జన‘పురి’

జన‘పురి’ - Sakshi


సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పరామర్శయాత్రలో భాగంగా ఆరో రోజు సోమవారం షర్మిల సూర్యాపేట నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని అనంతారం, హున్యానాయక్ తండా, నశింపేట, ముక్కుడుదేవులపల్లి, కందగట్ల, ఏనుబాముల గ్రామాల్లో పర్యటించిన ఆమె తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అంతకంటే ముందు ఉదయం గణతంత్ర దినోత్సవం సందర్భంగా షర్మిల సూర్యాపేటలోని ఆన ంద విద్యామందిర్‌లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జెండావందనం చేసి జాతీయ గీతాలాపన చేశారు. ఆ తర్వాత పెన్‌పహాడ్ మండలం అనంతారం వెళ్లే మార్గమధ్యలో సింగారెడ్డిపాలెంలోనూ ఆమె గ్రామస్తుల కోరిక మేరకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. షర్మిల యాత్ర సందర్భంగా ప్రజలు రోడ్లపై నిలబడి ఆమెకు స్వాగతం పలికారు. పరామర్శ చేస్తున్న ఇళ్ల వద్దకు పెద్దఎత్తున ప్రజలు వచ్చి షర్మిలను కలిసి మాట్లాడేందుకు, కరచాలనం చేసేందుకు వేచి చూశారు.

 

 ఆరో రోజు యాత్ర సాగిందిలా...

 ఆరో రోజు ఉదయం షర్మిల వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకుడు రాహుల్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని అక్కడినుంచి ఏవీఎం పాఠశాలకు వెళ్లారు. గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో సింగారెడ్డిపాలెంలో జాతీయపతాకావిష్కరణ చేశారు. ఆ తర్వాత అనంతారం వెళ్లిన ఆమె దామెర్ల లింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. లింగయ్య తల్లిదండ్రులు సైదులు, సావిత్రిలు వారి కుటుంబ స్థితిగతులను వివ రించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి చివ్వెంల మండలం హున్యానాయక్ తండాకు వెళ్లి బాణోతు ముకుంద కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.

 

 అక్కడ ముకుంద భార్య లాలి షర్మిలను చూడగానే  ఉద్వేగాన్ని తట్టుకోలేక భోరున ఏడ్చారు. లాలితో పాటు ముకుంద కుమారులు భిక్షం, గోపీలు, మనుమడు సైదులు తమ కుటుంబం గురించి షర్మిలకు తెలియజేశారు. ఆ తర్వాత ఆత్మకూరు(ఎస్) మండలం నశింపేటకు వెళ్లి నర్రా లచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించారు షర్మిల. అక్కడ ఆయన భార్య లక్ష్మమ్మ, కూతురు కమలమ్మ తమ కుటుంబ స్థితి గురించి షర్మిలకు వివరించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన షర్మిల అక్కడినుంచి నెమ్మికల్ సమీపంలో భోజన విరామం తీసుకున్నారు. ఆ తర్వాత అదే మండలంలోని ముక్కుడుదేవుడుపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ కుంచం ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఎల్లమ్మ కోడలు ఎల్లమ్మ, మనుమలు మైసయ్య, శ్రీనివాస్‌లు షర్మిలతో మాట్లాడారు. ఆ తర్వాత కందగట్ల గ్రామానికి షర్మిల బయల్దేరారు.

 

 మార్గమధ్యలో బండమీద ఉన్న పురాతన మల్లన్న దేవుడి గుడి పునర్మిర్నాణం చేయగా, దానిని గ్రామస్తులు, శివమాలధారులైన భక్తుల కోరిక మేరకు ఆలయాన్ని షర్మిల ప్రారంభించారు. ఆ తర్వాత కందగట్లకు వెళ్లి కుశనపల్లి రాములు కుటుంబంతో మాట్లాడారు. అక్కడ రాములు భార్య రాములమ్మ, కుమారుడు రాజులతో షర్మిల మాట్లాడారు. ఈ సందర్భంగా రాజుతో షర్మిల కాసేపు సరదాగా నవ్వించారు. అంతకుముందు అదే గ్రామంలో 23 రోజుల చిన్నారికి విజయ అని ఆమె నామకరణం చేశారు. కందగట్ల నుంచి ఏనుబాముల వెళ్లిన షర్మిల అక్కడ వర్రె వెంకులు కుటుంబాన్ని సందర్శించారు. వెంకులు భార్య కౌసల్య, కుమారుడు కృష్ణయ్య, మురళి, పెద్దకోడలు కవితలు వారి కుటుంబ స్థితిగతులను షర్మిలకు వివరించారు. వారికి భరోసానిచ్చి ధైర్యం చెప్పిన షర్మిల ఆరోరోజు పరామర్శయాత్రను ముగించారు.

 

 నువ్వు ఆయన కొడుకువైతే... నేను ఈయన కూతుర్ని..

 కందగట్లలో కుశనపల్లి రాములు కుటుంబాన్ని సందర్శించిన సందర్భంగా షర్మిల రాములు కుమారుడు రాజుతో కాసేపు ముచ్చటించారు. ‘నేనె వరో తెలుసా’ అని రాజును షర్మిల అడగగా, రాజు ‘షర్మిల’ అని పేరు చెప్పాడు. అప్పుడు షర్మిల అక్కడే ఉన్న వైఎస్సార్, రాములు చిత్రపటాలను చూపిస్తూ నువ్వు ఆయన కొడుకువైతే, నేను ఈయన కూతుర్ని అని రాజుకు చెప్పారు. ‘నీకేమి ఇష్టం’ అని రాజును అడగ్గా.. తనకు చాక్లెట్లు అంటే ఇష్టమని అతను బదులిచ్చాడు. నాకు కూడా చాక్లెట్లంటే చాలా ఇష్టమని చెప్పిన షర్మిల పక్కనే ఉన్న దుకాణం నుంచి చాక్లెట్లు తెప్పించి రాజుకు ఇచ్చారు. బాగా చదువుకోవాలని, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని, నువ్వు నవ్వితే అమ్మ కూడా నవ్వుతుందని రాజుకు షర్మిల చెప్పారు.

 

 అంతకుముందు కందగట్లలో డప్పు చప్పుళ్లతో షర్మిలను స్వాగతించిన గ్రామస్తులు దారిపొడవునా రంగు రంగుల రంగవల్లులు వేసి మంగళహారతులిచ్చి, నుదుట తిలకం దిద్ది స్వాగతం పలికారు. ఆ తర్వాత ఏనుబాములలోనూ ప్రజలు పెద్ద ఎత్తున షర్మిలకు స్వాగతం పలికారు. షర్మిల అనంతారం వెళ్లినప్పుడు లింగయ్య రాజశేఖర్‌రెడ్డిపై పాటలు కట్టి పాడేవాడని కుటుంబ సభ్యులు షర్మిలకు చెప్పారు. ముక్కుడుదేవులపల్లిలో కుంచం ఎల్లమ్మ మనుమడు మైసయ్య మాట్లాడుతూ వర్షాలు పడడం లేదని, పంటలు పండే పరిస్థితి లేక వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని షర్మిలకు వివరించారు. షర్మిల కూడా కుటుంబాలను కలిసినప్పుడు రేషన్ వస్తుందా... పింఛన్ వస్తుందా? ఆరోగ్యం బాగుందా? అని పెద్దలను ప్రశ్నిస్తూ బాగా చదువుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని పిల్లలకు సూచనలిచ్చారు.

 

 నేటితో 30 కుటుంబాలు పూర్తి..

 షర్మిల పరామర్శయాత్ర మొదటి విడత మంగళవారంతో పూర్తి కానుంది. వాల్యాతండ, దుబ్బతండా, కుడకుడ గ్రామాల్లో మూడు కుటుంబాలను ఆమె నేడు పరామర్శించనున్నారు. దీంతో  ఈ విడతలో ఆమె జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో 30 కుటుంబాలను పరామర్శ పూర్తి కానుంది. షర్మిల వెంట పరామర్శ యాత్రలో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, ఆకుల మూర్తి, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్ణారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాబ్ అహ్మద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెండెం జయరాజ్, పార్టీ కార్యదర్శులుజి. రాంభూపాల్‌రెడ్డి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, అమృతాసాగర్, కొమురం వెంకటరెడ్డి, సహాయకార్యదర్శులు ఇరుగు సునీల్, షర్మిలా సంపత్, బంగి లక్ష్మణ్, యువజన విభాగం ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేశ్‌రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గ నేతలు దొంతిరెడ్డి సైదిరెడ్డి, పిట్ట రాంరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మల్లు రవీందర్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వేణుయాదవ్ ఉన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top