సండ్ర - సెబాస్టియన్ ఏం మాట్లాడుకున్నారంటే..!

సండ్ర - సెబాస్టియన్ ఏం మాట్లాడుకున్నారంటే..! - Sakshi


ఓటుకు కోట్లు కేసులో మరికొన్ని కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టుపై కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఏసీబీ వీటిని పొందుపరిచింది. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం వెనుక పథక రచనను ఏసీబీ పూసగుచ్చినట్లు వివరించింది.  ఆపరేషన్‌ జరుగుతున్న సమయంలో సండ్ర ఎక్కడున్నారు, ఎవరెవరితో మాట్లాడారనే మొత్తం స్టోరీని ఏసీబీ కోర్టు ముందు ఉంచింది. ఓపక్క మహానాడు, మరోవైపు పథకరచన అంతా ఏకకాలంలో జరిగిపోయాయి.



ఈ కేసులో రేవంత్‌రెడ్డి ఎంత కీలకంగా వ్యహరించారో... అంతే కీలకంగా సండ్ర వెంకట వీరయ్య కూడా వ్యవహరించారని ఏసీబీ చెబుతోంది.  ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు కేవలం ఒకరిద్దరి ఆలోచన కాదని, ఇది పూర్తిస్థాయిలో వ్యవస్థీకృత నేరమని ఏసీబీ తన రిమాండ్‌ రిపోర్టులో చెప్పకనే చెప్పింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ కేంద్రంగా ఈవ్యవహారం నడిచిందని ఏసీబీ రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించింది.



సెల్‌నంబర్లు.. సంభాషణలు

మే 31న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రెడ్‌ హాండెడ్‌గా పట్టుకున్న సమయంలో ఏసీబీ కొన్ని ఫోన్లను స్వాధీనం చేసుకుంది. రేవంత్‌రెడ్డి ఫోన్‌తో పాటు సెబాస్టియన్‌, ఉదయ్‌సింహా ఉపయోగించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపింది. ఈ కేసులో రెండో నిందితుడగా ఉన్న సెబాస్టియన్‌ ఫోన్‌లో కొన్ని కాల్స్‌ రికార్డు చేసినట్టుగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ పరీక్షల్లో తేలింది.  మే 23 నుంచి మే 31 వరకూ మొత్తం 32 సార్లు సెబాస్టియన్‌ - సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుకున్నట్టుగా ఎఫ్‌ఎస్‌ఎల్‌  స్పష్టం చేసింది.



ఎమ్మెల్యే కొనుగోలు ఆపరేషన్‌ కోసం సండ్ర మొత్తం రెండు ఫోన్‌ నంబర్లలో మాట్లాడారు.  87908 25678 నంబర్‌ నుంచే కాక మరో నంబర్‌ 94406 25955 నుంచి కూడా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. ఈ నంబర్లు రెండూ వెంకట వీరయ్యవేనంటూ సంబంధిత టెలికాం కంపెనీల నుంచి ఏసీబీ అధికారికంగా వివరాలు తీసుకుంది.



ఆపరేషన్‌ నడిచిన కాలంలో 87908 25678  నంబర్‌ నుంచి ఎమ్మెల్యే వీరయ్య - 95059 00009 నంబర్‌లో ఉన్న రేవంత్‌రెడ్డితో 18 సార్లు మాట్లాడారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి కూడా వీరయ్యకు రెండుసార్లు కాల్‌ చేశారు. ఈ కాల్స్‌ అన్నీ మే 24 నుంచి మే 31 మధ్య చోటుచేసుకున్నవే. మరింత లోతుగా దర్యాప్తుచేసిన తర్వాత వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌ల మధ్య మరో 19 సార్లు సంభాషణలు జరిగాయని ఏసీబీ సవివరంగా కోర్టుకు నివేదించింది.  వీరయ్య నంబర్‌ 87908 25678  నుంచి సెబాస్టియన్‌ ఫోన్‌ 93943 26000కు కాల్స్‌ వెళ్లాయని నిర్ధారించారు. వీరయ్యకు చెందిన మరో ఫోన్‌ నంబర్‌ 94406 25955  నుంచి కూడా సెబాస్టియన్‌ నంబర్‌కు కాల్స్‌ వెళ్లాయని ఏసీబీ ధ్రువీకరించింది. ఈ వివరాలను కోర్టు ముందు ఉంచింది.



ఫోన్‌ రికార్డింగ్‌.. ఉద్దేశపూర్వకమా?

ఈ కేసులో మొత్తం ట్విస్ట్‌ సెబాస్టియన్‌ ఫోన్‌ రికార్డింగ్‌. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల సమయంలో సెబాస్టియన్‌ హెచ్‌టీసీ ఫోన్‌ను ఉపయోగించారు. ఏసీబీ అధికారులు ట్రాప్‌ చేస్తున్నప్పుడు సెబాస్టియన్‌ నుంచి ఈ ఫోన్‌నే స్వాధీనం చేసుకున్నారు. ఉద్దేశపూర్వకమో లేక అప్రయత్నమో తెలియదు గానీ మొత్తం కాల్స్‌ అన్నీ.. ఈ ఫోన్‌లో రికార్డయ్యాయి. వీటినే ఫోరెన్సిక్‌ నిపుణులు వెలికితీశారు. రిమాండ్‌ రిపోర్టులో మొత్తం మూడు కాల్స్‌కు సంబంధించి సంభాషణలను ఏసీబీ యథాతథంగా రిమాండ్‌ రిపోర్టులో పొందుపరించింది.



మే 27 రాత్రి 9:45 నిమిషాలకు  2:09 నిమిషాల సేపు వెంకటవీరయ్య, సెబాస్టియన్‌ మాట్లాడుకున్నారు. సెబాస్టియనే మొదట వీరయ్యకు ఫోన్‌ చేశారు.



ఏ-2 (సెబాస్టియన్‌): ఆ.. ఎమ్మెల్యే గారండీ.. సర్‌

ఎమ్మెల్యే (వెంకటవీరయ్య): ఏమైంది..?

ఏ-2: సర్‌, అది .. ఇప్పుడు మనకు ఏం ఇన్ఫర్మేషన్‌ కావాలి సర్‌.. ఆయన గురించి,,,

ఎమ్మెల్యే: అంటే మనకు ఎలక్షన్స్‌లో ఓట్లు ఉంటాయ్‌...

ఏ-2: ఆ.. ఎమ్మెల్సీ...

ఎమ్మెల్యే: ఎలక్షన్స్‌ల.. , ఎలక్షన్స్‌ల ఆయనకు ఓటు హక్కు ఉంది.

ఏ-2: అవును

ఎమ్మెల్యే : ఇంగ.. ఆయనేమన్నా.. మనకు అమౌంట్‌కు లొంగుతాడేమో, మన పార్టీకి సహకరించమని అడగాలి.

ఏ-2: ఓహో.. అదా...

ఎమ్మెల్యే : ఎందుకంటే... ఆయనకు ఫరదర్‌ రాజకీయాలతో అవసరం లేదు కదా? మేమంటే.. ఎలక్షన్స్‌లో గెలవాల.. ఒకసారి నామినేటెడ్‌ అయిపోయిద్ది గదా.., డబ్బు ముఖ్యం కదా.. ఆయనకు .

ఏ-2:అదయితే కరెక్టు.

ఎమ్మెల్యే :  ఆ.. ఆ... సోర్స్‌ మనకు కావాలి.

ఏ-2: ఓహో.. మనకు ఎంత టైముంది... సర్‌.. మనకు.

ఎమ్మెల్యే : మనకు.. ఒకటవ తారీఖు నాడు పోలింగ్‌ ఉంది.

ఏ-2: ఓకే.. ఈలోపుగా మనం టాప్‌ చేయాలి.

ఎమ్మెల్యే : ఆ..ఆ.. ఈ లోపుల టాప్‌ చేసి.. ఆయనతో మీటింగ్‌ ఏర్పాటు చేస్తే...

ఏ-2: ఒకే సర్‌. ఎట్లా మనం.. ఆయనకు... ఎక్కడన్నా, మనం హోటల్లో టైం ఇద్దామా? మాట్లాడటానికి లేదా...

ఎమ్మెల్యే : ఆహా... మీరు ఆయనతో.. మీరు ఆయనతోని మళ్లా... దగ్గరా? ఎట్లా? మనం డీల్‌ చేసి సక్సెస్‌ కావాలి. ఫెయిల్‌ కావొద్దు.

ఏ-2: ఓహో.. ఆ రెస్పాన్స్‌బిలిటీ... మరి మీరు తీసుకుంటారా సర్‌.. నేను మాట్లాడతా గనక...

ఎమ్మెల్యే : ఆ అమౌంట్‌.. ఆయన ఓటుకు రెస్పాన్స్‌ ఇస్తే.. అమౌంట్‌కు రెస్పాన్స్‌బిలిటీ నాది అయితది. ఆయన ఎవరి పేరు చెప్తే.. ఆడ బెడదాం. మధ్యవర్తి ఖాయం ఉంటుంది.

ఏ-2: ఆహా.. సర్‌. ఎట్ల సర్‌.. ఇప్పుడు మనం ఆయన ఓటు, మనకు ఏయాల.. మన ఎమ్మెల్యే, మన ఎమ్మెల్సీకి.  

ఎమ్మెల్యే : మన.. మన అభ్యర్థికి వేయాల.

ఏ-2: ఇన్‌ కేస్‌..లేదు అంటే ఎట్లా.. ఎస్కేప్‌ చేపియ్యాలి మనం.. ఆరోజు ఆయనకి మనం. ఏ బాంబే, కలకత్తా వెళ్లిపోయేటట్లుగ మనం.. ఏర్పాట్లు చేయాల మనం. ఆబ్సెంట్‌ అయినా.. ఫర్వాలేదు కదా ఓటింగ్‌కు.  

ఎమ్మెల్యే : ఆబ్సెంట్ అంటే... కంటే కూడా, ముందు ముందు మీరు ఫస్ట్‌... ఓటుకు అడగాలి. లేకపోతే ఆబ్సెంట్‌కు అడుగుదాం. ముందు ఓటుకు అడగాలి, ఓటు కావాలి.

ఏ-2: ఓకే ... ఓటు కావాలి.

ఎమ్మెల్యే : ఊహుం... ఊహుం..

ఏ-2: సరే.. సరే.. సరి. నేను .. నాకిప్పుడు ఈ రెండు రోజులు మన మహానాడు బీజీ కదా సర్‌. అయినాకూడా నేను ...

ఎమ్మెల్యే :మహానాడు ఉన్నది. నేను సెపరేట్‌ పర్మిషన్‌ తీసుకుంటాను.  

ఏ-2: ఆ.. సర్‌.

ఎమ్మెల్యే : నాకు రేపటికి కావాలి.

ఏ-2: సరే.. సరే.. రేపు మార్నింగ్‌ నేను అక్కడకి వస్తున్నామన్నా...

ఎమ్మెల్యే : ఆ...

ఏ-2: ఎన్టీఆర్‌ ఘాట్కు వస్తున్నాం, ప్రేయర్‌ చేయడానికి సర్‌... సర్‌ రమ్మన్నారు.

ఎమ్మెల్యే : సర్‌.. ఎన్నింటికి వస్తున్నారు ఘాట్‌కి.

ఏ-2: ఏమో సర్‌.. 7 గంటలకు రమ్మన్నారు నన్ను.

ఎమ్మెల్యే :  ఓకే.. మీరు మీ పని చూసుకోండి. మిగతా పని తర్వాత చూద్దాం.

ఏ-2: ఒకే సర్‌.. మంచిది.. నేను టచ్‌లో ఉంటా మీకు.  ఓకే..

ఎమ్మెల్యే :థాంక్యూ...

ఏ-2: థాంక్యూ.. థాంక్యూ... సర్‌

------------------------------------------------

మే 28 సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు మరో 3:10 నిమిషాల పాటు వీరయ్య, సెబాస్టియన్‌ మాట్లాడుకున్నారు. ఈసారి కూడా సెబాస్టియనే వీరయ్యకు కాల్‌ చేశారు.



ఏ-2: (సెబాస్టియన్‌):  ఎమ్మెల్యే గారూ నమస్కారం సార్‌...

ఎమ్మెల్యే  (వెంకటవీరయ్య): హలో...

ఏ-2: నమస్కారం సర్‌.. ఎమ్మెల్యేగారూ...

ఎమ్మెల్యే : నమస్కారం.. నమస్కారం.. చూశానూ.. మీ మెసేజ్‌ చూశాను.

ఏ-2: సర్‌.. ఆ..ఆ..

ఎమ్మెల్యే :  ఇప్పుడు మీరు ఎక్కడున్నారు. ఇప్పుడు..

ఏ-2: నేనాసర్‌.. నేను మా ఆఫీసులో ఉన్నాను (మోతీనగర్)

ఎమ్మెల్యే : ఇవాళ మహానాడు... , మహానాడు..

ఏ-2:రాలేదండి సర్‌. ఇ.. ఇగ.. పొద్దుగాల నేను అక్కడకి సమాధి దగ్గరకి పోయినా. ఇవాళ సర్వమత సమ్మేళనం కింద.. అందరి మతాల పెద్దలు వచ్చి, ప్రార్ధన చేయాల. అందులో మాదిగూడా ఉండె.

ఎమ్మెల్యే :  ఓకే

ఏ-2: సర్‌.. వచ్చారు. అందరొచ్చారు. వచ్చిన తర్వాత.. మాకు అక్కడే పది అయిపోయింది.

ఎమ్మెల్యే : ఓకే ..ఓకే

ఏ-2: సర్‌.. వెంటనే.. అంటే సమాధిని చూసేసి.. ఫ్లవర్‌ చల్లి వెళ్లిపోయారు. మేం అక్కడే ఉన్నాం. అక్కడనుంచీ మీరు చెప్పిన పని గురించి.. నేను అక్కడకి పోయినా.

ఎమ్మెల్యే : అదే ముఖ్యం లెండి.. ఇవాళ.  అదే ముఖ్యం.. అదే ముఖ్యం.

ఏ-2:అదీ.. మీరు చెప్పారు కదా..? అందుకొరకు నేనుబోయాను.. మాట్లాడినా.

ఎమ్మెల్యే : ఆ...

ఏ-2: ఆ.. ఆ. మాట్లాడితే ఆయన .. మనకు, మనకు.. చెప్పకుండా ఆల్రెడీ ఎవరో ఈరోజు ఉదయం పోయిండ్రంట.

ఎమ్మెల్యే : ఆహా..

ఏ-2: పోతే వాళ్లవర్షన్‌కు, నా వర్షన్‌కు డిఫరెంట్‌ ఉంది.

ఎమ్మెల్యే : ఆ.. ఆ.. ఆ..

ఏ-2: అయితే... ఆయనేమన్నాడంటే.. నువ్వు మాకు బిషప్‌. నువ్వు చెప్పేది మాకు నమ్ముకం ఉంటాది.  వాళ్లు చెప్పేది.. ఏమో. ఎట్లంటావో పోతరు. ఎందో మళ్లీ.. నిజమా? కాదా? ఏందో మళ్లీ... నాకు చెడ్డపేరు వస్తదేమో.. అని ఒక మాట అన్నరు.

ఎమ్మెల్యే : ఓ..ఓ..

ఏ-2: అయితే... నేను ఆయన్ను ఎట్లా మేనేజ్‌ చేసినా అంటే.. ఇన్‌కేస్‌ ముందు.. బీజేపీలో అట్కిన్సన్ అనే ఒక రాజ్యసభ మెంబర్‌ ఉండే.., నామినేటెడ్‌ ఆంగ్లో. ఆయననే నేనే ప్రమోట్‌ చేసినా.. మా బిషప్‌లకు చెప్పి.

ఎమ్మెల్యే : ఓకే.

ఏ-2: మాకు, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది. బీజేపీ ఉంది. మీక్కావాలంటే.. ఇక్కడ పోయినా కూడా, మేం ఢిల్లీ వరకూ రికమెండ్ చేయగలుగుతాం. ఏదైనా మైనార్టీ కమిషన్‌లో బోర్డు మెంబర్‌గా ఒకటి, రెండోది.. ఆంధ్రాలో ఇంగ.. మాకు నామినేటెడ్‌ ఆంగ్లో ఇండియన్‌కు సీటివ్వలేదు. మీలో ఎవరైనా మీ చుట్టాలు ఉంటే.. రికమెండ్ చేయ్‌..., బాబుతో మాట్లాడతా...

ఎమ్మెల్యే : ఓకే

ఏ-2: మూడోది.. మొత్తం మన ప్రభుత్వం.. ఆంధ్రాలో నీకేపని కావాలన్నా, నువ్వు ప్రతి మంత్రీ చేసిపెడతాడు నీకు.

ఎమ్మెల్యే : అవును.

ఏ-2: నాల్గోది.. వచ్చే ఎలక్షన్లో, 100 పర్సంట్‌.. మన టీడీపీనే వస్తాది.. ఈడ. వస్తే.. మళ్లీ నీ పేరే ప్రపోజ్‌ చేస్తాం

ఎమ్మెల్యే :  అవును.

ఏ-2:  నాలుగు ఆప్షన్స్‌ ఇచ్చాం సర్‌.

ఎమ్మెల్యే : ఆ..ఆ...

ఏ-2: ఇచ్చేవరకూ మస్త్‌... ప్లీజింగ్‌ అయిపోయిండు.. ఆయన, మీరు చెప్పింది చాలా బాగుంది. నాకు నచ్చింది. పొద్దుగాల వచ్చినవాల్లు.. వేరే విధంగా మాట్లాడిండ్రు అని అన్నాడు.

ఎమ్మెల్యే : అ...

ఏ-2: వాళ్లను పక్కకు పెట్టేసెయ్‌.. నేను బిషప్‌ను. నేను క్రిస్టియన్‌ను... , నువ్వు క్రిస్టియన్‌వు.

ఎమ్మెల్యే :  అవును.

ఏ-2: నేనేం చేస్తానో.. అది అయితది. మీ ఇష్టం మరి అన్నా. అంతే... నాకు, నీకూ టైం ఇయ్యండి. ఈ రోజు నేను మా ఫ్యామిలీతో మాట్లాడతా.. మా వెల్‌ విషర్స్‌తో మాట్లాడి డిస్కషన్స్‌ చేసుకుని, ఈ రోజు గానీ, రేపు పొద్దుగాలకల్లా నేను చెప్తాని.. అన్నాడు.

ఎమ్మెల్యే : ఒకే .. ఒకే.. వెరీగుడ్‌

ఏ-2: నో అని అయితే అన్లేదు. నేను చెప్పినా.. నీ లైఫ్‌ బాగైపోతాది. మేం ఇప్పుడు నీకు అండగా ఉంటాం. మాపార్టీ.. నాపార్టీ... తరఫున వచ్చినా నేను. నీవు, నేను బిషప్‌గా లేకపోతే, వో.. ఇక పక్కకు పెట్టేసేయండి. ఆ.., ఒక వెల్‌విషర్‌ నువ్వు క్రిస్టియన్‌, నేను క్రిస్టియన్‌ని. నీకేం కావాలంటే డైరెక్ట్‌గా బాబుదగ్గరకి తీసుకెళ్లే సత్తా నాకున్నది. నీకేం కావాలో చెప్పు.

ఎమ్మెల్యే :  అందుకనే మీరు..మీరు .. మరి రేపటికన్నా.. ఒక లైనప్‌చేస్తే మనం సిట్టింగ్‌ పెట్టుకుందాం.

ఏ-2:  ఆ..ఆ.. అదిసర్‌.. ఇప్పుడు ఇంకోటి.. ఏందంటే.. మీరు నాకు సడన్‌గా లైన్లో దొరకట్లేదు. ఇప్పుడంటే.. మహానాడు ఉంది.. రేపు నేను వచ్చేస్తా.., నేను కూడా డయాస్‌ మీద ఉంటా.

-----------------------------------------------

మే 28 సాయంత్రం 6 గంటల 15నిమిషాలకు మరో  3:28 నిమిషాల పాటు వీరయ్య, సెబాస్టియన్‌లు మరోసారి మాట్లాడుకున్నారు. ఈసారికూడా సెబాస్టియనే వీరయ్యకు కాల్‌ చేశారు.



ఏ-2:  హెలో..

ఎమ్మెల్యే : హెలో..

ఏ-2: ఆ సర్‌.. రాత్రికి ఏమైనా కలుసుకోవచ్చా మనం. సిటీలో ఎక్కడైనా..

ఎమ్మెల్యే : ఓ.. ఓకే. కలుసుకుందాం. అంటే నేనొస్తా. మనం ఎన్నింటికి రావాలో.. చెప్తే.. నేను అన్నింటికి వస్తాను.

ఏ-2: అచ్చా... మీరిప్పుడు ఎక్కడున్నాడు సర్‌. స్టేయింగ్‌ ఎక్కడున్నారు.

ఎమ్మెల్యే : మహానాడు దగ్గరనే ఉన్నాను.

ఏ-2: ఆ..ఆ.. ఓకే

ఎమ్మెల్యే : ఆ..

ఏ-2: మహానాడు అయిపోయినాక.. మనకు 8 అయితాది కదా.. ఎట్లా అయినా.. 7-8 అవుద్ది.

ఎమ్మెల్యే : అవునవును.. ఎక్కడ కూర్చోవచ్చు.

ఏ-2: మీరు చెప్పండి సర్‌. ఎక్కడైనా ఫర్వాలేదు. ఎక్కడున్నా కూర్చుని మాట్లాడుకుని మనం ఎట్లా చేద్దాం.. ఏంటిది మరి... ఎందుకంటే... మీరు సడన్‌గా రేపు కాల్‌ చేసిండ్రనుకో, మనం మళ్లీ మహానాడులో ఉంటా.. ఎక్కడైనా. ఓకే. అదీ పరిస్థితి.

ఎమ్మెల్యే : ఆహా.. ఆహా.. అంటే మనం ఉన్నాగాని, మనం ఉన్నాగాని.. ఆం, మనం అదే ప్రయార్టీ. మనం ఏమీ లేదు.. సర్‌.. మనకు అది ప్రయార్టీ అని చెప్పిండు. మనం మన పద్ధతిలో మనం వెళ్దాం.

ఏ-2: అచ్చా.. ఓకే. సరే ఇప్పుడు మహానాడు... మీకెప్పుడు అయిపోతది. ఎన్ని గంటలకు అయిపోతది.. మరి నాకు చెప్తే ....

ఎమ్మెల్యే : నేను అది అయిపోయినాక సర్‌ దగ్గర ఎమ్మెల్యేల మీటింగ్‌ అంటున్నరు.

ఏ-2: ఆహా...

ఎమ్మెల్యే :  ఒకే .. నేను కాంగానే... మీకు చెప్తా. ఆగండి.

ఏ-2: ఒకే .. ఇప్పుడు మీరు సర్‌తో...

ఎమ్మెల్యే : మీరు ఏ ఏరియాలో ఉంటారో మీరు చెప్పండి.

ఏ-2:  నేను మోతీనగర్‌ సర్‌.

ఎమ్మెల్యే :  మోతీనగర్‌.. ఒకే.. ఆయనా....

ఏ-2: ఆయనొచ్చి.. సికింద్రాబాద్‌లో ఉంటాడు.

ఎమ్మెల్యే : సికింద్రాబాద్‌.. మనకూ, ఆయన మీకూ, మీకూ.. కామన్‌ ప్లేస్‌ ఎక్కడ. మీరు డిస్కస్‌ చేయండి.

ఏ-2:  అట్లంటారా..?

ఎమ్మెల్యే : హ.. హ..

ఏ-2:  ఎప్పుడాయన డిస్కస్‌ జేసిన తర్వాత.. మనం ఎప్పుడు సిట్టింగ్‌ పెడదాం.

ఎమ్మెల్యే : ఆయన ఓకే అంటే.. రేపు మీరు ఏ టైం అయినా.., మహానాడు అయినా ఎగ్గొట్టి వచ్చేస్తా. మీరు ముందు ఆయన ... ఆయనతోని ఓకే చేస్తే, ఆయన డౌట్స్‌గాని, ఆయనకి క్లారిఫికేషన్స్‌ కావాలనో.. హామీ... అన్నీ నేను ఉంటా.

ఏ-2: ఓకే.. నాకు ప్రాబ్లం ఏందంటే.. మీరు నాకు లైన్లో దొరుకుత లేరు. పొద్దుగాల నుంచి ఎన్నిసార్లో ట్రైచేసినా.  

ఎమ్మెల్యే : ఆహా.. అంటే.. మహానాడులో రావట్లేదు.

ఏ-2: అవును. అక్కడ జామర్లు ఉంటది.. నాకు తెలుసు.

ఎమ్మెల్యే : ఆ.. ఆ.. మీరు ఒక పని చేయండి. మా డ్రైవర్‌ నంబరు ఇస్తాను. అది రాసుకోండి...

ఏ-2:  ఒక్క నిమిషం సర్‌... ఆ చెప్పు సర్‌...

ఎమ్మెల్యే : మా డ్రైవర్‌ నెంబర్‌ 8186

ఏ-2: 8186

ఎమ్మెల్యే : 8255

ఏ-2: 8255

ఎమ్మెల్యే :60

ఏ-2: 60, ఏం పేరు సర్‌ ఆయనది.

ఎమ్మెల్యే :  బాషా

ఏ-2: బాషా , ఓకే

ఎమ్మెల్యే : 81

ఏ-2:  ఆ ఆ... 86

ఎమ్మెల్యే : 82

ఏ-2: 8255

ఎమ్మెల్యే : 5560

ఏ-2: బాషా, ఓకే టైమ్, ఇప్పుడు నేనడిగేదేందంటే... రేపు మరి నేను మహానాడులో ఉండాల్నా... మల్లీ సార్‌కు తెల్వది కద సర్... లేడని నన్నంటాడు. నువ్వే రాలేదేంటి ... మల్లీ బాగుండదు కదా... ఎట్ల మరి నీవు సర్‌కి...

ఎమ్మెల్యే : ఆల్‌ రడీ నేను నీకు ఈ బాధ్యత అప్పజెప్పినట్టు చెప్పిన.

ఏ-2:  ఆ...

ఎమ్మెల్యే : నేను .. నేను.. అక్కడ జామరొస్తే... సర్‌తోటి మీకు నేను ఫోన్‌ చేపిస్తా...

ఏ-2:  ఆ.. ఆ .. ప్లీజ్‌ ఆ పని చేయండి... ఎందుకంటే నేను జనార్దన్‌ సర్‌ కూడా అడిగిండియ్యాలా... నువ్వెందుకు రాలేదని... నాకియ్యాల మద్యాహ్నం పోన్‌ చేసిండు

ఎమ్మెల్యే : లేలే... నేన్‌ జెప్త... నేన్‌ జెప్తా...

ఏ-2:  నేను ఆయనకు చెప్పలేదు... నేనేందుకంటే... చెప్పాల్నా వద్దా... మల్లీ అయనే...

ఎమ్మెల్యే : మీరెవ్వరికి చెప్పద్దు... నేను సార్‌తో చెప్తా...

ఏ-2:  ఆ సర్‌కి చెప్పండి... ఇట్ల క్రిస్టియన్‌ ప్రెసిడెంట్‌ బిషప్‌ గారు ఈ పని జేస్తన్నడు సర్‌... అందుకే రాలేదు అని జెప్పండి...

ఎమ్మెల్యే : లే... లే... నేనన్ని... నేను నా బాధ్యత... నేను ఒప్పజెప్త

ఏ-2:  ఆ మల్లీ నాకు నీవు మీటింగ్‌ ఎందుకు రాలేదంటే... మల్లి నాకు బాగుండదు...

ఎమ్మెల్యే : మీరు మీరు  నాకు వదిలేసేయండి...  ఇప్పుడు జనార్దన్‌ గారికి కూడా చెబుతా...

ఏ-2:  ఆ చెప్పండి... ఆ జనార్దన్‌ గారికి చెప్పండి... సార్‌కు చెప్పండి

ఎమ్మెల్యే : ఇద్దరికి చెబుతా....

ఏ-2:  ఇద్దరికి చెప్పండి... జనార్దన్‌ గారికి ఈ విషయం చెబుతున్నారా ఏమైనా...

ఎమ్మెల్యే :  ఏం అవసరం లేదు... మనం మన పనిలో ఉన్నట్లు... నేను చెప్తలే మీకెందుకు...

ఏ-2:  ఆ ఓకే.... అంతే చెప్పండి... సార్‌ ఒక పని అప్పజెప్పండి... ఆ పని మీద ఉన్నాడని చెప్పండి...

ఎమ్మెల్యే : ఆ..

ఏ-2: ఆ మంచిది సర్‌...

ఎమ్మెల్యే : థాంక్యూ అండీ....

ఏ-2:  థాంక్యూ... థాంక్యూ...

------------------------------------------------

మే 30 ఉదయం 10 గంటల 35 నిమిషాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నుంచి సెబాస్టియన్‌కు కాల్‌ వెళ్లింది.  2 నిమిషాల 14 సెకన్ల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే... ఏపీ సీఎం చంద్రబాబు నివాసం కేంద్రంగా.. ఈ వ్యవహారం నడిచినట్టు.. రిమాండ్‌ రిపోర్టులోని అంశాలను పరిశీలిస్తే వెల్లడవుతోంది. సండ్ర అరెస్టుకు ముందు... ఆయన గన్‌మ్యాన్‌, పీఏల నుంచి ఏసీబీ అధికారులు వాంగ్మూలాలు సేకరించారు. ఏయే సమయాల్లో సండ్ర... ఎక్కడెక్కడకు వెళ్లారన్నదానిపై పూర్తిస్థాయిలో వారి సాక్ష్యాలను నమోదు చేశారు. సండ్ర గన్‌ మ్యాన్‌ లచ్చు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. మే 30 వ తేదీ ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లినట్టుగా గన్‌మ్యాన్‌ లచ్చు ఏసీబీకి చెప్పారు. ఏపీ సీఎం ఇంట్లోకి వెళ్లిన  గంటన్నర తర్వాత అంటే 30వ తేదీ ఉదయం 10 గంటలా 35 నిమిషాలకు సెబాస్టియన్‌ సండ్రకు కాల్‌ చేశారు. సెబాస్టియన్‌ ఫోన్‌ నుంచి 087908 25678 నంబర్‌కు కాల్‌ వెళ్లింది.



ఈ సమయంలో సండ్ర, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఒకే చోట ఉన్నారు. ప్లాన్‌ వేసుకున్నాక, అక్కడ నుంచి నేరుగా ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌కు అక్కడ నుంచి స్టీఫెసన్‌ ఇంటికి వెళ్లినట్టు.. ఈ కాల్‌ డేటా స్పష్టం చేస్తోంది. ఈ కాల్‌ సంభాషణలు ఏంటంటే...



సండ్ర వెంకటవీరయ్య(ఎమ్మెల్యే) : హలో..,

సెబాస్టియన్ (ఏ-2) : ఎమ్మెల్యేగారూ నమస్కారం సర్‌

ఎమ్మెల్యే : నమస్తేనండి..

ఏ-2: అదే.. రేవంత్‌రెడ్డిగారికి ఫోన్‌ చేశాను సర్‌.. నేను  

ఎమ్మెల్యే : ఆ..ఆ..

ఏ-2: బాబుగారి ఇంటిదగ్గరున్నాడంట.

ఎమ్మెల్యే : ఆ.. ఆ..

ఏ-2: అది మీరొకసారి మాట్లాడి.. మనం, ఎందుకంటే..  మనం 11 గంటలకు టైం ఇచ్చినాం  

ఎమ్మెల్యే : ఒక్క నిమిషం.. నా ఎదురుగానే ఉన్నాడు.

ఏ-2:  ఆ.. ఓకే.. ఓకే.. సరే మాట్లాడండి.

ఎమ్మెల్యే : ఒక్క నిమిషం లైన్లా ఉండు.

ఏ-2:   ఆ...

ఎమ్మెల్యే : ....................... హలో

ఏ-2:  ఆహా.. సర్‌... చెప్పండి.

ఎమ్మెల్యే : ................ హలో...

ఏ-2: ఆహా సర్‌.. చెప్పండి సర్‌.

ఎమ్మెల్యే : అదే.. అదే..  ఇక్కడున్నాం, సర్‌ దగ్గర 10 నిమిషాల్లో మాట్లాడేసి బయల్దేరుతాం.  

ఏ-2:   బయలుదేరుతా.. - మరి మీరటు వచ్చేస్తారా?  నేను బయలుదేరాలా? ఆయన ఎదురుచూస్తున్నాడు.

ఎమ్మెల్యే : అవును.. మీరు ఎక్కడున్నారు.

ఏ-2:   మేం ఇక్కడ.. మోతీనగర్‌... ఎర్రగడ్డ...

ఎమ్మెల్యే : మోతీనగర్‌..... అయితే ఒక పని చేయండి. మీరటు పార్టీ ఆఫీసు దిక్కు రండి. నేనటు వచ్చేస్తా.

ఏ-2:  పార్టీ....

ఎమ్మెల్యే : కారులో కూర్చుని పోదాం.

ఏ-2:   పార్టీ ఆఫీసులో.. సర్‌.

ఎమ్మెల్యే : మీరు పార్టీ ఆఫీసు దగ్గరనే ఆపుకోండి బండి.

ఏ-2:   ఆ....

ఎమ్మెల్యే : మనం వెళ్లాల్సింది ఎటువైపు.

ఏ-2:  ఆ.. - బోయా.. ఇక్కడకు బోయగూడ.

ఎమ్మెల్యే : అయితే.. ఓకే.. మీరు పార్టీ ఆఫీసు దగ్గరకు రండి . అయితే నాకు ఈజీ అయిద్ది. ఇది చూసుకుని నేను ఆడకి వచ్చేస్తా.

ఏ-2:  ఆ మంచిది సర్‌.. పార్టీ ఆఫీసు కాడకి వచ్చేస్తా.

ఎమ్మెల్యే : ఒక్క నిమిషం.

ఏ-2: ఆ...

ఎమ్మెల్యే : ఆ.. అన్నగారూ.. ఒక పనిచేయండి మీరు. ఈ అడ్రస్‌కు మనం ఒక సీక్రెట్‌ డ్యూటీలో పోయేటప్పుడు అడ్రస్‌ వెతుక్కోకూడదు. డైరెక్ట్‌గా పోయేటట్టు ఉండాలంటే.. మీరు ఆఫీసుకాడ వచ్చి.. బైట పెట్టుకుని ఉండండి. మనోడు వచ్చేస్తాడు.

ఏ-2: నేను బయటనే ఉంటా. బైటొచ్చి.. ఫోన్‌చేయాల్పా.. ఆఫీసుకాడకి.

ఎమ్మెల్యే : ఆ.. పార్టీ ఆఫీసుముందు.. ఆ..చెట్లుంటాయికదా.. క్యాంటీన్‌ పక్కెంబడి.. చెట్టుకాడుండి.. నీడ...

ఏ-2:  మీరక్కడున్నారా...

ఎమ్మెల్యే : లె.. లె.. నై... సారింటికాడున్నా... నువ్వు------, ఇద్దరం, ఎందుకు డబుల్‌ పనొద్దిలే.

ఏ-2:  ఆ.. ఓకే.. ఓకే..

ఎమ్మెల్యే : ఇద్దరం వద్దులే... బాగోదులే.

ఏ-2:  మీ ఇష్టం. మీ రంటే.. మీరు

ఎమ్మెల్యే : మా కొద్దులే.. మాకేం ఇబ్బంది లేదు. ఎవరు చేసినా పార్టీ పని, మన దోస్తోడు.  

ఏ-2:  హ..హ..హ..

ఎమ్మెల్యే : మీరు చేసినా, అన్నచేసినా, నేను చేసినా... ఒక్కటే. కామన్ మన అజెండా. సరే..సరే.. నేను ఆడ గేటు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top