విజయభేరి

విజయభేరి - Sakshi

  • నగరంలో వైఎస్సార్‌సీపీ జనభేరికి విశేష స్పందన

  •  ఐదు నియోజకవర్గాల్లో షర్మిల భారీ సభలు

  •  బాబు, బీజేపీ కలయికపై విమర్శల వాగ్బాణాలు   

  •  పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి

  •  సాక్షి, సిటీబ్యూరో : ఒకే రోజు.. ఐదు భారీ బహిరంగసభలు.. అడుగడుగునా జన నీరాజనం.. దారి పొడవునా వైఎస్సార్ అమర్ రహే నినాదాల హోరు.. వెరసి ‘గ్రేటర్’లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనభేరి విజయవంతమైంది. కార్యకర్తలో నయా జోష్‌ను నింపింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు మొదలుకుని బీఎస్ మక్తా, సనత్‌నగర్, బాలానాగర్, మూసాపేట, కేపీహెచ్‌బీ, మియాపూర్ మీదుగా చందానగర్ వరకు దారి పొడవునా భారీ ర్యాలీలు, బహిరంగసభల్లో పార్టీ ముఖ్య నేత వైఎస్ షర్మిల వాగ్దాటికి జనం ముగ్దులయ్యారు.



    టీడీపీ, బీజేపీల అపవిత్ర కలయికపై ఆమె గుప్పించిన విమర్శలకు విశేష స్పందన లభించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని షర్మిల చేసిన విజ్ఞప్తికి ప్రజలు హర్షధ్వానాలు చేయడం విశేషం.

     

    జనసంద్రమైన ప్రధాన కూడళ్లు

     

    నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనభేరి నిర్వహించిన ప్రధాన కూడళ్లన్నీ ఆదివారం జనసంద్రాలయ్యాయి. జూబ్లీహిల్స్ నియోకజవర్గంలోని యూసుఫ్‌గూడ చె క్‌పోస్ట్ వద్ద అసెంబ్లీ అభ్యర్థి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి సాజిద్ అలీలతో కలిసి షర్మిల తొలి సభలో పాల్గొన్నారు. ఈ సభకు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చి వైఎస్సార్ అమర్ రహే అన్న నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.



    అనంతరం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బీఎస్ మక్తాలో శాసనసభ అభ్యర్థి పి.విజయారెడ్డితో కలిసి బహిరంగసభలో మాట్లాడారు. వైఎస్ చలవతో ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ నమ్మిన వారందరినీ వెన్నుపోటు పొడిచే నైజం కలవాడని, వచ్చే ఎన్నికల్లో అతన్ని ఇంటికి పంపాలని షర్మిల పేర్కొన్న సందర్భంలో సభికుల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. సనత్‌నగర్‌లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన బహిరంగసభలో షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. విశ్వసనీయతతో కూడిన పరిపాలన రావాలంటే వైఎస్సార్ అభ్యర్థి వెల్లాల రాంమోహన్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

     

    కూకూట్‌పల్లి, చందానగర్‌లో భారీ స్పందన

     

    ఎన్నికల ప్రచారం కోసం వైఎస్ షర్మిల కూకట్‌పల్లికి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు కూకట్‌పల్లి రహదారుల వెంట బారులు తీరారు. వై జంక్షన్ నుంచి కేపీహెచ్‌బీ, మియాపూర్ వరకు అభిమానులు షర్మిల ప్రచార వాహనం వెంట పరుగులు పెడుతూ, ‘జయహో జగన్’ అంటూ నినాదాలు చేశారు. కేపీహెచ్‌బీలో నిర్వహించిన సభలో మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి వి.దినేశ్‌రెడ్డి, శాసనసభ అభ్యర్థి జంపన ప్రతాప్‌లను పరిచయం చేస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు వడ్దేపల్లి నర్సింగ్‌రావు తిరిగి కోలుకుని క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.



    రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చందానగర్‌లో జరిగిన సభలో షర్మిల శాసనసభ, లోక్‌సభ అభ్యర్థులు ముక్కా రూపానందరెడ్డి, కొండా రాఘవరెడ్డిలను జనానికి పరిచయం చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఐదు చోట్ల నిర్వహించిన ఈ భారీ బహిరంగసభల్లో పార్టీ ముఖ్య నాయకులు కె.శివకుమార్, వాడుక రాజగోపాల్, డాక్టర్ ప్రపుల్లారెడ్డి, ఎం.సాయిసుధాకర్, బి.మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

     

     జనాభిమానం ముందు చిత్తయిన కుట్రలు




     బంజారాహిల్స్ : ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ నాయకురాలు షర్మిల చేపట్టిన రోడ్ షోను విఫలం చేసేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు జనం అభిమానం ముందు పటాపంచలయ్యాయి. బీఎస్‌మక్తాలో షర్మిల రోడ్ షో, బహిరంగ సభకు స్థానికులెవరూ రాకుండా కట్టడి చేసేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు శనివారం రాత్రి డబ్బులు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి రూ.2000 చొప్పున పంపిణీ చేసి, షర్మిల సభకు వెళ్లొద్దని కోరారు. అయితే కాంగ్రెస్ నేతల ప్రలోభాలను పక్కన పెట్టి వేలాదిగా జనం బయటికి రావడంతో కాంగ్రెస్ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లు అయింది.

     

     నమాజ్ జరుగుతోంది..ఆగండి




     బంజారాహిల్స్ న్యూస్‌లైన్: ఖైరతాబాద్ నియోజకరవ్గం పరిధిలోని సోమాజిగూడ డివిజన్ బీఎస్ మక్తాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత వై.ఎస్.షర్మిల మాట్లాడే సమయంలో అక్కడే ఉన్న మసీదులో నమాజ్ ప్రారంభమైంది. దీంతో షర్మిల వెంటనే స్పందించారు. ‘నమాజ్ జరుగుతోంది .. అందరూ మౌనంగా ఉండండని’ కోరుతూ ప్రసంగాన్ని నిలిపివేశారు. నమాజ్ ముగిసిన అనంతరం షర్మిల తన ప్రసంగాన్ని కొనసాగించి ముందుకు సాగారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top