జెడ్పీ అతిథిగృహం ప్రారంభమెప్పుడు?

జెడ్పీ అతిథిగృహం ప్రారంభమెప్పుడు? - Sakshi


‘రాజుల పైస రాళ్ల పాలు’ అన్నట్లుగా ఉందీ వ్యవహారం.. రూ.60లక్షలతో అతిథిగృహాన్ని నిర్మించినా ప్రారంభానికి నోచుకోవడంలేదు. జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారినా దాన్ని ప్రారంభించడాన్ని పట్టించుకోలేదు. పనులు నత్తనడకన సాగినా ఎట్టకేలకు 2012లో పూర్తయినా అప్పటినుంచి ప్రారంభం కాకుండా అలాగే ఉండిపోయింది. చివరకు శిథిలావస్థకు కూడా చేరుకునేలా ఉంది.

- వికారాబాద్

 

- రూ.60 లక్షలతో భవన నిర్మాణం పూర్తి చేసిన అధికారులు

- నలుగురు కలెక్టర్లు మారినా ప్రారంభానికి నోచుకోని గెస్టుహౌస్

- నాలుగేళ్లుగా ఎదురుచూపులు


ప్రస్తుతం జెడ్పీ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న సునీతామహేందర్‌రెడ్డి 2010 పిభ్రవరిలో వికారాబాద్‌లోని రాజీవ్‌నగర్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో జిల్లా పరిషత్ అతిథిగృహాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అప్పటి సర్వసభ్యసమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. పనులను చేపట్టాలని పంచాయితీరాజ్‌శాఖ అధికారులకు జెడ్పీ చైర్ పర్సన్ ఆదేశాలు జారీ చేశారు. భవనం డిజైన్, నిర్మాణ ఖర్చు రూ.60 లక్షల వరకు వస్తుందని పంచాయితీరాజ్ శాఖ అధికారులు అంచనాలు తయారు చేసి చైర్ పర్సన్‌కు అందచేశారు. అప్పటి జిల్లా కలెక్టర్ దానకిషోర్ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిలో 12 గుంటలను కేటాయించారు.



మొదటివిడతగా రూ.10 లక్షలను కేటాయించారు. దీంతో పనులకు పంచాయితీరాజ్ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత వచ్చిన కలెక్టర్లు ప్రేంచంద్రారెడ్డి, శేషాద్రి, వాణీప్రసాద్, శ్రీధర్ రూ.10 లక్షల చొప్పున విడతల వారీగా నిధులను విడుదల చేశారు. కానీ పనులు నత్తనడకన కొనసాగాయి. గడువులోగా పనులు పూర్తి కాలేదు. కాగా ఇటీవల వచ్చిన పంచాయితీరాజ్ ఈఈ పూర్తి అయిన భవనంలో మార్పులు చేర్పులు అంటూ కొత్త ప్రతిపాదనను తయారు చేసి మళ్లీ కలెక్టర్‌కు పంపించినట్లు విశ్వసనీయ సమాచారం.

 

ప్రారంభాన్ని అడ్డుకుంటోంది జెడ్పీటీసీ సభ్యుడేనా?


పనులు పూర్తయి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు ప్రారంభానికి నోచుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల దీని పక్కనే ఉండడంతో విద్యార్థినులకు ఇబ్బంది అవుతుందని ఓ జెడ్పీటీసీ సభ్యుడు, ఆ ప్రాంత సీనియర్ కాంగ్రెస్ మైనారిటీ నాయకులు అడ్డు చెప్పినట్లు తెలుస్తోంది. సర్కారు సొమ్ము రూ.60 లక్షలతో పూర్తిచేసుకున్న భవనం ఇంతవరకు ప్రారంభానికి నోచుకోకపోవడంపట్ల వచ్చిన ఏ కలెక్టరూ పట్టించున్న పాపానపోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు దీని ప్రారంభానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top