ప్రజల కలలు నెరవేరడంలేదు

ప్రజల కలలు నెరవేరడంలేదు - Sakshi


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడచినా ఏ ఒక్క సామాజికవర్గానికి న్యాయం జరగలేదని, ఏ కార్యక్రమం చూసినా ప్రగతి లేదని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని, బంగారు భవిష్యత్ ఉంటుందని ఆశించిన ప్రజలకు నిరాశ తప్పడం లేదని అన్నారు. ప్రస్తుతమున్న ఈ రకమైన తెలంగాణను ఎవరూ కోరుకోలేదన్నారు. సచివాలయం తరలింపు యోచన, 108, 104 సర్వీసులను నీరుగార్చడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించకపోవడం, ఉచిత విద్యుత్‌ను సరఫరాచేయడంలో వైఫల్యం, ఎస్సీ, ఎస్టీలకు తగిన న్యాయం చేయకపోవడం వంటివి ఇందుకు తార్కాణాలన్నారు. శనివారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ విస్తృత భేటీ అనంతరం పార్టీ ప్రధానకార్యదర్శులు ఎడ్మకిష్టారెడ్డి, కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డిలతో కలసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై అధికారపార్టీకి చెందిన వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీల అమలుకు కృషిచేయాలన్నారు. మిషన్‌కాకతీయను చిత్తశుద్ధితో అమలుచేయాలని వైఎస్సార్‌సీపీ కోరుకుంటున్నదన్నారు. రాష్ట్రంలో 600 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, వారి కుటుంబాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా పరిహారం అందించలేదని విమర్శించారు. అలాగే అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా పరిహారం ఇవ్వలేదన్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు కూడా దివంగత మహానేత వైఎస్సార్ రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందించారని గుర్తుచేశారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతుల సమస్యల పరిష్కారం కోసం తాను త్వరలోనే దీక్షకు దిగనున్నట్లు ఆయన వెల్లడించారు.

 

 రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది వైఎస్ ఒక్కరే..

 

 తెలంగాణలో ప్రజలకు మంచిచేసిన సీఎం ఎవరైనా ఉన్నారా అంటే దివంగత మహానేత వైఎస్సార్ ఒక్కరేనని పొంగులేటి అన్నారు. నిజమైన అభివృద్ధి, పేదలకు సంక్షేమఫలాలు అందించిం ది వైఎస్సార్ మాత్రమేనని చెప్పారు. టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై ఇప్పటికే కోర్టులో కేసు వేశామని, మరో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై స్పీకర్‌కు మూడోసారి ఫిర్యాదుచేసి, కోర్టును ఆశ్రయిస్తామని పొంగులేటి వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో పోటీచేస్తామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సోదరి షర్మిల, తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో షర్మిల పరామర్శయాత్ర ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, వైఎస్సార్‌సీపీ పక్షాన ప్రజలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి, జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ల ఎన్నికలు, గ్రామ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు, సభ్యత్వనమోదు, రైతుల సమస్యలపై చర్చించామని తెలిపారు.

 

 పార్టీ బలోపేతానికి ప్రణాళికలు

 

 తెలంగాణలో పార్టీ బలోపేతంపై వైఎస్సార్‌సీపీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఆయా విభాగాల్లో అన్ని స్థాయి ల్లో నియామకాల పూర్తికి కసరత్తు చేస్తోంది. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ విస్తృత భేటీలో ఆయా అంశాలపై  చర్చించింది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ప్రారంభోపన్యాసంలో పార్టీనేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీసంస్థాగత అంశాలు, సభ్యత్వనమోదు, శిక్షణ  తరగతులపై కె.శివకుమార్ తీర్మానం ప్రవేశపెట్టారు. పార్టీనేతలు కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, ఎడ్మకిష్టారెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, గుణ్ణం నాగిరెడ్డి, సత్యం శ్రీరంగం, ఆకుల మూర్తి, మతీన్, మెండెంజయరాజ్, నర్రా భిక్షపతి, బీష్వ రవీందర్ వివిధ అంశాలపై మాట్లాడారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top