాద్

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top