కోదాడ.. కదిలొచ్చే..

కోదాడ.. కదిలొచ్చే.. - Sakshi


    కోదాడ నియోజకవర్గంలోని ఆరు కుటుంబాలకు పరామర్శ

     కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చిన వైఎస్ తనయ

     తొగర్రాయి, కోదాడ, ఆచార్యులగూడెం,

     గణపవరం, వెంకట్రాంపురంలలో పర్యటన

     నియోజకవర్గంలో ప్రజలనుంచి మంచి స్పందన

     {పతి గ్రామంలోనూ షర్మిల కోసం ప్రజల ఎదురుచూపులు

     కోదాడలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల

     పలు చోట్ల వైఎస్సార్ విగ్రహాలకు నివాళి


 

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ  : పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల ఐదోరోజు ఆదివారం కోదాడ నియోజకవర్గంలోని ఆరు కుటుంబాలను పరామర్శించారు. తొగర్రాయి, కోదాడ, ఆచార్యులగూడెం, గణపవరం, వెంకట్రాంపురంలలో వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఆమె కలుసుకున్నారు. వారి ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబాలకు తమ కుటుంబం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. చిన్నపిల్లలతో ముచ్చటించి వారిని బాగా చదువుకోవాలని సూచించారు. పెద్దవాళ్లను పలకరించిన షర్మిల అందరూ ధైర్యంగా ఉండాలని, అందరికీ దేవుడు మేలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. షర్మిల యాత్ర సందర్భంగా కోదాడ నియోజకవర్గ ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. కోదాడ పట్టణంతో పాటు చిలుకూరు, బేతవోలు, ఆచార్యులగూడెం, బరాఖత్‌గూడెం, గణపవరంలలో ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. తన యాత్ర సందర్భంగా షర్మిల పలుచోట్ల వైఎస్ విగ్రహాలకు నివాళులర్పించారు. కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె పూలమాల వేశారు.

 

 ఐదోరోజు యాత్ర సాగిందిలా...

 పరామర్శయాత్రలో భాగంగా ఆదివారం ఉదయం షర్మిల కోదాలోని సీసీరెడ్డి విద్యానిలయం నుంచి బయలుదేరి నేరుగా మండలంలోని తొగర్రాయి గ్రామానికి వెళ్లారు. అక్కడ మందా ప్రసాద్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. మందా ప్రసాద్ భార్య జయమ్మ తన కుటుంబ పరిస్థితులను షర్మిలకు వివరించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన షర్మిల అక్కడి నుంచి మళ్లీ కోదాడ వచ్చారు. కోదాడ ప్రమీల టవర్స్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత నాగార్జునసెంటర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తెలంగాణ తల్లికి నమస్కరించి నేరుగా సురభి శ్రీనివాస్ కుటుంబం వద్దకు వెళ్లారు. అక్కడ శ్రీనివాస్ తల్లి అచ్చమ్మ, భార్య విజయ కుమారి, కూతురు రమ్యలు వారి పరిస్థితులు షర్మిల దృష్టికి తీసుకువెళ్లారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన షర్మిల అక్కడ అవని అనే చిన్నారికి అక్షరాభ్యాసం చేశారు.

 

 ఆ తర్వాత  వల్లంశెట్ల రాంప్రసాద్ కుటుంబం వద్దకు వెళ్లారు. అక్కడ రాంప్రసాద్ భార్య విజయలక్ష్మి, తల్లి సుగుణమ్మలు షర్మిలతో మాట్లాడారు. అక్కడి నుంచి ఆమె సీసీరెడ్డి స్కూల్‌లో భోజనం చేసుకుని నేరుగా చిలుకూరు మండలం ఆచార్యులగూడెం వెళ్లారు. మార్గమధ్యంలో చిలుకూరు, బేతవోలు గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఆచార్యులగూడెంలో అలవాల ముత్తయ్య కుటుంబం వద్దకు వెళ్లి వారిని ఓదార్చారు. ముత్తయ్య భార్య నాగలక్ష్మి షర్మిలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆవేదనను షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. ముత్తయ్య కుమారుడు భాస్కర్, కుమార్తె శ్రీలతలతో మాట్లాడిన షర్మిల వారిని బాగా చదువుకోవాలని సూచించారు. అక్కడి నుంచి మునగాల మండలం గణపవరం గ్రామానికి వెళ్లారు. అక్కడ సారెడ్డి జితేందర్‌రెడ్డి (శ్రీనివాసరెడ్డి) కుటుంబాన్ని ఆమె కలుసుకున్నారు. భార్య భాగ్యలక్ష్మి, పిల్లలు తేజశ్రీ, సుజాత, తల్లిదండ్రులు సైదమ్మ, కోటిరెడ్డిలతో మాట్లాడారు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పిన షర్మిల అక్కడి నుంచి బయలుదేరి వెంకట్రాపురం వెళ్లి మునుకుంట్ల గురవయ్య కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆ తర్వాత అదే మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో మునుకుంట్ల గురవయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అక్కడ గురవయ్య కొడుకు లింగయ్య, కోడలు భవాని, మనుమరాలు ప్రియాంకలు తమ కుటుంబ పరిస్థితిని వివరించారు. వారికి షర్మిల ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు గురవయ్య మనుమరాలు రాధ, వేణుగోపాల్ దంపతుల కుమార్తెకు షర్మిల ‘హర్ష’ అని నామకరణం చేశారు. అక్కడే అన్నప్రాసన కూడా చేశారు.

 

 అడుగడుగునా బ్రహ్మరథం

 కోదాడ నియోజకవర్గ ప్రజలు షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. ఉదయం కోదాడ పట్టణంతో పాటు మండలంలోని తొగర్రాయిలలో ప్రజలు ఆమెకు స్వాగతం పలికారు. ఆ తర్వాత చిలుకూరు మండలంలో ప్రవేశించిన దగ్గర నుంచి గ్రామగ్రామాన ప్రజలు షర్మిల కోసం క్యూలు కట్టారు. గుంపులుగా నిలబడి ఆమెతో కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు ప్రయత్నించారు. పరామర్శ మార్గమధ్యంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ ప్రజలను షర్మిలను చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. ఇక మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న సమయంలో అయితే ఆయా ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు. మొత్తంమీద కోదాడ నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ కుటుంబంపై తమకున్న ప్రేమను చాటారు. కాగా, షర్మిల మార్గమధ్యలో ఉన్న కోదాడ, బాలాజీనగర్, చిలుకూరు, బేతవోలు, పోలేనిగూడెంలలో ఉన్న వైఎస్ విగ్రహాలకు నివాళులర్పించారు. అదే విధంగా కోదాడ పట్టణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా పూలమాల వేశారు.

 

 కన్నీళ్లు పెట్టుకున్న షర్మిల

 గణపవరంలో సారెడ్డి జితేందర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తున్న సందర్భంగా షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు. జితేందర్‌రెడ్డి తండ్రి కోటిరెడ్డి షర్మిలతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన కళ్లనీళ్లు తుడిచిన షర్మిల తట్టుకోలేక తానూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు కోటిరెడ్డి తన భుజంపై ఉన్న టవల్‌తో షర్మిల కన్నీళ్లు తుడిచారు. జితేందర్‌రెడ్డి కుమార్తెను దగ్గరకు తీసుకున్న షర్మిల ఆమెను అక్కును చేర్చుకుని ఆశీర్వదించారు. ఉదయం తొగర్రాయిలో మంద ప్రసాద్  కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆయన కోడలు... ‘మామయ్యా.. షర్మిలమ్మ వచ్చింది... ఎక్కడకు వెళ్లావయ్యా.’ అంటూ రోదించిన తీరు అందరినీ కన్నీళ్లు పెట్టించింది. సురభిశ్రీనివాస్ తల్లి, భార్య, కుమార్తె, రాంప్రసాద్ భార్య, తల్లి, ముత్తయ్య భార్య, జితేందర్‌రెడ్డి భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లిదండ్రులు షర్మిలను చూసి తట్టుకోలేక ఉద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.

 

 వారిని ఓదార్చిన షర్మిల కళ్ల నిండా నీళ్లు నింపుకుని వారికి ధైర్యం చెప్పారు. షర్మిల వెంట తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ యెర్నేని వెంకటరత్నంబాబు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గున్నం నాగిరెడ్డి, శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, ఆకుల మూర్తి, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్ణారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాబ్ అహ్మద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెండెం జయరాజ్, కార్యదర్శి షర్మిలా సంపత్, సహాయ కార్యదర్శి ఇరుగు సునీల్, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, ఖమ్మం జిల్లా నాయకుడు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మధిర ఎంపీపీ వేమిరెడ్డి కృష్ణారెడ్డి, యువజన విభాగం నాయకుడు నరేందర్‌రెడ్డి, కోదాడ నియోజకవర్గ నేతలు తుమ్మలపల్లి భాస్కర్, పెంట్యాల పాపారావు, కర్ల సుందర్‌బాబు, అహ్మద్ అలీ, కన్నె కొండలరావు, లైటింగ్ ప్రసాద్, ఎస్తేర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పచ్చిపాల వేణు యాదవ్ తదితరులున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top