739 మంది విదేశీ విద్యార్థులకు బ్రిటన్ ‘నో’


లండన్: బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో అణు, జీవ, రసాయనిక ఆయుధాల రూపకల్పనకు దోహదపడే కోర్సులను చేయాలనుకుంటున్న 739 మంది విదేశీ విద్యార్థుల ప్రవేశ దరఖాస్తులను బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల తిరస్కరించింది. ఆ విద్యార్థుల జాతీయతను వెల్లడించడానికి కూడా ప్రభుత్వ వర్గాలు నిరాకరించాయి.



ఐఎస్‌ఐఎస్ లాంటి ఉగ్రవాదులు చెలరేగిపోతూ సామూహిక మారణహోమాన్ని సృష్టిస్తున్న నేటి పరిస్థితుల్లో తమ విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కోర్సులు చేయకుండా విదేశీ విద్యార్థులపై ‘అకాడమీ టెక్నాలజీ అప్రోవల్ స్కీమ్’ కింద నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. టెర్రరిస్టుల చేతుల్లోకి అణు, జీవ, రసాయనిక ఆయుధాల పరిజ్ఞానం వెళ్లకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం 2007లోనే ఇలాంటి కోర్సులకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేస్తూ ఓ స్కీమ్‌ను తీసుకొచ్చింది.



ఏయే దేశస్థుల దరఖాస్తులను తిరస్కరించిందో మాత్రం వెల్లడించడానికి ప్రభుత్వ వర్గాలు నిరాకరిస్తున్నాయి. ఈస్ట్ లండన్ సెకండరీ స్కూళ్లో ఇలాంటి కోర్సులు చదివిన ఐదుగురు బ్రిటన్ విద్యార్థినులపై ఇటీవలనే దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదంటూ బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది.  ముగ్గురు విద్యార్థినులు గత ఫిబ్రవరి నెలలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిరియా బయల్దేరి వెళ్లారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ ఐదుగురిపై ప్రభుత్వం ట్రావెల్ ఆంక్షలు విధించింది.



సద్దాం హుస్సేన్ వద్ద జీవ రసాయనిక యుద్ధ కార్యక్రమంలో పనిచేసిన డాక్టర్ రిహాబ్ తహా అలియాస్ డాక్టర్ జెర్మ్ కూడా బ్రిటన్‌లోని ఈస్ట్ ఆంగ్లియన్ యూనివర్శిటీలో ‘ మొక్కల్లోని విష ఆమ్లాల’ అంశంపై పీహెచ్‌డీ చేశారు. అణు, జీవ, రసాయనిక కోర్సులు చదివేందుకు బ్రిటన్ విశ్వ విద్యాలయాల్లో అత్యాధునిక లాబరేటరీలు ఉండడం వల్ల ఈ కోర్సులను ఇక్కడే చదివేందుకు విదేశీ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది కూడా ఈ కోర్సుల్లో చేరేందుకు మొత్తం 3,400 మంది విదేశీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా వారిలో 739 మంది విద్యార్థుల దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top