ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చాలామందితో లింకులు: డీసీపీ

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చాలామందితో లింకులు: డీసీపీ


హైదరాబాద్‌ : పాత నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్‌ అయిన శ్రీనివాసరావు సినీనటి జీవిత సోదరుడు కాడని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి తెలిపారు. అయితే ఫిల్మ్‌ ఇండ్రస్టీలో చాలామందితో అతడికి లింకులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. డీసీపీ లింబారెడ్డి  శుక్రవారం విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ.. శ్రీనివాసరావు చెన్నైలోని జాయ్‌ స్టోర్ట్‌లో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారని తెలిపారు.


ఈ సంఘటనకు సంబంధించి పురుషోత్తం, శ్రీనివాసరావు అనే ఇద్దరిని అరెస్ట్‌ చేసి, రూ.7 కోట్ల పాతనోట్లను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. బ్యాంకర్లు తమకు బాగా తెలుసునని చెబుతూ.. చాలామంది వ్యక్తుల ద్వారా రద్దు అయిన నోట్లు తీసుకుని మార్పిడి చేసేందుకు నిందితులు యత్నించినట్లు తెలిపారు. చెన్నైకి చెందిన కోటేశ్వర్‌ అనే వ్యక్తి వద్ద రూ.7 కోట్లను 20 శాతం కమిషన్‌ మీద మార్పిడి చేస్తామని వారం రోజల క్రితం తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.



కాగా ఫిలింనగర్‌లోని శ్రీనివాస ప్రొడక్షన్‌ కార్యాలయంలో గురువారం రూ. 7 కోట్ల విలువైన పాత నోట్లు దొరికిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో  పోలీసులు అరెస్ట్‌ చేసిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తన తమ్ముడని మీడియాలో వచ్చిన కథనాలను సినీనటి జీవిత ఖండించారు. శ్రీనివాసరావు తన తమ్ముడు కాదని, తన తమ్ముడు మురళీ శ్రీనివాస్‌ నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆమె పేర్కొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top