దాద్రి ఘటనపై స్పందించిన ప్రణబ్

దాద్రి ఘటనపై స్పందించిన ప్రణబ్


న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో చోటు చేసుకున్న సంఘటనపై భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. మూల విలువలు ఉన్న సమాజంలో ఇలాంటి సంఘటనలకు చోటు లేదన్నారు.సహనంతో ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. బుధవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సభలో రాష్ట్రపతి ప్రణబ్ మాట్లాడుతూ... పురాతన నాగరికతల్లో శతృత్వ ధోరణిలు ప్రబలి అంతరించినా.. విలువలు మాత్రం ఇంకా నిలిచే ఉన్నాయని అందుకు కారణం మూల విలువలేనని ఆయన స్పష్టం చేశారు.


వాటిని మదిలో భద్రపరుచుకుని ప్రజాస్వామ్య దేశంలో మసులు కోవాలని సూచించారు. దాద్రి సంఘటన నేపథ్యంలో ఈ అంశంపై దాదాపు 15 నిమిషాల పాటు ప్రణబ్ అనర్గళంగా ప్రసంగించారు. దాద్రి సమీపంలోని బిసడ గ్రామంలో గోవధ వదంతుల నేపథ్యంలో గత సోమవారం రాత్రి సుమారు వంద మంది స్థానికులు ఓ ముస్లిం కుటుంబంపై దాడి చేశారు. మహ్మద్ అక్లాఖ్‌ (50) ను రాళ్లతో కొట్టి హత్యచేశారు.



ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడి కుమారుడు డానిష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి యూపీ పోలీసులు పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top