ఆ పిలుపే ఆత్మీయం

ఆ పిలుపే ఆత్మీయం - Sakshi

  • శోభానాగిరెడ్డి మృతితో నగరంలో విషాదం

  •  ప్రముఖుల నివాళి

  •  పలువురి సంతాపం

  •  సాక్షి, సిటీబ్యూరో : వైఎస్సార్ కాంగ్రెస్ నేత, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డికి హైదరాబాద్ నగరంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆడవారినైనా, మగవారినైనా రాయలసీయ ఆత్మీయ యాసలో ‘ఏమ్మా’ అని నవ్వుతూ పలకరించే శోభా నాగిరెడ్డి పిలుపు ఇక వినపడదని తెలిసి అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. మహానేత వైఎస్సార్ ఆశయాలకు ఆకర్షితులైన ఆమె.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించారు.



    పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కుటుంబీకుల వెంట నడిచారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరంలో ఇందిరా పార్క్, ఎమ్మెల్యే క్వార్టర్స్, అసెంబ్లీ,     సెక్రటేరియట్ తదితర చోట్ల నిర్వహించిన పలు ఆందోళనల్లో ఆమె అగ్రభాగాన నిలిచేవారు. ఇటీవల సెక్రటేరియట్ వద్ద జరిగిన ఓ ఆందోళనలో పోలీసులు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించినా గట్టిగా ఎదిరించి అరెస్ట్ అయ్యారు.



    1996లో రాజకీయాల్లోకి వచ్చిన శోభా నాగిరెడ్డి అప్పటి నుంచి నగరానికి ఎక్కువగా వచ్చి వెళ్లేవారు. టీడీపీ, పీఆర్పీలలో ఎమ్మెల్యేగా కొనసాగిన ఆమె వైఎస్సార్ సీపీలోకి వచ్చిన తర్వాత తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్రంలో ఓ స్ఫూర్తి వంతమైన మహిళా నాయకురాలిగా ఎదిగారు. ఏ పార్టీలో ఉన్నా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, అన్నింట్లోనూ ఆమెది అగ్రభాగామే. ఆమె అకాల మరణాన్ని హైదరాబాదీవాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమెతో తమ జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఒకసారి పరిచయం అయితే గుర్తుపట్టి పేరుపెట్టి పిలిచే శోభానాగిరెడ్డి నగర వైఎస్సార్ సీపీ శ్రేణుల్లోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు.



     జర్నలిస్టులను ‘అన్నా’  అని పలకరించేవారు

     

    ‘నగరంలో ఏ కార్యక్రమంలో పాల్గొన్నా జర్నలిస్టులను ‘అన్నా’ అని అప్యాయంగా పలకరించేవారు శోభమ్మ. ఆమె ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని’ టీయూడబ్ల్యూజే అనుబంధ విభాగం హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి, కోటిరెడ్డిలు తెలిపారు. గురువారం ఆమె ఆకాల మృతికి వారు సంతాపం ప్రకటించారు. ‘పత్రికా సమావేశాల్లో జర్నలిస్టులు ఎలాంటి క్లిష్ట ప్రశ్నలు వేసిన సంయమనంగా నవ్వుతూ సమాధానం చెప్పే మహిళ నేత ఆమె. ఇక అన్నా అనే పిలుపు మూగబోయిందన్న విషయం యావత్తు జర్నలిస్టు లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని’ అన్నారు.

     

    ప్రముఖుల సంతాపం

     

    శోభానాగిరెడ్డి అకాల మృతి రాష్ట్రానికి తీరని లోటని జనచైతన్య వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి, పురావస్తు శాఖ మాజీ సంచాలకులు ఆచార్య పెద్దారపు చెన్నారెడ్డి, బీజేపీ నగర నాయకుడు బి.జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేత శ్రీనివాసులు నాయుడు అన్నారు. వారు శోభమ్మ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శోభానాగిరెడ్డి అకాల మృతి విచారకరమని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు బద్దం బాల్‌రెడ్డి మరో ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా నేతగా రాష్ట్ర సమస్యలపై ఆమె అసెంబ్లీలో గళమెత్తిన తీరు ఆదర్శప్రాయమని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top