ఇదో ‘ముష్టి’ బ్యాంక్

ఇదో ‘ముష్టి’ బ్యాంక్ - Sakshi


గయ: చెల్లింపులకో బ్యాంకు, రుణాలకు మరో బ్యాంకు, పరిశ్రమలకోసం ఓ బ్యాంకు ఇలా వేర్వేరు వర్గాలకు.. వేర్వేరు అవసరాల కోసం తలో బ్యాంకు ఉన్నాయి. మరి మాక్కూడా ఓ బ్యాంకు ఎందుకు ఉండకూడదనుకున్నారు.. బిహార్‌లోని కొందరు బెగ్గర్స్. అనుకున్నదే తడవుగా 40 మంది కలసి బ్యాంకును ఏర్పా టు చేసుకున్నారు. గయలోని ‘మా మంగళగౌరి మందిర్’ దగ్గర అనేక ఏళ్లుగా అడుక్కుంటున్న వీరు.. బ్యాంకుకు కూడా తమ ఇష్టదైవం పేరిట.. మంగళ అనే పేరు పెట్టుకున్నారు. అసలు సిసలైన బ్యాంకు తరహాలోనే ఇందులో కార్యకలాపాలూ నిర్వహిస్తున్నారు. స్టేట్ సొసైటీ ఫర్ అల్ట్రా పూర్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనే సంస్థ వారు.. దీన్ని ఏర్పాటు చేసుకునేలా బెగ్గర్లను ప్రోత్సహించారు.

 

 మేనేజరు, ట్రెజరరు, సెక్రటరీ, ఏజెంటు.. ఇలా దీన్ని నడిపేవారందరూ బెగ్గర్సే. ఒక్కొక్కరూ ఒక్కో బాధ్యతను పంచుకుంటున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఖాతాల నిర్వహణ వంటి విషయాల గురించి కాస్తో కూస్తో తెలిసిన రాజ్‌కుమార్ మాంఝీ అనే బెగ్గర్ దీనికి మేనేజరు. ‘అవును మా కోసం మేమే ఒక బ్యాంకు పెట్టుకున్నాం’ అని గర్వంగా చెబుతున్నాడు మాంఝీ. ఆయన భార్య నగీనా దేవి దీనికి ట్రెజరర్. వచ్చిన డిపాజిట్లను నిర్వహించడం ఆమె బాధ్యత. ఇక, వనారిక్ పాశ్వాన్ ఒకో ఖాతాదారు నుంచి వారం వారం డిపాజిట్లు సమీకరిస్తాడు. ఆరు నెలల క్రితం ఏర్పాటైన ఈ బ్యాంకుకు మాలతీ దేవి సెక్రటరీ. ‘అట్టడుగు స్థాయిలో కడు పేదరికంలో ఉంటాం గనుక సమాజంలో మమ్మల్ని అంతా చిన్న చూపు చూస్తుంటారు. బ్యాంకులో ఖాతాలున్న వారిలో చాలా మందికి ఆధార్ కార్డు గానీ రేషన్ కార్డు గానీ లేదు. అందుకే, భిక్షాటన చేసుకునే వారి అవసరాలు, ఆశలు, ఆకాంక్షలను తీర్చాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకును పెట్టాం’ అన్నది మాలతీ దేవి మాట. బ్యాంకులో ఖాతాలు తెరిచేలా మరింత మందిని ప్రస్తుతం ప్రోత్సహిస్తున్నారామె.

 

 అవసరానికి రుణాలు కూడా..

 అత్యవసర పరిస్థితుల్లో రుణాలు కూడా ఇస్తూ బెగ్గర్ల అవసరాలు తీరుస్తోందీ బ్యాంకు. ‘ఇటీవలే వంట చేస్తుండగా మా అమ్మాయికి కాలిపోయి గాయాలయ్యాయి. వైద్య చికిత్స కోసం రూ. 8,000 ఈ బ్యాంకు నుంచే అప్పు తీసుకున్నాను. ఇతరత్రా ఏ బ్యాంకుకు వెళ్లినా పేపర్లు, గ్యారంటార్లు కావాలంటారు. మా దగ్గర అవేమీ ఉండవు కదా. నాలాంటి వారికి ఈ బ్యాంకే తోడ్పాటునిస్తోంది’ అని వివరించాడు మాంఝీ. ఈ బ్యాంకులో రుణం తీసుకున్న వారికి ఒక నెల పాటు వడ్డీ మినహాయింపు వస్తుంది. ఆ తరువాతి నెల నుంచీ 2 నుంచి 5 శాతం మేర వడ్డీరేటు ఉంటుంది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top