బ్లడ్ డైమండ్స్.. దావూద్ నయా దందా

బ్లడ్ డైమండ్స్.. దావూద్ నయా దందా - Sakshi


రియల్ ఎస్టేట్, మనీ లాండరింగ్, హవాలా, బెట్టింగ్, నకిలీ కరెన్సీ.. నిన్నమొన్నటివరకు ఈ మార్గాల్లో డబ్బు సంపాదించింది, దానిలో కొంత భాగాన్ని ఉగ్రవాద సంస్థలకు కప్పంగా సమర్పించుకునే మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఇప్పుడు రూటు మార్చాడు. ప్రస్తుతం ఏ టు డి.. అంటే ఆఫ్రికా టు దుబాయ్కి సరుకు రవాణా చేస్తున్నాడు. దుబాయ్లో ఆ సరుకుకు సానపెట్టి ఇతరదేశాల్లో  భారీగా సొమ్ముచేసుకుంటున్నాడు.



దావూద్ కొత్తగా ప్రారంభించిన ఆఫ్రికన్ బ్లడ్ డైమండ్స్ దందా మూలాలను భారత ఇంటెలిజెన్స్ సంస్థలు ఇటీవలే కనిపెట్టగలిగాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆదేశాలతో రంగంలోకి దిగిన భారత్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్.. దావూద్ నెత్తుటి వజ్రాల వ్యాపారానికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించారు. ఆ వివరాల ప్రకారం..



వజ్రాలకు పుట్టినిల్లులుగా ఉంటూ అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న కాంగో, అంగోలా, సియారా లియోన్ లాంటి ఆప్రికా దేశాల్లో.. తిరుబాటు దళాలు తమ ఆధీనంలోని ప్రాంతాల్లో లభించే వజ్రాలను విదేశీయులకు అమ్ముతూ ఉంటాయి. అక్కడి అమాయక ప్రజలను బానిసలుగా మార్చుకుని గనులు తవ్వించి వజ్రాలను వెలికితీస్తూ ఉంటాయి. మాటవినని వారిని హతమార్చడమైతేనేమీ, సైన్యం జరిపేదాడుల్లోనైతేనేమీ.. ఈ వజ్రాల వేటలో ఇప్పటికే కొన్ని లక్షల మంది బానిస కూలీలు నెత్తురు చిందించారు. అందుకే వాటికి బ్లడ్ డైమండ్స్ అని పేరొచ్చింది. ఇక దావూద్ దందా ఎలా సాగుతుందంటే..



తిరుగుబాటు దళాలకు కావలసిన ఆయుధాలు, డబ్బులు ఇచ్చి.. ప్రతిగా ముడి వజ్రాలను తీసుకుని విదేశాల్లోని వ్యాపారులకు పంపే బ్రోకర్లు ఆఫ్రికా అంతటా విస్తరించి ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒకడు రహమత్. ప్రస్తుతం దావూద్కు వజ్రాలు సరఫరా చేస్తున్నది ఇతడేనని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఎంపిక చేసిన ఆఫ్రికన్ యువతీ యువకుల ద్వారా విమానాల్లో వజ్రాలు దుబాయ్కి చేరతాయి. ఒక్కో ట్రిప్పులో ఎక్కువలో ఎక్కువ ఆరు కోట్ల విలువైన వజ్రాలు సరఫరా అవుతాయి. ఒక్కో కొరియర్కు ఆరు లక్షల రూపాయలను ఫీజుగా ఇస్తారు. అలా దుబాయ్ వచ్చిన వజ్రాలన్నీ నేరుగా అల్ నూర్ డైమండ్స్ అనే కంపెనీకి చేరతాయి. ఇది దావూద్ సొంత కంపెనీ. తర్వాతిపని వజ్రాలకు సానపెట్టడం..



సానపెట్టే పనంతా ఫిరోజ్ ఒయాసిస్ అనే వ్యక్తి చూసుకుంటాడు. దావూద్కే చెందిన విజ్ ఓయాసిస్ ఆయిల్, ల్యూబ్ ఎల్సీసీలు నిర్వహించేది ఫిరోజే. తమిళనాడుకు చెందిన ఇతను మాతృభాషతోపాటు అరబిక్, ఇంగ్లీష్, హిందీల్లో అనర్గళంగా మాట్లాడగలడని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా సానపెట్టిన తర్వాత అమ్మకానికి సిద్ధంగా ఉన్న వజ్రాలు డాక్టర్ చేతిలోకి వెళతాయి.



ఈ డాక్టర్ అలియాస్ జావేద్ చుతాని అనే వ్యక్తే వజ్రాలను విదేశాలకు సరఫరా చేస్తాడు. 'నిజానికి డాక్టర్ ఓ ప్రొఫెషనల్ బుకీ. రియల్ ఎస్టేట్ మీద అతనికున్న ఇంట్రెస్ట్ కొద్దీ దావూద్కు దగ్గరయ్యాడు. గ్యాంబ్లింగ్లో సిద్ధహస్తుడు. ప్రస్తుతం ఫిరోజ్, దావూద్లకు అత్యంత సన్నిహితుడిగానూ మారాడు' అని ఓ ఇంటెలిజెన్స్ అధికారి అనధికారికంగా పేర్కొన్నారు.



కాగా, ప్రపంచంలో కొనుగోలు అయ్యే 11 వజ్రాల్లో 10 ఇండియాలో నగిషీలు దిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దావూద్ బ్లడ్ డైమండ్స్ ఇండియాకు కూడా రవాణా అవుతున్నాయా? ఒకవేళ జరిగితే అది ఏయే మార్గాల్లో జరుగుతోంది? అనే విషయాలపై ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించారు ఇంటెలిజెంట్ ఏజెంట్స్.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top