దంపతుల మధ్య ‘ఆమిర్’ చిచ్చు!

దంపతుల మధ్య ‘ఆమిర్’ చిచ్చు! - Sakshi


- భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య




ముంబై/జబల్‌పూర్: అసహనంపై ఆమిర్‌ఖాన్ వ్యాఖ్యలు ఓ కుటుంబంలో చిచ్చురేపాయి! మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన అయాంక్ పాండే, సోనల్ పాండే దంపతుల మధ్య అసహనంపై ఆమిర్ చేసిన వ్యాఖ్యలపై జరిగిన చర్చ.. ముదిరి వ్యక్తిగతంగా తిట్టుకునే పరిస్థితికి దారితీసింది.



దీంతో మనోవేదనకు గురైన సోనల్ పక్క గది లోకి వెళ్లి లోపలినుంచి గడియ పెట్టుకుని విషం తాగిందని.. కాసేపటికి తలుపులు బద్దలు కొట్టి చూడగా సోనల్ అపస్మారక స్థితిలో పడి ఉందని అయాంక్ పోలీసులకు తెలిపారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



చల్లారని దుమారం..

అసహనానికి సంబంధించి ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. బీజేపీ నేత శతృఘ్నసిన్హా ఆమిర్ తనకు సన్నిహితుడని, అయితే దేశంలో అసహనం పెరుగుతోందంటూ అతను చేసిన వ్యాఖ్యలను మాత్రం తాను సమర్థించలేనని ట్విటర్‌లో పేర్కొన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ.. ఆమిర్‌ఖాన్ తన పూర్వీకులు నివసించిన అఖ్తియార్‌పూర్‌లో పర్యటించి, అక్కడి ప్రజల మధ్య ప్రేమ, సామరస్యం ఎలా ఉందో తెలుసుకోవాలన్నా రు.



కాగా, ఆమిర్ తాను ఏం భావించాడో అదే చెప్పాడని, ప్రజాస్వామ్య దేశంలో తనకు నచ్చినది చెప్పే హక్కు అతనికి ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిపరంథామన్ ఆమిర్‌కు మద్దతుగా నిలిచారు. తన వ్యాఖ్యలకు సంబంధించి వచ్చిన విమర్శలపై ఆమిర్ స్పందించిన తీరును బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రశంసించారు.

 

ఆమిర్‌పై రాజ్‌నాథ్ వ్యంగ్యాస్త్రాలు: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చ సమయంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆమిర్‌ఖాన్‌పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ తీవ్రమైన అవమానాలను ఎదుర్కొన్నా.. ఎప్పుడూ ఆయన దేశాన్ని విడిచి వెళ్లాలని భావించలేదన్నారు. తాను ఎదుర్కొన్న పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top