474 కోట్లు ఎలా సంపాదించారు?

474 కోట్లు ఎలా సంపాదించారు? - Sakshi


మంత్రి నారాయణకు ఉండవల్లి సూటిప్రశ్న

 

 సాక్షి, రాజమహేంద్రవరం: రాజధాని అమరావతి నిర్మాణంలో జరుగుతున్న తప్పులపై వివిధ రంగాల నిపుణుల కమిటీ పంపిన సమాచారాన్ని తాను విలేకర వద్ద ప్రస్తావిస్తే.. సమాధానం చెప్పకుండా మంత్రి నారాయణ తనపై ఎదురుదాడి చేయడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇచ్చిన అఫిడవిట్‌లో తన ఆస్తులు రూ. 474.70 కోట్లని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ ఆస్తులు ఏ వ్యాపారం చేసి సంపాదించారు? విద్యాసంస్థలను నారాయణ సొసైటీ పేరిట నడుపుతున్నారు.ఆ చట్ట ప్రకారం ఆ ఆస్తు లు సొంతానికి వాడుకునే హక్కు లేదు. మంత్రి తన సొంత ఖాతాకు సొసైటీ నగదు బదలాయించుకున్నారా? లేక సీఎం చంద్రబాబుతో కలసి వ్యాపారం చేశారా? సొసైటీ చట్ట ప్రకారం విద్యాసంస్థలను లాభాపేక్ష లేకుండా నడపాలి. సొసైటీని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తే నేరం. రూ. 474.70 కోట్లు ఎలా సంపాదించారో 15 రోజుల్లోపు వెల్లడించాలి. లేదంటే ఈ విషయంపై చట్టపరంగా ముందుకెళతాను. దీన్ని జాతీయ స్థాయిలో తీసుకెళతాను. అప్పుడు నేను ఉండవల్లినా? ఊసరవెల్లినా? చెబుతాను’’ అని నారాయణపై మండిపడ్డారు.



 పారదర్శకత అంటే అదేనా

 ‘‘రాజధాని భూ సేకరణ నుంచి స్విస్ చాలెంజ్ వరకూ అవినీతి జరుగుతూంటే బాబు ప్రతి రోజూ పారదర్శకతంటూ ఊదరగొడుతున్నారు. పారదర్శకతంటే పార పట్టుకు తిరగడమా?’’ అని ఎద్దేవా చేశారు.



 విజయవాడ, గుంటూరుల్లో రాజధాని వద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పినా పట్టించుకోలేదన్నారు. శివరామకృష్ణన్ చంద్రబాబు తీరుపై రాసిన మూడు పేజీల లేఖ ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైందని తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top