అన్నార్తుల ఆకలితీర్చే రోటీ బ్యాంక్

అన్నార్తుల ఆకలితీర్చే రోటీ బ్యాంక్


రోజుకు 400 మంది పేదలకు ఉచితంగా రోటీలు

* మైసూరులో ఏర్పాటు చేసిన స్నేహితుల బృందం


సాక్షి, బెంగళూరు: ఒక పూట భోజనం కోసం ఇబ్బంది పడే వారి ఆకలి తీర్చాలనే ఆలోచనే ఆ స్నేహితుల బృందం ‘రోటీ బ్యాంక్’ను నెలకొల్పేందుకు దారి చూపింది. ‘బడవర బంధు’ (పేదల బంధువు) చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి కర్ణాటకలోనే తొలిసారిగా మైసూరులో ఉచితంగా రోటీలను పేదలకు అందజేస్తూ ఆదర్శంగా నిలిచారు. మైసూరుకు చెందిన జయరామ్ ఫోన్‌కు ఓరోజు ‘వాట్సప్’లో ఓ మెసేజ్ వచ్చింది.



ఔరంగాబాద్‌కు చెందిన యూసుఫ్ ముఖ్తీ ‘రోటీ బ్యాంక్’ పెట్టి పేదలకు ఉచితంగా రోటీలను పంచుతున్నారన్నది ఆ మెసేజ్ సారాంశం. వెంటనే జయరామ్ తన స్నేహితులు అనిల్ కొఠారీ, గౌతమ్‌లతో చర్చించి ‘రోటీ బ్యాంక్’ పెడితే ఆకలితో అలమటించే పేదలకు కాస్తయినా సాయం చేయొచ్చని భావించారు. అనుకున్న వెంటనే రోటీ బ్యాంక్ ఏర్పాటుచేసి సమాజసేవ ప్రారంభించారు.

 

ప్రతి రోజూ 400 మంది ఆకలి బాధ తీరుస్తూ..

బ్యాంక్ వద్ద రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2గంటల మధ్య ప్రతీ పేద వ్యక్తికి ఉచితంగా మూడు రోటీలు, కూరను ప్యాక్ చేసిన పొట్లాలను ఇస్తారు. రోజూ 400 మంది రిక్షా కూలీలు, భిక్షాటన చేసే వృద్ధులు, కేవలం ఉపకార వేతనాలతో చదివే పేద విద్యార్ధులు ఇక్కడికి వస్తుంటారని ‘రోటీ బ్యాంక్’వ్యవస్థాపకుల్లో ఒకరైన కొఠారీ తెలిపారు. ప్రస్తుతం రోజుకు రోటీ బ్యాంక్ నిర్వాహణకు రూ.4వేలు ఖర్చవుతోందన్నారు.



‘ట్రస్ట్‌లో 31 మంది సభ్యులున్నారు. కేవలం మా సంపాదనతోనే దీన్ని నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో మరికొన్ని ప్రాంతాల్లో బ్యాంకులను ఏర్పాటు చేయాలనుంది. దాతలు ముందుకొచ్చి ఆర్థికసాయం చేస్తే మరింత మంది ఆకలిని తీర్చగలం’ అని చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top