కశ్మీర్‌లో 25 మందితో కేబినెట్

కశ్మీర్‌లో 25 మందితో కేబినెట్ - Sakshi


రేపు సీఎంగా ప్రమాణం చేయనున్న ముఫ్తీ సయీద్

ప్రధానితో గంటపాటు చర్చలు జరిపిన పీడీపీ అగ్రనేత

డిప్యూటీ సీఎం సహా బీజేపీకి 12 మంత్రి పదవులు

అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్న సయీద్

ప్రజల కోసం ఉత్తర-దక్షిణ ధ్రువాలు ఏకమయ్యాయని వ్యాఖ్య

 

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో కొలువుదీరనున్న పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా 25 మందితో కూడిన మంత్రివ ర్గం ఏర్పాటుకానుంది. కాబోయే సీఎం, పీడీపీ అగ్రనేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ నేతృత్వంలోని ఈ కేబినెట్‌లో సగం మంది బీజేపీ సభ్యులు ఉంటారు. ఆదివారం జమ్మూలోని జోర్వార్‌సింగ్ ఆడిటోరియంలో జరిగే ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. కశ్మీర్‌లో సర్కారు ఏర్పాటులో 2 నెలలుగా కొనసాగిన ప్రతిష్టంభనను తొలగించడానికి పీడీపీ-బీజేపీ ఇటీవలే ఒప్పందానికి రావడం తెలిసిందే. ఆర్టికల్ 370 సహా కీలకాంశాలపై ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీతో ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలోనే  సయీద్ భేటీ అయ్యారు. గంటపాటు ఈ భేటీ జరిగింది.

 

 ప్రమాణానికి ప్రధానిని సయీద్ ఆహ్వానించారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం సయీద్ కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రి సహా 12 మంది బీజేపీ సభ్యులు ఉంటారు. ఆ పార్టీ నేత నిర్మల్ సింగ్‌కు డిప్యూటీ పోస్టు దక్కే అవకాశముంది. కాగా, ప్రధానితో చర్చల వివరాలను మీడియాకు తెలపడానికి సయీద్ నిరాకరించారు. తమ ఉమ్మడి ప్రభుత్వం చేపట్టే కనీస ఉమ్మడి కార్యక్రమం వివరాలను ఆదివారం మధ్యాహ్నం ప్రకటిస్తామని మాత్రం అన్నారు. పీడీపీ-బీజేపీ కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ఉత్తర-దక్షిణ ధ్రువాలు ఏకమైనట్లుగా అభివర్ణించారు. ఎన్నికల ఫలితాలను బట్టి కశ్మీర్ ప్రజలు పీడీపీకి, జమ్మూ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, అందుకే రెండు పార్టీలు కలసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నామన్నారు.

 

 కేంద్రంలో స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఉన్నందున రాష్ర్టంలో వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకోకూడదనే పీడీపీ భావించిందని, ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ అన్న మోదీ నినాదానికి తానూ మద్దతిస్తున్నానన్నారు. రాష్ర్టంలో రాజకీయంగా, పాలనాపరంగా బీజేపీతో కసి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని అమలుపరుస్తామన్నారు. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మోదీతో కలసి పనిచేస్తానని పేర్కొన్నారు. పాకిస్తాన్ విషయంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి అనుసరించిన విధానాన్నే పాటిస్తామని, అందుకు మోదీ అంగీకరించారన్నారు.  

 

 కశ్మీర్‌ను శాంతి ద్వీపంగా మార్చాలని మోదీ భావిస్తున్నారని, తమ అభిమతమూ అదేనని అన్నారు. జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల ప్రజల ఆకాంక్ష మేరకే ఇరు పార్టీలు కలసి పనిచేస్తాయని  పునరుద్ఘాటించారు. మోదీతో భేటీ తర్వాత మాజీ ప్రధానులు, మన్మోహన్‌సింగ్, వాజ్‌పేయిని కూడా వారి నివాసాలకు వెళ్లి సయీద్ కలుసుకున్నారు.ద తొమ్మిదేళ్ల తర్వాత సయీద్ మళ్లీ సీఎం అవుతుండగా, కశ్మీర్‌లో బీజేపీ తొలిసారిగా అధికారం చేపడుతుండటం విశేషం. శుక్రవారం పీడీపీ సయూద్‌ను తన శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది.  బీజేపీతో పీడీపీ జట్టుకట్టడాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కూటమి పట్ల రాష్ర్ట ప్రజలేమీ హర్షించడం లేదన్నారు. బీజేపీతో పీడీపీ కలవడం వల్ల రాష్ర్ట రాజధాని నాగ్‌పూర్(ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది) కు మారిందన్నారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top