టీడీపీ తట్టాబుట్ట సర్దుకోవటం ఖాయం


* తెలంగాణ బిడ్డలుగా తెలుగు తమ్ముళ్ల  ఆలోచనా ధోరణి మారాలి..

* జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత


ఖమ్మం రూరల్: రాజకీయాలను అవపోసన పట్టిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును విమర్శించేస్థాయి రాజకీయాల్లో ఓనమాలు కూడా నేర్వని టీడీపీ నాయకులకు లేదని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. తెలంగాణ బిడ్డలుగా తెలుగు తమ్ముళ్ల ఆలోచనా ధోరణి మారాలని హితవు పలికారు. భవిష్యత్‌లో తెలంగాణలో టీడీపీ తట్టాబుట్టా సర్దుకోవటం ఖాయమన్నారు.



మండలంలోని పెద్దతండాలో టీఆర్‌ఎస్ నాయకుని గృహ ప్రవేశానికి హాజరైన చైర్‌పర్సన్ జెడ్పీటీసీ ధరావత్ భారతి క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని మొదటి నుంచి వ్యతిరేకించిన టీడీపీ నాయకులు ఆలోచణ ధోరణి మార్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. టీ ఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్నది దొంగలు, రౌడీలు అని టీడీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని.. ఎవరు దొంగలో, ఎవరు రౌడీలో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.



టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలువురు టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో ఇది చూసి ఇక తమపని అయిపోయినట్లేనని టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌పై అభాండాలు వేస్తున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీ తట్టాబుట్టా సర్దుకుపోవడం ఖాయమన్నారు. కోల్పోతున్న ఉనికిని కాపాడుకునేయత్నంలో భాగంగా ప్రజలను నమ్మించడానికి టీడీపీ నేతలు రకరకాల అబద్దాలు ఆడుతున్నారన్నారు. ఈసమావేశంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ధరావత్ రామ్మూర్తినాయక్, ఏదులాపురం సొసైటీ చైర్మన్ మంకెన నాగేశ్వరరావు, జడ్పీటీసీ ధరావత్ భారతి, నాయకులు మద్ది మల్లారెడ్డి, తేజావత్ పంతులునాయక్, కొప్పుల ఆంజనేయులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top