రూ.10 వేల కోట్లు వృథా?

రూ.10 వేల కోట్లు వృథా? - Sakshi


న్యూఢిల్లీ: ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించేలా ఉండాలనేది భారత నేవీ కల. ఆ కలను నిజం చేసుకోవడానికి సముద్ర జలాలపై పట్టుకు కోసం రష్యా నుంచి ప్రత్యేకంగా మిగ్-29కే విమానాలను భారత్ కొనుగోలు చేసింది. విమానాలను తయారు చేసిన రష్యా వాటిని వాడకానికి ఉపయోగించక ముందే దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మిగ్-29కే సామర్ధ్యంపై పలుమార్లు విమర్శలు వచ్చాయి.



తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) మిగ్-29కే విమానాల సామర్ధ్యం మీద అనుమానాలు వ్యక్తం చేసింది. వేల కోట్లు పోసి కొనుగోలు చేసిన విమానాల పనితీరు సరిగా ఉండటం లేదని, అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే వినియోగానికి అందుబాటు ఉంటున్నట్లు పేర్కొంది. పార్లమెంట్ శీతాకాలపు సమావేశాలకు మిగ్-29కే మీద రివ్యూని ఇచ్చిన కాగ్.. విమానం వ్యవస్థ, పనితీరు, డిజైనింగ్ లలో లోపాలపై తీవ్రంగా స్పందించింది. అత్యవసర సమయాల్లో వినియోగానికి 50 శాతం కంటే తక్కువగా అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొంది.



2004 నుంచి 2010 మధ్యలో దాదాపు రూ.10,500 కోట్లతో భారత్ రష్యా నుంచి 45 మిగ్-29కే విమానాలను కొనుగోలు చేసింది. వీటిని యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య ద్వారా నేవీ వినియోగిస్తోంది. ప్రస్తుతం నిర్మిస్తున్న విక్రాంత్, డిజైనింగ్ దశలో ఉన్న విశాల్ లను మిగ్-29కేను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్నారు. 2010లో మిగ్-29కే వినియోగాన్ని ప్రారంభించిన నేవీ దాదాపు 50 శాతానికి పైగా విమానాల ఇంజన్లలో డిజైన్ సంబంధిత లోపాలతో వినియోగానికి తరచూ దూరమయ్యాయి.


లోపాలతో ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. విమాన ఇంజన్ లోపంతో సింగిల్ ఇంజన్ మీద పది సార్లు ల్యాండయిన ఘటనలు ఉన్నాయని కాగ్ రివ్యూ రిపోర్టులో తెలిపింది. నౌకకు ఉండే చిన్న కారిడార్ మీద ల్యాండవుతున్న సమయంలో మిగ్-29కే కాంపోనెంట్స్ పలుమార్లు ఫెయిల్ అయ్యాయి. నేవీ పలుమార్లు మిగ్-29కే డిజైన్ ను మార్చి సరికొత్త డిజైన్ ను అప్ డేట్ చేసిన ప్రయోజనం లేదని, భారతీయ నేవీ పైలట్లు ట్రైనింగ్ సమయంలో పలుమార్లు విపరిణామాలు ఎదుర్కొన్నట్లు వివరించింది.



అధికారులు ఏమంటున్నారు..

మిగ్-29కే సమస్యలు ఇప్పటికిప్పుడు పరిష్కరించలేమని సీనియర్ నేవీ అధికారులు అంటున్నారు. మిగ్-29కే గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బాగుంటుందని, యుద్ధ విమానాల వాహాకనౌక గోర్ష్ కోవ్ పునరుద్దరణ, మిగ్-29కేలను ప్యాకేజ్ డీల్ గా తీసుకున్నారని తెలిపారు. గోర్ష్ కోవ్ పునరుద్దరణ అనంతరం ఐఎన్ఎస్ విక్రమాదిత్యగా దాని పేరును మార్చింది.

 

ప్రస్తుతం గోవాలో ఉన్న విమానాల తయారీదారులకు చెందిన రష్యా ఇంజనీర్ల బృందం ఎయిర్ క్రాఫ్ట్ ల టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రష్యా నేవీ కంటే ముందుగానే భారతీయ నేవీ మిగ్-29కే ల వినియోగాన్ని ఆరంభించిందని, కొత్త ప్లాట్ ఫాంను వినియోగించేటప్పుడు చిన్నచిన్న సమస్యలు మామూలేనని వారు అన్నారు. భారత నేవీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రష్యా డిజైన్లను మారుస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఆ దేశ ప్రధానంగా వినియోగిస్తున్న సుఖోయ్ యుద్ధ విమానాల స్థానంలో మిగ్-29కే లను వినియోగించేందుకు రష్యా నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top