ఒక్కసారి రండి.. ప్లీజ్!


 జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల వైపు

 కన్నెత్తి చూడని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

 మొక్కుబడిగా హాజరవుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు

 డుమ్మా కొడుతున్న జెడ్పీటీసీలు

 గౌరవ సభ్యులైన ఎంపీపీలదీ అదే తీరు

 నేడు, రేపు జెడ్పీ సర్వసభ్య సమావేశాలు


 నల్లగొండ :  జిల్లా ప్రజా పరిషత్...! గ్రామ, మండల స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిలువెత్తు వేదిక. అధికార, ప్రతిపక్ష పార్టీల భాగస్వామ్యంతో నిండుగా కళకళడాల్సిన సర్వసభ్య సమావేశాలు నీరుగారుతున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి...ప్రజల వాణిని వినిపించాల్సిన సభ్యులు సమావేశాలకు హాజరుకావడం లేదు. జిల్లా పరిషత్ పాలక వర్గంలో జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కో ఆప్షన్ సభ్యులు కలిపి మొత్తం 81 మంది ప్రాతినిధ్యం విహ స్తున్నారు. వీరిలో సింహభాగం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు.

 

 రెండో స్థానంలో టీఆర్‌ఎస్ సంబంధించిన సభ్యులు ఉన్నారు. పాలక వర్గం కొలువుదీరిన దగ్గరినుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు సర్వసభ్య సమావేశాలు జరిగాయి. దీంట్లో ప్రజా సమస్యల కంటే ఎక్కువ ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమాల పైనే సమీక్ష జరిగింది. మన ఊరు-మన ప్రణాళిక, మిషన్ కాకతీయ, బీఆర్‌జీఎఫ్ ప్రణాళిక , స్థాయి సంఘాల ఎన్నికల అంశాలపైనే సమావేశాలు ముగించారు. కానీ ఏజెండాల్లో పొందుపర్చిన అంశాల పైనే సమగ్ర చర్చ ఎన్నడూ జరగలేదు. ఐదో సారి జరగాల్సిన సమావేశం వివిధ కారణాల దృష్ట్యా ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వ చ్చారు. ఇక అధికార పార్టీకి దీటుగా ప్రజా సమస్యలపై స్పందించాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనీసం సమావేశాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

 

  ఈ నాలుగు సార్లు జరిగిన సమావేశాలకు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మినహా మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సభలో కాలుమోపలేదు. టీఆర్‌ఎస్ మంత్రులు హాజరైన సమావేశాలకు మాత్రమే ఆ పార్టీ ఎమ్మెల్యేలు వస్తున్నారు తప్పా మిగిలిన సందర్భాల్లో కొందరు ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారు. ఎంపీల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరు ఉంటున్నప్పటికీ, రాజ్యసభ ఎంపీ పాల్వాయి మాత్రం గైర్హాజరవుతున్నారు. జెడ్పీసీటీసీ సభ్యులు 59 మంది కిగాను 17 మంది సభ్యులు తరచూ సమావేశాలకు ఎగనామం పెడుతున్నారు. గౌరవ సభ్యుల హోదాలో హాజరుకావాల్సిన 59 మంది ఎంపీపీల్లో ఇప్పటి వరకు నాలుగు సార్లు జరిగిన సమావేశాలకు గైర్హాజరైన వారు 38 మంది ఉన్నారు. దీంట్లో కొందరు ఎంపీపీలు రెండు నుంచి మూడు సమావేశాలకు హాజరుకాకపోగా...మరికొందరు ఏ ఒక్క సమావేశానికీ కూడా రాకపోవడం గమనార్హం.

 

 ఒక్కరోజులోనే ముగిస్తారా..?


 ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ చేయాలని సభ్యులు పట్టుబట్టిన నేపథ్యంలో ఈ దఫా రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. శుక్ర, శనివారాల్లో జరిగే ఈ సమావేశాలకు ఎంత మంది సభ్యులు హాజరవుతారనే దానిపైనే సమీక్షా ఆధారపడి ఉంది. ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో ఏప్రిల్‌లో నిర్వహించేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. అప్పట్లో ఇచ్చిన ఏజెండా పుస్తకాలనే సభ్యులు శుక్రవారం నాటి సమావేశానికి వెంటపెట్టుకురావాలి. ఈ రెండు మాసాల కాలంలో శాఖా పరంగా ఏమైన మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే ఆ కాపీలను అప్పటికప్పుడు సభ్యులకు అందజేయడం జరుగుతుంది. అయితే ఎండలు మండిపోతుండటంతో ఒక్కరోజులోనే సమావేశాన్ని ముగించే అవకాశం లేకపోలేదు. సభ్యులు అవసరమని భావించిన పక్షంలో మాత్రమే రెండో రోజు కూడా కొనసాగించే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top