రాత్రికి నంద్యాలలోనే చంద్రబాబు మకాం

రాత్రికి నంద్యాలలోనే చంద్రబాబు మకాం - Sakshi


కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక కార్యక్రమాలు ముగిసినా ఇవాళ రాత్రికి నంద్యాలలోనే మకాం వేయనున్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రలోభాల కోసమే చంద్రబాబు మకాం వేశారంటూ ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ సీపీ ఆరోపించింది. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు ఉప ఎన్నిక కోసం దిగజారి వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


కాగా నంద్యాల ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్‌ రానప్పటికీ ముఖ్యమంత్రి ఏకంగా నెలరోజుల వ్యవధిలో నంద్యాలలో రెండుసార్లు పర్యటించారు. మొదట్లో నంద్యాల పట్టణానికే పరిమితమైన సీఎం పర్యటన షెడ్యూల్‌ శుక్రవారం రాత్రి హడావుడిగా మార్పులు చేశారు. మొత్తం నియోజకవర్గంలో పర్యటించేలా మార్పు చేశారు. అంతేకాకుండా రాత్రికి నంద్యాలలోనే బసచేసి ప్రలోభ పర్వానికి పదును పెంచనున్నట్లు తెలుస్తోంది.



గత నెల 21న పర్యటించిన సీఎం తాజాగా ఇవాళ కూడా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కేవలం ఎన్నికల నేపథ్యంలోనే నంద్యాలను అభివృద్ధి చేయడం లేదని అన్నారు. అభివృద్ధి కోసమే భూమానాగిరెడ్డి తమ పార్టీలో చేరారని చెప్పారు.


ఈ నేపథ్యంలోనే ఆయన కోరిక నెరవేర్చడంలో భాగంగా రోడ్ల విస్తరణ, ఇళ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ప్రకటించారు. నంద్యాల ఎన్నికలు ఉన్నందున మరింతగా ఇక్కడ కేంద్రీకరించి అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. దీనిని గమనించి తమ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. ఇది ఎన్నికల సభ కాదంటూనే పార్టీ అభ్యర్థిని పక్కన ఉంచుకుని మరీ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top