మన ప్రవాసీ బిలియనీర్లు 30 మంది!

మన ప్రవాసీ బిలియనీర్లు 30 మంది! - Sakshi


ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2257 మంది అత్యంత సంపన్నులు(బిలియనీర్లు) ఉండగా. వారిలో 300 మంది(13 శాతం) తాము పుట్టిన దేశాలను వదిలి, స్థిరపడిన దేశాల్లో రాణించారు. మళ్లీ వారిలో దాదాపు 80 మందికి పైగా మూడు దేశాలు–జర్మనీ(31), ఇండియా(30), చైనా(24)కు చెందినవారే. ఈ వివరాలను అపర కుబేరుల జాబితాలు ప్రకటించే హ్యూరన్‌ ఆరో వార్షిక నివేదికలో వెల్లడించారు.



ఈ మూడు దేశాల తర్వాత ఇంగ్లండ్‌ 11, అమెరికా 13, ఇటలీ 11 మంది బిలియనీర్లకు జన్మనిచ్చిన దేశాలుగా రికార్డుకెక్కాయి. పుట్టిన గడ్డను వదిలి స్థిరపడిన దేశాల్లో సంపద భారీగా సృష్టించడం ఈ బిలియనీర్ల ప్రత్యేకత. జర్మనీలో పుట్టిపెరిగిన 31 మంది కుబేరుల్లో సగం మంది సరిహద్దు దేశం స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నారు.



ఇంగ్లండ్, అరబ్‌ ఎమిరేట్స్‌లోనే భారతీయ బిలియనీర్లు ఎక్కువ మంది!

భారత సంతతికి చెందిన బిలియనీర్లు ఎక్కువ మంది దుబాయ్, షార్జా అంతర్భాగంగా ఉన్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), ఇంగ్లండ్‌లో స్థిరపడి ఆస్తులు పెంచుకుంటున్నారు. చైనాకు చెందిన 9 మంది సంపన్నులు(బిలియనీర్లు) అమెరికాకు వలసపోయారు. సమీపంలోని సింగపూర్, ఫిలిప్పీన్స్‌లో అయిదుగురు చొప్పున చైనీయులు నివసిస్తున్నారు. అమెరికాలో 552 బిలియనీర్లుండగా, వారిలో 73 మంది(13 శాతం) ఇతర దేశాల్లో పుట్టినవారే. విదేశాల్లో పుట్టిపెరిగిన వారు అమెరికా కుబేరుల్లో ఇంత మంది ఉండడం విశేషం. ప్రతిభాపాటవాలున్నవారికి గత వందేళ్లలో సంపద సృష్టికి అమెరికా ఎన్నో అవకాశాలిచ్చింది. ఇలా యవ్వనప్రాయంలో అమెరికా వచ్చి కోట్లాది డాలర్లు సంపాదించిన బిలియనీర్లలో ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ గూగుల్‌ సహస్థాపకుడు సెర్జీ బ్రిన్‌ ఉన్నారు. రష్యాలో పుట్టి చిన్న వయసులోనే తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చిన బ్రిన్‌ 3600 కోట్ల డాలర్ల వ్యక్తిగత సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన వలస కుబేరుడు.



వలస బిలియనీర్ల జాబితా ఇదే మొదటిది!

ఫోర్బ్స్‌ రూపొందించే సంపన్నుల జాబితా మాదిరిగా బిలియనీర్ల జాబితాలు ప్రధానంగా చైనా అపర కుబేరుల జాబితాలు ప్రచురించి అందరి దృష్టి ఆకర్షించిన హ్యూరున్‌ రిపోర్ట్‌ సంస్థ చైర్మన్, ప్రధాన పరిశోధకుడు రూపర్ట్‌ హూగెవర్ఫ్‌ ఈసారి ఇతర దేశాలకు వలసపోయి బిలియనీర్లయిన వ్యాపారుల జాబితా తొలిసారి రూపొందించారు. ‘‘ఒక దేశం నుంచి మరో దేశానికి జనం వలసపోవడం అనే అంశం నేడు వివిధ ప్రాంతాల్లో ప్రజలను రెండు వర్గాలుగా చీలుస్తోంది. స్థానికులు, వలసొచ్చినవారు అనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక పారిశ్రామిక దేశాలకు వలసొచ్చిన ప్రతిభావంతులు ప్రపంచ సంపదను ఏ మేరకు పెంచారో చెప్పడానికి ఈ నివేదిక రూపొందించాం.’’ అని రూపర్ట్‌ హూగెవర్ఫ్‌ చెప్పారు. ఈ వలస బిలియనీర్లలో 32 శాతం మంది 18 ఏళ్లు నిండడానికి ముందే పుట్టిన దేశాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసపోయారు.



లక్ష్మీనివాస్‌ మిత్తల్‌ ఫస్ట్‌!

విదేశాల్లో బిలియన్లు సంపాదించిన అగ్రగామి భారత ప్రవాసీ çసంపన్నులు పది మందిలో ఇనుము, ఉక్కు వ్యాపారి లక్ష్మీనివాస్‌ మిత్తల్‌ మొదటి స్థానంలో ఉన్నారు. 12 బిలియన్ల ఆస్తులున్న మిత్తల్‌(ఆర్సెలర్‌మిత్తల్‌) తర్వాత అన్నదమ్ములు సైమన్‌(6.7), డేవిడ్‌ ర్యూబెన్‌(6.7) ఉన్నారు. వారి కంపెనీ పేరు గ్లోబల్‌ స్విచ్‌. మిత్తల్‌ మాదిరిగానే వీరిద్దరూ ఇంగ్లండ్‌లో స్థిరపడ్డారు. ఇంకా వేదాంతా రిసోర్స్‌ అధిపతి అనిల్‌ అగర్వాల్‌(3.2), పాలియెస్టర్‌ ఉత్పత్తిదారు(ఇండోరమా వెంచర్‌) ప్రకాశ్‌ లోహియా(2.1) కూడా బ్రిటన్‌లో నివసిస్తున్నారు. ఈ పది మంది జాబితాలో అమెరికాలో స్థిరపడిన ఒక్కరే చోటు సంపాదించారు. ఆయన సింఫనీ టెక్నాలజీ అధిపతి రమేష్‌ టి.వాధ్వానీ(2.8 బిలియన్లు). యూఏఈలో స్థిరపడిన భారత బిలియనీర్లు నలుగురు–ఎంఏ యూసుఫ్‌ అలీ( ఎంకే గ్రూప్‌–6.2 బిలియన్లు), మికీ జగతియాణీ(ల్యాండ్‌మార్క్‌–4.6), ఫిరోజ్‌ అలానా(ఇఫ్కో–2.7), రవి పిళ్ళై(ఆర్పీ–2.2). 26 ఏళ్ల వయసులో లక్ష్మీ మిత్తల్‌ ఇండొనీసియా వెళ్లి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాంచాక, ఇంగ్లండ్‌ వెళ్లి స్థిరపడ్డారు. ముంబైలో జన్మించిన ర్యూబెన్‌ సోదరులు మొదట ఇరాక్‌లో వ్యాపారం చేసి చివరికి ఇంగ్లండ్‌లో స్థిరపడ్డారు. అబూదాబీలో వ్యాపారం చేస్తున్న ఎంఏ యూసుఫ్‌ అలీ కేరళలో జన్మించారు.

- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top