జీరో దందా


ఖమ్మం వ్యవసాయం : ఆరుగాలం కష్టించినా నిబంధనల పేరుతో రైతులకు గిట్టుబాటు ధర కల్పించని అధికారులు అక్రమ వ్యాపారులకు మాత్రం అండదండలు అందిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల జీరో దందాకు రాచమార్గం వేస్తున్నారు. దొడ్డిదారిన సరుకులు తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారికి బాసటగా నిలుస్తున్నారు. పొంతన లేని లెక్కలు జిల్లాలో పంటల సాగు విస్తీర్ణాన్ని, అందులో పంట ఉత్పత్తులను జిల్లా వ్యవసాయ శాఖ ప్రకటిస్తుంటుంది. రైతులు పండించిన ఉత్పత్తులను గ్రామాలు, వ్యవసాయ మార్కెట్లలో అమ్ముతుంటారు.



ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వ్యాపారులు మార్కెటింగ్, వాణిజ్య పన్నుల శాఖలకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మార్కెటింగ్ శాఖకు ఒక శాతం సెస్‌ను, వాణిజ్యపన్నుల శాఖకు 4 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. వ్యవసాయ శాఖ పేర్కొన్న విధంగా పంట ఉత్పత్తుల మొత్తానికి పన్నులు జమకావడం లేదు.  30 నుంచి 40 శాతం పంట ఉత్పత్తులను రికార్డుల్లో చేర్చడం లేదు. ఈ సరుకును అక్రమంగా తరలిస్తూ (జీరో దందా) ప్రభుత్వ శాఖల ఆదాయానికి గండిపెడుతున్నారు.



అక్రమాలు ఇలా...

జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నతో పాటు పెసర, కంది, మినుము, వేరుశనగ తదితర పంటలను పండిస్తున్నారు. వీటితోపాటు కూరగాయలు, ఆకు కూరలు, మామిడి, బొప్పాయి, జామ తదితర పండ్లను కూడా పండిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా సాగవుతున్న పంటల ఉత్పత్తులు, వాటి నుంచి వాస్తవంగా రావాల్సిన పన్నులు, ప్రస్తుతం వస్తున్న పన్నులను పరిశీలిస్తే ప్రభుత్వ ఆదాయం ఎంత మేరకు గండి పడుతుందో అర్థమవుతుంది. వరి పంటను (2013-14 ఖరీఫ్, రబీలను) పరిశీలిస్తే జిల్లాలో సుమారు 2.50 లక్షల హెక్టార్లలో సాగు చేశారు.



ఈ విస్తీర్ణం నుంచి 1.20 కోట్ల క్వింటాళ్ల దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పంట ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ శాఖకు సుమారు 15  కోట్ల మేరకు సెస్ రావాల్సి ఉంటుంది. కానీ 2013-14 సంవత్సరంలో 44.91 లక్షల క్వింటాళ్ల పంట ఉత్పత్తికి మాత్రమే రూ. 6 కోట్ల సెస్ వసూలయ్యాయి. మిర్చిని 30 వేల హెక్టార్లలో(2013-14) సాగు చేశారు. 18 లక్షల క్వింటాళ్ల పంట ఉత్పత్తి అవుతోంది. ఈ మొత్తం నుంచి మార్కెటింగ్ శాఖకు సుమారు రూ.10 కోట్ల మేరకు సెస్ వసూలు కావాల్సి ఉంటుంది. అయితే... మార్కెటింగ్ శాఖ లెక్కల ప్రకారం 11.53 లక్షల క్వింటాళ్లు మాత్రమే లెక్కల్లో కనిపిస్తున్నాయి. వీటి ద్వారా రూ.6.88కోట్లు మాత్రమే సెస్ వసూలైంది. మొక్కజొన్నను పరిశీలిస్తే 2013-14లో సుమారు 40 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఈ విస్తీర్ణం నుంచి సుమారు 25 లక్షల క్వింటాళ్ల మేరకు దిగబడి వస్తోంది.



దీని నుంచి సుమారు 4 కోట్లకు పైగా సెస్ వస్తోంది. అయితే.. 23 లక్షల క్వింటాళ్లకు మాత్రమే సెస్ వసూలైంది. రూ.2.99 కోట్లు సెస్ రూపంలో వసూలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. పత్తి, పెసర, మినుము, కంది తదితర పంటల ఉత్పత్తులు, మార్కెట్‌కు అందుతున్న సెస్ కూడా తక్కువగా ఉంటుంది. జిల్లాలోని 13 వ్యవసాయ మార్కెట్లు, 33 చెక్‌పోస్టుల నుంచి పంట ఉత్పత్తుల సెస్ వసూలవుతోంది. ఏటా సుమారు రూ.33 నుంచి 34 కోట్ల వరకు సెస్ వస్తోంది.



ఈ మార్కెట్ సెస్ ఆధారంగా వాణిజ్య పన్నుల శాఖ నాలుగు వంతుల పన్నును వసూలు చేయాల్సి ఉంటుంది. మార్కెటింగ్ శాఖకు సుమారు 30 నుంచి 40 శాతం పంట ఉత్పత్తుల సెస్ చెల్లించకపోవటంతో దాదాపు రూ.15 కోట్లు గండి పడుతోంది. రూ.15 కోట్లు మార్కెటింగ్ శాఖకు చెల్లించకపోవడంతో వాణిజ్య పన్నుల శాఖకు రూ.60  కోట్ల రాబడి తగ్గింది. అన్నిరకాల పంట ఉత్పత్తుల నుంచి మొత్తంగా రూ.75 నుంచి రూ.100 కోట్ల వరకు  పన్నులు ప్రభుత్వానికి అందకుండా పోతున్నాయి.



వ్యాపారుల దందాకు అండ

పన్నులు ఎగవేయడానికి వ్యాపారులు  జీరో దందాకు తెరతీశారు.  గ్రామాలు, మార్కెట్లలో కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను మార్కెటింగ్ శాఖ రికార్డు చేయకుండా అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. మార్కెటింగ్ శాఖకు చెల్లించే పన్నులో సగం మొత్తాన్ని సంబంధిత అధికారులకు ముట్టజెప్పి ఎలాంటి పత్రాలు లేకుండా సరకును తరలిస్తున్నారు. రహదారుల వెంట ఉన్న చెక్‌పోస్టుల్లో ఉన్న సిబ్బందికి కూడా లంచాలు ఇస్తూ సరుకును దాటిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని మార్కెట్లలో సిబ్బంది కొరత కూడా బాగా ఉంది. మొత్తం 13 మార్కెట్లలో 200 మందికి పైగా ఉద్యోగులు పని చేయాల్సి ఉండగా 90 మంది  ఉన్నారు.



వీరిలో 52 మంది ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పని చేస్తున్నారు.  39 మంది మిగిలిన 12 మార్కెట్లలో పని చేస్తున్నారు. ఒక్కో కార్యదర్శి మూడు నుంచి నాలుగు మార్కెట్లకు ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో చెక్‌పోస్టులో ఇద్దరు సూపర్‌వైజర్లు, ఒక అటెండర్, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు పని చేయాల్సి ఉండగా సిబ్బంది కొరత కారణంగా ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. కొన్ని చెక్‌పోస్టులు సెక్యూరిటీ గార్డులతో నిర్వర్తిస్తున్నారు. సిబ్బంది కొరతను కూడా ఆసరాగా చేసుకుని వ్యాపారులు తమ దందాను యధేచ్ఛగా సాగిస్తున్నారు. దీంతో మిర్చి, వరి జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది.



జిల్లాలో పండించిన ఈ పంటను రైతుల పేరుతో నేరుగా మిల్లులకు, పొరుగు జిల్లాలకు తరలిస్తున్నారు. పెసర, మినుము, కంది, వేరుశనగ పంటలను కూడా రైతుల పేరిట ఎలాంటి బిల్లులు లేకుండా రాచమార్గంలో పంపిస్తున్నారు.  ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో అక్రమాలను నిరోధించేందుకు ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి కొంత మేరకు ఫలితాన్ని సాధించినప్పటికీ వ్యాపారుల ఆగడాలను అధికారులు అరికట్టలేక పోతున్నారు. ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను ప్రక్షాళన చేసి నిబంధనలను పటిష్ట పరచటంతో పాటు సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమిస్తే ప్రభుత్వ ఆదాయానికిగండి పడకుండా కొంత మేరకైనా నివారించే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top