‘నాన్నకు, నాకు తేడా అదే..’

‘నాన్నకు, నాకు తేడా అదే..’


‘కొడుకులు తన అడుగుజాడల్లోనే నడవాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అందులో తప్పులేకపోవచ్చు. కానీ నేను మాత్రం కొంచెం తేడా. మా నాన్న మల్లయోధుడు. నేను ఫుట్‌బాలర్‌ని..’అని చమత్కరించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్. అదే సమయంలో ‘వచ్చే ఎన్నికల్లో మా పార్టీ గెలిచినా, నేను సీఎం అవుతానో లేదో చెప్పలేను’అంటూ వైరాగ్యం ప్రదర్శించారు. ఓ జాతీయ చానెల్‌ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న అఖిలేశ్ పలు అంశాలపై సూటిగా సమాధానాలిచ్చారు..



‘కష్టాల్లో ఉన్నప్పుడే మనకు నిజమైన స్నేహితులెవరో తెలుస్తుంది. కొద్ది రోజులుగా సమాజ్ వాదీ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నుంచి వెలకట్టలేని పాఠాలు నేర్చుకున్నా. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ గెలిచినా నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పలేను. నేతాజీ(ములాయం సింగ్‌ యాదవ్) నిర్ణయమే శిరోధార్యం. ఆయనను ఎవ్వరూ ధిక్కరించలేరు. అయితే నాపై సాగుతోన్న వ్యతిరేక ప్రచారాన్ని మాత్రం కచ్చితంగా ఖండిస్తా’ అని అఖిలేశ్ అన్నారు.



అతను అంకుల్.. ఆమె అక్క!

ములాయంకు అత్యంత ఆప్తుడు, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అయిన అమర్ సింగ్ తో విబేధాలపై స్పందిస్తూ..‘ఆయన(అమర్) నాకు చిన్నాన(అంకుల్)తో సమానం. ఒకవేళ నేను పార్టీ అధ్యక్షుడిని అయిఉంటే, అమర్‌ సింగ్ విషయంలో నేతాజీకి సలహా ఇచ్చేవాణ్ని. ఆయన(అమర్)పై చర్యలకు వెనకాడకపోయేవాణ్ని’ అని అఖిలేశ్ సమాధానమిచ్చారు. ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బీఎస్పీనే అని, ఆ పార్టీ అధినేత్రి మాయవతి తనకు బువా(అక్క)తో సమానమని అఖిలేశ్ అన్నారు. ‘మాయావతిని కలవడానికి వెళ్లాలంటే ఆఫీసు బయటే చెప్పులు విడిచి వెళ్లాలి. ఆమె హయాంలో జరిగిన అక్రమాలు యూపీలోని ప్రతి ఊళ్లో ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి. నా ఉద్దేశం ప్రకారం ఆమె యూపీలో తిరిగి కోలుకోవడం దాదాపు కలే’అని యూపీ సీఎం చెప్పుకొచ్చారు.



ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి నోట్ల రద్దు అంశంపై మాట్లాడానని యూపీ సీఎం అఖిలేశ్ వెల్లడించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా..‘అవును. ఇబ్బందులు ఉంటాయ్. త్వరలోనే పరిష్కరిస్తాం’అని మోదీ సమాధానమిచ్చినట్లు పేర్కొన్నారు. ‘ఆర్థిక సంక్షోభం నుంచి ఇండియా బయటపడిందటే బ్లాక్ మనీ వల్లే’నని అఖిలేశ్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.



ఫొటో: ములాయం యుక్తవయసులో, అఖిలేశ్ బాల్యంలో ఉన్నప్పటిది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top