జనమంతా ఖుష్‌

జనమంతా ఖుష్‌ - Sakshi


వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: కేసీఆర్‌

- సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరుతున్నాయి

- వచ్చే నెలలో పార్టీ సంస్థాగత ఎన్నికలు

- 6వ తేదీన గ్రామ కమిటీలకు.. 12, 13న మండల కమిటీలకు..

- 21న అధ్యక్షుడి ఎన్నిక.. ప్లీనరీ

- 27న వరంగల్‌లో బహిరంగ సభ




సాక్షి, హైదరాబాద్‌


వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అఖండ విజయం సాధిస్తుందని, ప్రజలు అధికారం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ముఖ్యపాత్ర పోషించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతోపాటు పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.



శనివారం ప్రగతిభవన్‌లో మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు, ప్లీనరీ నిర్వహణ, పార్టీ వార్షికోత్సవ సభ తదితర అంశాలపై చర్చించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఏర్పాటు చేసే పార్టీ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలని నేతలకు సూచించారు. ఈసారి బడ్జెట్లో కొత్తగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేశామని.. దాని స్ఫూర్తిని అర్థం చేసుకుని ఆయా వర్గాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేయాలన్నారు. ఇక బీసీ వర్గాలు, కులవృత్తులకు ఆర్థిక చేయూత అందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని.. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు.



పార్టీ సంస్ధాగత ఎన్నికల తేదీలు ఖరారు

ఏప్రిల్‌ 6న పార్టీ గ్రామ కమిటీల ఎన్నిక.. 12, 13 తేదీల్లో మండల కమిటీల ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. 14వ తేదీన రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక నోటిఫికేషన్, 18న నామినేషన్ల స్వీకరణ, 20న నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉంటుందని తెలిపారు. 21న హైదరాబాద్‌ సమీపంలోని కొంపల్లిలో ప్లీనరీ నిర్వహిస్తామని, అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 27వ తేదీన వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్లీనరీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్‌పర్సన్లు, సహకార బ్యాంకు చైర్మన్లు, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, నగర మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, సింగిల్‌ విండో చైర్మన్లు, ఆత్మ కమిటీ సభ్యులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. వరంగల్‌ సభకు అయ్యే ఖర్చుల కోసం పార్టీ నాయకులు శ్రమదానం చేసి విరాళాలు సేకరించాలని కేసీఆర్‌ సూచించారు. తాను కూడా శ్రమదానం చేసి విరాళాలు సేకరిస్తానని.. పార్టీ నాయకులంతా నియోజకవర్గాల్లో శ్రమదానం చేయాలని చెప్పారు.



అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్‌ అధికారిగా నాయిని

పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నిర్వహించే ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా నాయిని నర్సింహారెడ్డిని నియమించారు. గ్రామ శాఖ, మండల శాఖ ఎన్నికలకు కూడా రిటర్నింగ్‌ అధికారులను నియమించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఎన్నికలు, బహిరంగసభ ఏర్పాట్లు, జన సమీకరణకు రాష్ట్రస్థాయిలో సీనియర్‌ నాయకులు పర్యాద కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎండీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డిలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. వరంగల్‌(రూరల్‌), వరంగల్‌ (అర్బన్‌), జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలకు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు.. ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మేడ్చల్‌ జిల్లాలకు సముద్రాల వేణుగోపాలాచారి.. మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వి.గంగాధర్‌.. హైదరాబాద్‌ జిల్లాకు బొంతు రామ్మోహన్‌లను ఇన్‌చార్జులుగా నియమించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top