దేవుడా..!

దేవుడా..!


స్కూలు బస్సును ఢీకొన్న రైలు.. 16 మంది మృతి

 మృతుల్లో డ్రైవర్, క్లీనర్, 14 మంది బడి పిల్లలు

 మెదక్ జిల్లాలోని మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద ఘోరం

 పట్టాలు దాటుతున్న బస్సును ఢీకొన్న నాందేడ్ ప్యాసింజర్

 పల్టీలు కొట్టిన బస్సు, 20 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన రైలు

 నుజ్జునుజ్జయిన వాహనం.. రక్తసిక్తమైన పట్టాలు

 

 కళ్ల ముందే ఘోరం

 8:00

 

 కాకతీయ హైస్కూల్ బస్సు బయలుదేరింది. ఉదయం 8.10 గంటలకు కిష్టాపూర్ చేరింది. అక్కడ 10 మంది విద్యార్థులను ఎక్కించుకొని వెంకటాయపల్లి మీదుగా గుండ్రెడ్డిపల్లికి చేరింది. సరిగ్గా 8.45 గంటలకు ఇస్లాంపూర్ వరకు వచ్చింది. అక్కడి నుంచి మొత్తం 36 మంది విద్యార్థులతో మాసాయిపేట వైపునకు బయలుదేరింది.

 

 8:48

 మీర్జాపల్లి స్టేషన్ నుంచి నాందేడ్ - హైదరాబాద్ ఫాస్ట్ ప్యాసింజర్ బయలుదేరింది. రెండు నిమిషాల్లో 30 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. మరో ఐదు నిమిషాలకు 70 కి.మీ. గరిష్ట వేగానికి చేరుకుంది. 8.58 నిమిషాలకు మాసాయిపేట శ్రీనివాసనగర్ రైల్వే స్టేషన్‌ను దాటింది. అక్కడి నుంచి 600 మీటర్ల దూరంలోనే మాసాయిపేట రైల్వే క్రాసింగ్ ఉంది.

 

 8:58

 రైల్వే క్రాసింగ్‌కు బస్సు  15 మీటర్ల దూరంలో ఉంది. 20 కిలోమీటర్ల వేగంతో అది పట్టాలవైపు వస్తోంది. ఈ రైల్ క్రాసింగ్‌కు గేటు లేదు. కాపలా ఎవరూ లేరు. మరోపక్క రైలు గంటకు 70 కి.మీ వేగంతో దూసుకొస్తోంది. పెద్దగా కూత పెడుతూ 563 కిలోమీటర్ రాయి వరకు వచ్చేసింది. అక్కడికి 30 మీటర్ల దూరంలోనే ఉన్న బస్సును గమనించిన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. పెద్ద శబ్దంతో రైలు ముందుకు దూసుకొచ్చింది. బస్సులోని విద్యార్థులు గమనించి రైలు.. రైలు అంటూ పెద్దగా కేకలు వేశారు. అప్పటికి రైలు పట్టాలకు అతి సమీపానికి బస్సు చేరుకుంది. అప్పుడు బస్సు బ్రేక్ వేసినా ప్రమాదం తప్పి ఉండేది. డ్రైవర్ బిక్షపతి ఆందోళన పడి బస్సును ముందుకే పోనిచ్చాడు. సరిగ్గా 8.59 గంటలకు వేగంగా దూసుకొచ్చిన రైలు.. స్కూల్ బస్సు ముందు భాగాన్ని ఢీకొట్టింది. బస్సు ఎగిరి పల్టీలు కొట్టి కిందపడి నుజ్జునుజ్జయింది. పట్టాలపైనే దాదాపు 20 మీటర్ల దూరం వరకు బస్సును రైలు ఈడ్చుకెళ్లింది.

 

 


సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఘోరం జరిగిపోయింది.. పెను విషాదం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారులు అకారణంగా బలయ్యారు. స్కూలుకెళ్లే సంబరంతో ఉదయాన్నే బస్సెక్కిన పసిమొగ్గలు అంతలోనే రాలిపోయాయి. రైలు పట్టాలే వారి పాలిట శాపంగా మారాయి. మృత్యుశకటంలా దూసుకొచ్చిన రైలు పసివాళ్ల నిండు నూరేళ్లనూ లాగేసుకుంది. రైల్వేల నిర్లక్ష్యం.. బస్సు డ్రైవర్ అజాగ్రత్త కలగలిసి 16 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. కన్నబిడ్డలను ఇంటి దీపాలుగా చూసుకుంటూ మురిసిపోయిన తల్లిదండ్రులకు చివరకు గర్భశోకమే మిగిలింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట గ్రామ పరిసరాల్లోని కాపలాలేని లెవల్ క్రాసింగ్.. గురువారం నాడు మరుభూమిగా మారింది. మాంసపు ముద్దలు.. రక్తపు మడుగులతో ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది.

 

 అంతులేని విషాదం

 

 ఒక్క క్షణం.. ఒకే ఒక్క క్షణంలో పసిమొగ్గలు మాంసం ముద్దలైపోయారు. మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన రైలు స్కూలు బస్సును ఢీకొట్టడంతో వాహనం తుక్కు గా మారింది. ఇనుప చువ్వలు వారి శరీరాలను చిధ్రం చేశాయి. బస్సును రైలు ఈడ్చుకెళ్లడంతో అందులో నలిగిపోవడం వల్ల ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. రైలు ముందుభాగంలో మాంసం ముద్దలు అతుక్కుపోయాయి. రైల్వే క్రాసింగ్ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. చిన్నారుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. పట్టాలకు అటూఇటు దాదాపు 30 మీటర్ల పరిధిలో శరీర భాగాలు, విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలు, టిఫిన్ బాక్స్‌లు ఎగిరిపడ్డాయి. అన్నం మెతుకులు కూడా రక్తంతో తడిసిపోయాయి. పిల్లలంద రూ ఐదు నుంచి 15 ఏళ్లలోపు వారే. స్థానికులు వెంటనే స్పందించారు. అంబులెన్సులకు, రైల్వే అధికారులకు సమాచారమిచ్చి.. సహాయకార్యక్రమాలు చేపట్టారు.

 

 బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు 20 నిమిషాల పాటు శత విధాలుగా ప్రయత్నించారు. జేసీబీని తెప్పించి ఇనుప ఊచలను తొలగించారు. వాహనంలోని ప్రతి విద్యార్థికీ ఇనుప చువ్వలు గుచ్చుకున్నాయి. డ్రైవర్ సహా 13 మంది అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన మిగతా పిల్లలను సమీపంలోని కొంపల్లిలో ఉన్న హర్ష, బాలాజీ, యశోద ఆసుపత్రులకు తరలించారు. వీరిలో హర్ష ఆసుపత్రి, యశోద ఆసుపత్రిలో ముగ్గరు చిన్నారులు చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ఘటనా స్థలికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువుల వేదన వర్ణనాతీతం. విగతజీవులైన తమ బిడ్డలను చూసి గుండెలవిసేలా రోదించారు. వారి ఏడుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. విగతజీవులుగా పడి ఉన్న పసి మొగ్గలను చూసిన వారందరి కళ్లూ చెమర్చాయి.

 

 తాళాలు వేసుకొని పరారీ

 

 ప్రమాదం విషయం తెలియగానే పాఠశాల ప్రిన్సిపల్ జితేందర్‌రెడ్డి హడావుడిగా పాఠశాలకు సెలవు ప్రకటించి తాళాలు వేసుకుని పారిపోయారు. పాఠశాలలో 12 మంది టీచర్లు పనిచేస్తుండగా.. వారు కుడా ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. పిల్లల తల్లిదండ్రుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయంతో వీరంతా జారుకున్నారు. దాంతో సమాచారమిచ్చే వారు కరువయ్యారు. తమ పిల్లల యోగక్షేమాలు తెలుసుకుందామని పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులకు బడి తాళాలే దర్శనమిచ్చాయి.

 

 పాఠశాల గుర్తింపు రద్దు : డీఈవో

 

 విద్యార్థులను తీసుకువచ్చే బస్సుకు అర్హత లేని డ్రైవర్‌ను నియమించి వారి మరణానికి కారణమైన తూప్రాన్ కాకతీయ టెక్నో స్కూల్ గుర్తింపును రద్దు చేస్తున్నట్లు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వర్‌రావు విలేకరులకు తెలిపారు.


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top