నాటోకి అమెరికా చెల్లుచీటీ?!

నాటోకి అమెరికా చెల్లుచీటీ?! - Sakshi

సైనిక కూటమికి కాలం చెల్లిందంటున్న ట్రంప్ 

- అమెరికా కొత్త అధ్యక్షుడి తీరుతో ఖిన్నమైన నాటో సభ్య దేశాలు 

- నాటో బలహీనమైతే రష్యా చెలరేగవచ్చంటున్న నిపుణులు 

- రక్షణ బాధ్యతను స్వయంగా తీసుకునే యోచనలో యూరప్ 

 

(సాక్షి నాలెడ్జ్ సెంటర్) 

ఉత్తర అట్లాంటిక్ దేశాల సంస్థ (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్- నాటో)కి కాలం చెల్లిపోయిందని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నాటో సభ్య దేశాలను కలవరపెడుతున్నాయి. సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా అమెరికా చొరవతో ఆవిర్భవించిన ఈ సైనిక కూటమి మనుగడను.. ఇప్పుడు అదే అమెరికా ప్రశ్నార్థకంగా మారుస్తోంది. 

 

పాతికేళ్ల కిందటే సోవియట్ పతనమై ప్రచ్ఛన్న యుద్ధం సమసిపోయి అమెరికా అగ్రరాజ్యంగా ఆవిర్భవించినప్పటికీ.. రష్యా - అమెరికా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు సన్నిహితుడిగా పేరుపడ్డ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచీ ప్రపంచ వేదికపై పెను మార్పులు చోటు చేసుకుంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా రష్యాతో దోస్తీతో అమెరికాకు కూడా మేలు జరుగుతుందని ట్రంప్ వీలుదొరికినపుడల్లా ఉద్ఘాటిస్తున్నారు. మరో మూడు రోజుల్లో అధ్యక్ష పదవి చేపట్టనున్న ట్రంప్.. ఒకవైపు నాటోకు కాలం చెల్లిందని సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. మరోవైపు రష్యాపై ఆంక్షల వల్ల ఆ దేశం దెబ్బతింటోందని, దానితో మంచి ఒప్పందాలు చేసుకోవచ్చేమో చూడాలని వ్యాఖ్యానించడం విశేషం. 

 

ఉక్రెయిన్, సిరియా దేశాల్లో రష్యా జోక్యం కారణంగా అమెరికా, బ్రిటన్ సహా పలు నాటో దేశాలు ఆ దేశంపై ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 2014లో క్రిమియాను రష్యా బలవంతంగా తన దేశంలో విలీనం చేసుకోవడంతో రష్యా - నాటో దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రచ్ఛన్నయుద్ధం స్థాయికి పెరిగాయి. రష్యా తన పశ్చిమ సరిహద్దుల్లో అణ్వస్త్ర సామర్థ్యమున్న క్షిపణులను మోహరించడం, క్రమం తప్పకుండా సైనిక విన్యాసాలు నిర్వహించడం చేస్తోంటే.. నాటో దేశాలు మూడు లక్షల మంది సైనికులను అప్రమత్తం చేశాయి. మరిన్ని దళాలను మోహరించేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో నాటోకు కాలం చెల్లిందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నాటో దేశాలనే కాకుండా.. రష్యా అనుకూల తిరుగుబాటుదారులతో పోరాడుతున్న ఉక్రెయిన్ను కూడా కలవరపెడుతున్నాయి. నాటో బలహీనమయ్యే సూచనలు ప్రస్ఫుటమైతే రష్యా సైనికంగా మరింతగా విజృంభించే అవకాశాలు లేకపోలేదని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

 

నాటో కూటమికి కాలం చెల్లిపోయిందనడానికి ట్రంప్ చెప్తున్న మొదటి కారణం.. దానిని చాలా చాలా ఏళ్ల కిందట రూపొందించారనేది. రెండో కారణం.. నాటో సభ్య దేశాలు అవి చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించడం లేదని, అమెరికాయే ఎక్కువ భారం మోస్తోందని. నిజానికి ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే నాటో కూటమిపై తన వైఖరి ఏమిటనేది బాహాటంగా చెప్పారు. నాటో సభ్య దేశాలను రక్షించడానికి అయ్యే ఖర్చును మిత్ర దేశాలు తగిన విధంగా తిరిగి చెల్లించకపోతే.. వాటికి సాయం చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానన్నది ట్రంప్ ఎన్నికల మాట. నాటో కూటమి రక్షణ వ్యయం ఇటీవలి కాలంలో సభ్య దేశాల మధ్య తరచుగా విభేదాలకు దారితీస్తోంది. 

 

నిజానికి.. నాటో సభ్య దేశాలన్నీ తమ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో కనీసం 2 శాతాన్ని రక్షణ వ్యయం కోసం కేటాయించాలన్నది నిబంధనల్లో ఒకటి. కానీ.. నాటో దేశాల రక్షణ వ్యయంలో దాదాపు 70 శాతం ఒక్క అమెరికాయే భరిస్తుండటాన్ని ట్రంప్ వంటి అమెరికా జాతీయవాదులు వ్యతిరేకిస్తున్నారు. ''సభ్య దేశాలు తమ న్యాయమైన వాటాను చెల్లించడం లేదు. కేవలం ఐదు దేశాలు మాత్రమే అవి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తున్నాయి. అది సరిపోదు'' అని ట్రంప్ స్పష్టంచేశారు. అమెరికా, బ్రిటన్, గ్రీస్, పోలండ్, ఎస్టోనియాలు మాత్రమే జీడీపీలో 2 శాతాన్ని మించి అందిస్తున్నాయి. 2016లో అమెరికా 6,600 కోట్ల డాలర్లు రక్షణ రంగం కోసం వ్యయం చేసింది. బ్రిటన్ అందులో పదో వంతు మొత్తాన్ని ఖర్చు పెట్టింది. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ సహా మిగతా దేశాలన్నీ తమ జీడీపీలో రెండు శాతం కన్నా తక్కువే నిధులు అందిస్తున్నాయి. 

 

నాటోకు కాలం చెల్లిందన్న ట్రంప్ వ్యాఖ్యలతో.. అందులో భాగస్వామిగా ఉన్న యూరప్ దేశాలు ఖంగుతిన్నాయి. దీంతో యూరప్ దేశాలు సమైక్యం కావాలని, తమ రక్షణ బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకోవాల్సి ఉంటుందని ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు స్పందించాయి. నాటో నుంచి అమెరికా వైదొలగితే కెనడా వంటి దేశాల రక్షణ వ్యయం భారీగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కెనడా తన జీడీపీలో ఒక్క శాతం మాత్రమే రక్షణ రంగం కోసం వెచ్చిస్తోంది. 

 

నాటో 1949లో ఏర్పాటయిన ఒక సైనిక కూటమి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, కెనడా సహా ఉత్తర అమెరికా, యూరప్ ఖండాల్లోని 28 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. సభ్య దేశాల ఉమ్మడి రక్షణ, సైనిక వ్యవహారాల్లో పరస్పర సాయం ప్రధాన లక్ష్యాలు. 

 

నాటో సభ్యదేశాలివీ.. అమెరికా, అల్బేనియా, బెల్జియం, బల్గేరియా, బ్రిటన్, కెనడా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐస్ల్యాండ్, ఇటలీ, లాత్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోలండ్, పోర్చుగల్, రొమేనియా, స్లొవేకియా, స్లొవేనియా, స్పెయిన్, టర్కీ.

 

2015లో రక్షణ వ్యయం: 867 వందల కోట్ల డాలర్లు 

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top