నిజాం షుగర్స్‌ను అమ్మడాన్ని వైఎస్ వ్యతిరేకించారు

నిజాం షుగర్స్‌ను అమ్మడాన్ని వైఎస్ వ్యతిరేకించారు - Sakshi


* అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్



సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్దైదె న నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడాన్ని అప్పట్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక దానిపై కమిటీ వేస్తే... ఫ్యాక్టరీని అడ్డగోలుగా ప్రైవేటుకు కట్టబెట్టారంటూ నివేదిక ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. సోమవారం అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. రానురానూ ప్రభుత్వ రంగం కుంచించుకుపోతుందని, ప్రైవేటురంగమే ముందుకు వస్తోందని బీజేపీ నేత లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.



ఈ సందర్భంగా మంత్రి ఈటెల జోక్యం చేసుకుంటూ.. పై వ్యాఖ్యలు చేశారు. అప్పటి ఎన్డీఏ సర్కారులో టీడీపీ భాగస్వామ్యంగా ఉందని, ఆ సమయంలో నిజాం కాలం నాటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మారని మంత్రి మండిపడ్డారు. హెచ్‌ఎంటీ, ఆంధ్రా స్పిన్నింగ్, హెచ్‌ఏఎల్‌లను ఎవరు మూసేశారని ప్రశ్నించారు. అనంతరం ఉద్యోగుల విభజనపై మాట్లాడుతూ.. తెలంగాణలో పని జరగకుండా చూడాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల విభజనలో జాప్యాన్ని గమనిస్తే కుట్ర జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.



బీసీ గురుకులాలకు సన్న బియ్యం

తెలంగాణలోని బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు, వసతి గృహాలకు బీపీటీ రకం సన్నబియాన్ని సరఫరా చేయాలని నిర్ణయించామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ‘మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల’ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలను సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆయన ప్రారంభించారు. బీసీ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలలో ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు, చాలీచాలని కూరలతో విద్యార్థులు అర్ధాకలితో అలమటించేవారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top