అమ్మో... అమరావతి డ్యూటీయా!

అమ్మో... అమరావతి డ్యూటీయా! - Sakshi


►బెంబేలెత్తిపోతున్న పొరుగు జిల్లాల పోలీసులు

►రాజధానిలో ట్రాఫిక్, బందోబస్తులకు పదేసి రోజుల డ్యూటీలు

►కడుపునిండా తిండి, కంటి నిండా నిద్రలేక అవస్థలు

►అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వానికి పట్టని వైనం

►కనీస వసతులు సమకూర్చని సర్కారు




అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో డ్యూటీ అంటే పొరుగు జిల్లాల పోలీసులు బెంబేలెత్తి పోతున్నారు. రాజధానిలో ట్రాఫిక్, ఎస్కార్ట్, బందోబస్తు తదితర విధుల కోసం వస్తున్న కానిస్టేబుళ్లకు సర్కారు కనీస సౌకర్యాలు సమకూర్చకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్కొక్కరు పదేసి రోజులు డ్యూటీ చేయాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసులకు ఇక్కడ డ్యూటీలు వేస్తున్నారు. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రంలో సుమారు 17వేల పోలీస్‌ సిబ్బంది కొరత ఉంది. దీంతో గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలోని ప్రతి సర్కిల్‌ నుంచి ఒకరు చొప్పున కేటాయిస్తున్నారు. వీరిని పదేసి రోజుల విధులకు రాజధాని ప్రాంతానికి డిప్యూటేషన్‌పై పంపిస్తున్నారు.



13 జిల్లాల నుంచి పది రోజులకు 878 మంది చొప్పున నెలకు 2,634 మందిని రాజధానిలో రోజువారీ విధులకు కేటాయిస్తున్నారు. వీరు నిత్యం ప్రముఖులు (వీఐపీలు) తిరిగే విజయవాడలో రోడ్లపై ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ విధులు నిర్వహిస్తున్నారు. నగరంతో ఏమాత్రం సంబంధం లేని పోలీసులు రోజూ ఎనిమిది గంటలపాటు ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తూ శ్వాసకోశ సమస్యలతో అనారోగ్యం పాలవుతున్నా పట్టించుకునే నాధుడు లేడు.


మరోవైపు రాజధాని ప్రాంతంలో వీఐపీలకు ఎస్కార్ట్, విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం, ఉండవల్లిలో సీఎం నివాసం, వెలగపూడి సెక్రటేరియెట్‌కు వెళ్లే దారిలోనూ పొరుగు జిల్లాల పోలీసులకు డ్యూటీలు వేయడంతో వారి అవస్థలు చెప్పనలవికావు. కనీసం మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేని ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్ల పరిస్థితి మరీ దయనీయం. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే నిందితుల ఎస్కార్ట్‌గా కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసులనే పంపుతుండటంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



తిండి.. నిద్ర కరువే..

పొరుగు జిల్లాల నుంచి విధి నిర్వహణకు వస్తున్న వారికి ప్రభుత్వం కనీస సౌకర్యాలు సమకూర్చకపోవడంతో సమయానికి తిండి, నిద్రలేక ఆరోగ్యం పాడవుతోందని వారు వాపోతున్నారు. మరోవైపు ఉండేందుకు లాడ్జి రూమ్‌కు రోజుకు కనీసం రూ.500, టిఫిన్, భోజనాలకు రూ.250 సొంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పది రోజులకు లాడ్జి, తిండి ఖర్చులు కింద రూ.7500 అవుతోందని కానిస్టేబుళ్లు అంటున్నారు.


ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో విధులకు వెళ్లిన పోలీసులకు అప్పట్లో వసతి సౌకర్యాలు సమకూర్చేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో విధులు నిర్వర్తించేందుకు పలువురు కానిస్టేబుళ్లు ఆయా జిల్లాల ఉన్నతాధికారుల వద్ద వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. రాజధాని విధుల కోసం జిల్లాల నుంచి పోలీసులు వెళ్లిపోవడంతో తమకు సిబ్బంది కొరత ఉంటుందని పలువురు పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top