వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపై టీడీపీ కార్యకర్తల దాడి

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపై టీడీపీ కార్యకర్తల దాడి - Sakshi

  •  పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సాక్షిగా పిడిగుద్దులు  

  •  రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయిన గిరిజన ఎమ్మెల్యే

  •  అశ్వారావుపేట/కుక్కునూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై ఏపీకి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోలవరం ముంపు మండలాల ఆదివాసీలకు మెరుగైన ప్యాకే జీతో కూడిన నష్టపరిహారాన్ని ఇవ్వాలని వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన ఆయనపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సాక్షిగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. కిందపడేసి కుర్చీలతో దాడి చేశారు. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వివరాలివీ.. పోలవరం ముంపు ప్రాంతాల కింద ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గురువారం సమావేశాలు నిర్వహించారు. కుక్కునూరులో సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు వెళ్లారు. 

     

    ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అయిన తనను ఎందుకు పిలవలేదని కలెక్టర్ కాటమనేని ప్రశ్నించారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ ‘సారీ సార్ మర్చిపోయాం.. మరోసారి సమావేశాలను తెలియజేస్తామ’ని చెప్పారు. ఎంపీ మాగంటి బాబుతో ఎమ్మెల్యే కరచాలనం చేసి తన డిమాండ్‌లను వినిపిస్తుండగా.. అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ.. పరుష పదజాలంతో మాట్లాడారు. ‘నువ్వెవడివిరా.. తెలంగాణ వాడివి.. ఆంధ్రకు నువ్వెందుకు వచ్చావు..’ అంటూ దాడికి దిగారు. మాగంటి అనుచరుడు కూడా ఎమ్మెల్యేపై దాడి చేశాడు. ప్రాంగణంలోని దాదాపు 20మందికి పైగా టీడీపీ కార్యకర్తలు గిరిజన ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పిడిగుద్దులు గుద్దారు. కులం పేరుతో దూషిస్తూ.. చంపేస్తామంటూ హెచ్చరించారు. దాడిని ఆపాల్సిన పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించారు. 

     

    కలెక్టర్, ఎంపీ మాగంటి బాబు, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు చూస్తూ ఉండిపోయారు. అనంతరం ఎమ్మెల్యే తాటిని కుక్కునూరు పోలీసులు విచక్షణారహితంగా రోడ్డు మీదకు ఈడ్చుకురావడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. తనపై జరిగిన దాడికి నిరసనగా రోడ్డుపైనే దాదాపు మూడు గంటలపాటు బైఠాయించారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తాటికి మద్దతుగా పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దాడికి నిరసనగా శుక్రవారం అశ్వారావుపేట నియోజకవర్గ బంద్ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. కాగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై దాడికి పాల్పడిన, పురికొల్పిన 15 మందిపై కుక్కునూరు ఎస్సై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top