నేపాల్ విలవిల..

నేపాల్ విలవిల.. - Sakshi


*తీవ్ర ప్రకంపనలతో నిలువెల్లా వణికిపోతున్న నేపాల్... 2500కు పెరిగిన మృతుల సంఖ్య , 6000కు పైగా పెరిగిన క్షతగాత్రులు

*ఆదివారం తొలుత 6.7, తర్వాత 6.5 తీవ్రతతో ప్రకంపనలు

*త్రిశూలి ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న 60 మంది కూలీలు

*ఇళ్లు వదిలి చలిలో, చీకటిలో ఆరుబయటే ఉంటున్న జనం

*రంగంలోకి దిగిన భారత సైనిక, విపత్తు సహాయ బృందాలు

*ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు, సహాయ చర్యలు

*క్షతగాత్రులకు సరిపోని ఆస్పత్రులు.. ఆరు బయటే చికిత్స

*ఎవరెస్ట్ వద్ద మృతులు 22, మరో 217 మంది గల్లంతు?

*మళ్లీ వణికిన ఉత్తర భారతం.. దేశంలో 62కు పెరిగిన మృతుల సంఖ్య.. ఒక్క బిహార్‌లోనే 51 మంది మృత్యువాత

*ప్రపంచ దేశాల నుంచి నేపాల్‌కు అందుతున్న సాయం

*భూకంపంతో కకావికలం - శిథిల నగరంగా కఠ్మాండు


మంచుకొండల్లోని సుందర నగరం మరుభూమిగా మారింది. నేపాల్ రాజధాని కఠ్మాండు శిథిల దృశ్యమైపోయింది. శనివారం నాటి భూ విలయంతో.. మన పొరుగు దేశం నేపాల్ కకావికలమైపోయింది. మృతుల సంఖ్య 2,500 వరకూ పెరిగిపోయింది. క్షతగాత్రుల సంఖ్య 6,000 దాటిపోయింది. ఆస్పత్రుల్లో చోటు చాలక ఆరుబయటే చికిత్స చేస్తున్న పరిస్థితి. శిథిలాల కింద సమాధి అయి ఉన్న వారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. పెను భూకంపం తర్వాత భూ ప్రకంపనల పరంపర కొనసాగుతుంది. ఆదివారం రెండు భారీ భూ ప్రకంపనలు ప్రజలను మరోసారి నిలువెల్లా వణికించాయి.

 

ఏ క్షణంలో మళ్లీ ఏ ప్రళయం సంభవిస్తుందోనని ఇళ్లలోకి వెళ్లడానికి ప్రజలు సాహసం చేయటం లేదు. లక్షలాది మంది పరిస్థితి రెండు రోజులుగా పగలూ రాత్రీ రోడ్లపైనే ఆరు బయటే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒకవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. మరోవైపు రాత్రిళ్లు తీవ్రమైన చలి.. దానికి జత కలిసిన గాలివాన, హిమపాతాలు. ఆహారం, నీరు కరవయ్యాయి. పారిశుధ్యం లోపిస్తోంది.

 

పెను విపత్తును ఎదుర్కొంటున్న నేపాల్‌కు భారత్ సహా పలు దేశాలు ఆపన్న హస్తం అందించాయి. అత్యవసర సరుకులు, వైద్య సిబ్బంది, సహాయక బృందాలను భారత్ రంగంలోకి దింపింది. మరోవైపు.. భూకంపం వల్ల ఎవరెస్ట్ పర్వతం వద్ద మృతుల సంఖ్య 22కు పెరగగా.. ఇంకా 217 మంది ఆచూకీ తెలియకుండా పోయారు. వందలాది మంది అక్కడ చిక్కుబడి ఉన్నారు. టిబెట్‌లో మృతుల సంఖ్య 18కి పెరిగింది.

 

 కఠ్మాండు..

 హిమాలయ దేశం నేపాల్‌లో శనివారం సంభవించిన పెను భూకంపంలో మృతుల సంఖ్య 2,430 కి పెరిగింది. క్షతగాత్రుల సంఖ్య 6,000 దాటిపోయింది. ఒకవైపు శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు, సహాయ చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతుండగానే.. ఆదివారం మళ్లీ రెండు తీవ్ర భూ ప్రకపంనలు నేపాల్ ప్రజలను నిలువెల్లా వణికించాయి. నేపాల్‌ను నేలమట్టం చేసిన శనివారం నాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9 అయితే.. అప్పటి నుంచీ వరుసగా భూప్రకంనలు కొనసాగుతూనే ఉన్నాయి.

 

 దీంతో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు.. పగలూ రాత్రీ ఇళ్లు వదిలి రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చలికి అల్లాడుతూ.. ఆకలికి అలమటిస్తూ.. కనిపించకుండా పోయిన తమ వారి కోసం ఆవేదన చెందుతూ ఉన్న వారి కష్టాలను.. ఆదివారం ఉదయం తొలుత 6.7 తీవ్రతతో ఆ తర్వాత 6.5 తీవ్రతతో సంభవించిన భూ ప్రకంపనలు రెట్టింపు చేశాయి. భూమి కంపించిన ప్రతిసారీ ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఖాళీ ప్రదేశాలకు పరుగులు తీయాల్సి వస్తోంది.

 

 ప్రకంపనల ధాటికి త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం కుప్పకూలింది. ఇందులో దాదాపు 60 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు చెప్తున్నారు. నేపాల్‌లోని 26 జిల్లాలపై భూకంపం ప్రభావం, విధ్వంసం అధికంగా ఉంది. పశ్చిమ ప్రాంతంపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ఈ భూ విలయం నేపథ్యంలో దేశంలో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

 

 శిథిలాల దిబ్బగా కఠ్మాండు...

 పెను విపత్తులో చిక్కుకున్న నేపాలీయులకు సాయం చేసేందుకు.. భారత్ సహా పలు పొరుగు దేశాల నుంచి సహాయ బృందాలు కఠ్మాండు చేరుకున్నాయి. ఈ బృందాలు, స్థానికులతో కలిసి.. కుప్పకూలిన పురాతన ఆలయాలు, భవనాల శిథిలాల దిబ్బల కింద చిక్కుకుపోయిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. కొందరు వట్టి చేతులతోనే శిథిలాలను తొలగిస్తూ మట్టిదిబ్బలను పెళ్లగిస్తూ వెదుకుతుంటే.. కొందరు భారీ యంత్ర సామగ్రితో ఆ పనిచేస్తున్నారు. అయితే.. ఈ సహాయ చర్యలకు తాజా భూ ప్రకంపనలు, పర్వతశ్రేణుల్లో గాలివానలు, హిమపాతాలు అంతరాయం కలిగిస్తున్నాయి.





నేపాల్ లోని భక్తాపూర్ లో శనివారం సంభవించిన భూకంపం కారణంగా ధ్వంసమైన ఇళ్లు


సహాయ బృందాలతో పాటు.. స్థానికులు, పర్యాటకులు కూడా శిథిలాల రాశుల కింద చిక్కుకున్న వారి కోసం అవిశ్రాంతంగా గాలిస్తున్నారు. ఆ శిథిలాల కింద చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఈ మహా విషాదంలో.. అరుదుగా ఎవరైనా ప్రాణాలతో కనిపించి.. వారిని బయటకు తీసుకు రాగలిగితే కాస్తంత సంతోషిస్తున్నారు. దాదాపు 30 లక్షల మంది నివసిస్తున్న కఠ్మాండు నగరం మొత్తం.. అన్ని రహదారులు, కూడళ్లూ శిథిలాల రాశులతో నిండిపోయాయి. సైనిక హెలికాప్టర్లు సహాయ సరుకులను చేరవేరుస్తుండగా.. నగరంలోని ఐదు ప్రాంతాల్లో గాలింపు, సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 

ప్రధానమంత్రి సుశీల్‌కొయిరాలా అధికారిక నివాసం వద్ద కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. పన్ను కార్యాలయం శిథిలాలను రెండు బుల్‌డోజర్లతో తొలగిస్తున్నారు. నేపాల్ హోంమంత్రిత్వ శాఖ వద్ద గల తాజా సమాచారం ప్రకారం ఆదివారం సాయంత్రానికి 2,352 మందికి పైగా మృతి చెందారు. 6,239 మంది గాయపడ్డారు. రాజధాని నగరమున్న కఠ్మాండు లోయలోనే 1,053 మంది మృతి చెందారు. మృతుల్లో.. నేపాల్‌లోని భారత దౌత్యకార్యాలయ ఉద్యోగి కుమార్తె సహా ఐదుగురు భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 

టిబెట్‌లో 18కి పెరిగిన మృతుల సంఖ్య

బీజింగ్: నేపాల్‌లో సంభవించిన పెను భూకంపం వల్ల టిబెట్‌లో మృతుల సంఖ్య 18కి పెరిగింది. మరో 55 మంది గాయపడ్డారు. ఆ దేశంలో చైనా సహాయ బృందాలు ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నాయి. నేపాల్ సరిహద్దులో ఉన్న న్యాలామ్ కౌంటీ నుంచి 7,000 మందిని, గైరాంగ్ కౌంటీ నుంచి 5,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. భూకంపం వల్ల ఈ రెండు కౌంటీల్లో 1,191 ఇళ్లు కూలిపోయాయని, జిగేజ్‌లో 54 ఆలయాలు దెబ్బతిన్నాయని.. రోడ్లు, టెలిఫోన్, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని చైనా ప్రభుత్వం తెలిపింది.

 

 ఆస్పత్రులు కిటకిట.. ఆరుబయటే చికిత్స...

ఈ భూ విలయంలో భారీ ప్రాణనష్టం సంభవించటంతో పాటు.. నేపాల్ చారిత్రక, సాంస్కృతిక సంపద కూడా చాలా వరకూ ధ్వంసమైపోయింది. 1979లో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కఠ్మాండూ లోయలోని హనుమాన్ ధోకా దర్బార్ కూడళ్లు (కఠ్మాండు), పటన్, భక్తాపూర్, స్వయంభు, బౌద్ధనాథ్ బౌద్ధ స్తూపాలు, పశుపతి, చెంగు నారాయణ్ హిం దూ దేవాలయాలు ఉన్నాయి. కఠ్మాండు నడిబొడ్డున ప్రఖ్యాత పురాతన దర్హారా టవర్, దర్బార్ కూడళ్లు కుప్పకూలి వందలాది మందిని బలితీసుకున్నాయి. ఈ ప్రకృతి విపత్తులో క్షతగాత్రుల సంఖ్య వేలల్లోకి పెరుగుతుండటంతో.. వారికి చికి త్స అందించటానికి నేపాల్ ఆస్పత్రులు సతమతమవుతున్నాయి.

 

ఆస్పత్రుల్లో పడకలు, నేల పైనా చోటు సరిపోకపోతుండటంతో ఆరుబయటే నేలపై ఉంచి చికిత్స చేయాల్సి వస్తోంది. విద్యుత్ స్తంభాలు, తీగలు కూలిపోవటంతో.. దేశంలోని చాలా ప్రాంతాలకు రెండు రోజులుగా విద్యుత్ సరఫరా కావటం లేదు. ప్రజలు రాత్రిళ్లు ఆరుబయట అంధకారంలోనే కాలం గడుపుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు చెప్తున్నారు. ఆహారం కొరత, పారిశుద్ధ్య లోపం వంటి ప్రాధమిక సమస్యలూ ఎదుర్కొంటున్నామని.. నేపాల్‌లో చిక్కుకున్న భారత పర్యాటకులు చాలా మంది చెప్పారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ కనెక్షన్లలో లోపాలు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి.

 

 సహాయ చర్యల్లో భారత్ సైన్యం...

 భారత వైమానిక దళానికి చెందిన 13 సైనిక విమానాలు.. క్షతగాత్రుల కోసం మందులు, తాత్కాలిక ఆస్పత్రులు, టెంట్లు, బ్లాంకెట్లు, 50 టన్నుల నీరు, ఆహారం తదితర సహాయ సరుకులతో ఆదివారం కఠ్మాండు చేరుకున్నాయి. జాతీయ విపత్తు సహాయ దళం నుంచి 700 మందికి పైగా సహాయ చర్యల నిపుణులు రంగంలోకి దిగారు. భూకంపంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి నేపాల్ ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు కేటాయించింది.


గాలింపు, సహాయం, వైద్య బృందాలు, ఆస్పత్రులకు టెంట్లు, శిథిలాలను తొలగించేందుకు భారీ యంత్రాలు, రవాణా సౌకర్యాలు దెబ్బతిన్న ప్రాంతాలను చేరుకోవటానికి హెలికాప్టర్లు వంటి విషయాల్లో సహాయం కోసం నేపాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేయటంతో.. ప్రపంచం నలుమూలల నుంచీ సహాయ ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. అమెరికా, బ్రిటన్, చైనా, పాకిస్తాన్, యూరోపియన్ యూనియన్ దేశాలు సహాయం పంపించనున్నట్లు ప్రకటించాయి.


రెడ్ క్రాస్, ఆక్స్‌ఫామ్, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్, క్రిస్టియన్ ఎయిడ్ వంటి అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా సహాయ బృందాలను నేపాల్‌కు పంపిస్తున్నాయి. కఠ్మాండుకు 80 కిలోమీటర్ల దూరంలోని భూకంప కేంద్రం సమీప గ్రామాల ప్రజల పరిస్థితిపై రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ సొసైటీల అంతర్జాతీయ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top