కిక్కుతో.. చిత్తు


  • పల్లెల్లో పారుతున్న సారా

  •    40 శాతం యువశక్తి అటువైపే

  •    30 ఏళ్లకే రోగాల బారిన

  •   అప్పుల పాలైన వారు బలవన్మరణం వైపు

  •   వీరిలో ఎక్కువ మంది రైతులే..

  •   ‘సాక్షి’ సర్వేలో వెలుగు చూసిన  భయంకరమైన నిజాలు


 


 నీటి చుక్క దొరకని గ్రామాలుండవచ్చు గానీ మద్యం దొరకని పల్లె లేదు... కష్టజీవులు నిత్యం మద్యం తాగనిదే ఉండలేరు... ఇలా చాలామంది మద్యానికి బానిసలవుతున్నారు... వీరిలో ఎక్కువగా యువకులే...  విస్కీ, బీరు, సారా, కల్లు ఇవన్నీ యువత కష్టార్జితాన్నే కాదు.. శ్రమశక్తినీ హరిస్తున్నాయి... చీప్ లిక్కర్, నాటు సారా ప్రభావంతో ఆరోగ్యవంతులు అనారోగ్యం బారిన పడుతున్నారు. వారానికి ఒకటి రెండు రోజులు పనికి వెళ్లినా... రెండు, మూడు గంటల కంటే ఎక్కువ పని చేయలేకపోతున్నారు. వీరిలో చిన్నసన్నకారు రైతులే అధికం. మద్యానికి వ్యసన పరులు కావడం.. సొంత పొలంలో పనులు కూడా చేసుకోలేని దుస్థితి. ఇవన్నీ ‘సాక్షి’ నిర్వహించిన సర్వేలో వెలుగు చూసిన నిజాలు..

 సంగారెడ్డి, సాక్షి ప్రతినిధి: 

 ‘సాక్షి’ ఇటీవల పలు పల్లెల్లో మద్యంపై శాంపిల్ సర్వే నిర్వహించగా భయంకరమైన నిజాలెన్నో వెలుగు చూశాయి. జిల్లాలోని దాదాపు 52 పల్లెల్లో సర్వే నిర్వహించింది. బెల్టు షాపు, సారా లేని పల్లెలు కన్పించలేదంటే ఒట్టు. ఆదాయాన్ని రాబట్టే క్రమంలో ఎక్సైజ్ అధికారులు మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే పల్లె పల్లెన బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటయ్యాయి. ప్రతి పల్లెలో సగటున మూడు నుంచి 6 వరకు బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. 500 గడప ఉన్న పల్లెలో రోజు వారి విక్రయాలు రూ.20 నుంచి రూ.30 వేలు ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి సగటున కోటి రూపాయల విలువ చేసే మద్యాన్ని రైతులు, యువకులు తాగేస్తున్నారు. అప్పుల పాలైన రైతును ఆత్మహత్యకు ఉసిగొల్పుతున్నది మద్యమేనని తేలింది. బెల్టు షాపులకు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే యువశక్తి రసం పీల్చిన కాయలా మిగిలిపోనుంది.

 దుద్దెడలో రాజయ్య...

 కొండపాక మండలం దుద్దెడ జనాభా 7,650. ఇందులో సుమారు 2,880 మంది వ్యవసాయం, ఇతర ఉపాధి పనులు చేస్తున్నారు. దుద్దెడలో ఒక  మద్యం షాపు ఉండగా ఐదు బెల్ట్‌షాపులు, 15 సారా కేంద్రాలు, ఒ కల్లు దుకాణం ఉంది. సుమారు రెండు వేల మంది మద్యం తాగుతున్నట్టు వెల్లడైంది. గ్రామానికి చెందిన జక్కుల రాజయ్య (39) మద్యానికి బానిసై పనులు చేయడం మానేశాడు. తనకున్న ఎకరం పొలాన్ని అమ్మేశాడు. కుటుంబ పోషణ భారం భార్య రాధవ్వపై పడింది. ముగ్గురు పిల్లలను సాకుతోంది. మద్యం

 మత్తులో రాజయ్య జగదేవ్‌పూర్ మండలం గణేశ్‌పల్లి శివారులో మరణించాడు. ఇప్పుడు రాధవ్వ అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవలే ఆమెకు గర్భకోశ ఆపరేషన్ జరిగింది. పిల్లలు ఇంకా చేతికి అందలేదు. విధిలేని పరిస్థితుల్లో వారి కుమారుల్లో ఒకరు చదువు మానేసి కుటుంబ భారం నెత్తికెత్తుకున్నారు. ‘మా నాయిన... తాగి చనిపోయిండు. మా అమ్మ ఎంతచెప్పినా వినకపోయేటోడు. ఉన్న భూమి అమ్మిండు. మందు పాడుగాను మాకు కష్టాలొచ్చినయ్’... అంటూ కుమారులు ఆందోళన వ్యక్తం చేశారు. 

 పల్వంచలో..

 టేక్మాల్ మండల పల్వంచ జనాభా 2,250. ఇందులో సుమారు 1,500 మంది మద్యం తాగుతుంటారు. గ్రామంలో కల్లు దుకాణం, రెండు బెల్టు దుకాణాలున్నాయి. 

 రైతులు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారే ఈ దుకాణాలకు ఆదాయ వనరు. ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు తెరుచుకొనే ఉంటాయి. ‘తాగుడుకు బానిసై మా బావ పిల్లలను సరిగ్గా పట్టించుకోడు, ఉన్న డబ్బుల్ని ఖర్చుచేస్తున్నాడు. ఏమి చేయాలో తెలియక  మేమంతా బాధపడున్నాం’ అని మల్లేశం అనే వ్యక్తి తెలిపారు. మా అన్నయ్య కష్టమంతా తాగడానికి పెడుతుండని గ్రామానికి చెందిన కిష్టమ్మ ఆవేదనగా తెలిపింది. ఉదయం నుంచి తాగుడు అలవాటు ఉన్నవారు వంద మంది వరకు ఉంటారు. 

 24 గంటలూ సారా అందుబాటులో..

 మనూరు మండలం దుదగొండ జనాభా 1,500. ఇక్కడ దాదాపు 600 మంది రైతులున్నారు. సారా 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. సమీపంలోని రాణాపూర్ తండాకు చెందిన గిరిజనులు సారా తెచ్చి విక్రయిస్తారు. 5 బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సుమారు 30 మంది ఇక్కడ రోజంతా మందు తాగుతుంటారు. 80 మంది వరకు ఏ పనీ లేకుండా గడుపుతున్నారు. వీళ్లంతా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వయసున్న వారే కావడం గమనార్హం. మద్యం తాగుతున్న వారి కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు, గేదెలు మేపుతున్నారు.

 రుద్రారంలో..

 నారాయణఖేడ్ మండలం రుద్రారం జనాభా 2,200. ఇక్కడ సుమారు 800 మంది రైతులున్నారు. చేతి వృత్తుల వారు 500 మంది ఉంటారు. 8 బెల్టుషాపులు, ఓ కల్లు దుకాణం ఉంది. ఇక్కడ 80 మంది నిత్యం మద్యం సేవిస్తుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం మత్తులో మునిగిపోయేవారు ఐదుగురున్నారు. అప్పుల బాధ, కుటుంబ కలహాలు, సరైన పని లేక వీరంతా మద్యానికి అలవాటు పడ్డారు. ఇక్కడి బెల్టు షాపుల్లో రోజుకు దాదాపుగా 200 క్వార్టర్ బాటిళ్ళు విక్రయిస్తుంటారు. మద్యం తాగొద్దని మహిళలు ఎంత మొత్తుకున్నా తాగడం మానడం లేదు. ఆయా కుటుంబాల్లో  రోజూ గొడవలు జరుగుతుంటాయి. 

 ఇందిరానగర్‌లో

 తాగాలే... ఊగాలే..

 కల్హేర్ మండలం ఇందిరానగర్ జనాభా 512. ఇక్కడ సుమారు 60 మంది  రైతులుంటారు. ఇతర కుల వృత్తుల వారు 30 మంది వరకున్నారు. కల్లు దుకాణం, బెల్టు షాపు ఉంది. 40 మంది వరకు నిత్యం మద్యం తాగుతుంటారు.  20 మంది వరకు వ్యసన పరులున్నారు. పొద్దునుంచీ తాగుతూనే ఉంటారు. 

 వారు ఏ పనీ చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్పులు చేసి అవస్థలు పడుతున్నారు.

 ఉత్తులూరులో నిత్యం గొడవలే..

 పెద్దశంకరంపేట మండలం ఉత్తులూరు జనాభా 2,423. ఇక్కడ సుమారు 1,500 మంది రైతులున్నారు. కల్లు దుకాణం ఉంది. గ్రామంలో వెయ్యి మందికి పైగా కల్లు తాగుతారు. ఒక బెల్టుషాపు ఉండగా 350 మంది బీరు, విస్కీ తాగుతున్నారు. రోజూ 75 నుంచి 100 క్వార్టర్ బాటిళ్లు విక్రయిస్తున్నారు. 50 మంది పనీపాటా లేకుండా మద్యం తాగుతూనే ఉండడంతో వారికి ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. సదరు కుటుంబాల్లో నిత్యం గొడవలే..

 తట్టి కుదవబెట్టి తాగుతం...

 మండలంలోని శంషొద్దీన్‌పూర్‌లో మూడు బెల్డుషాపులు, కల్లుదుకాణం, సారా విక్రయాలు కొనసాగుతున్నాయి.  గ్రామ జనాభా 1,076. జనాభాలో 4 శాతం మంది తాగుడుకు బానిసయ్యారు. 336 రైతు కుటుంబాలుండగా, ఐదు కుటుంబాల వారు కమ్మరి, కుమ్మరి, చాకలి వృత్తులపై ఆధారపడ్డారు. బానిసలుగా మారిన పలువురు మద్యం ప్రియులు డబ్బులు లేని వేళల్లో గ్రామంలోని కల్లు, బెల్టుషాపుల నిర్వాహకుల వద్ద అరువుపై మద్యం తాగుతున్నారు. తట్టి, చెంబు, బిందెలు కుదవ పెడుతున్నారు. 

 మంతూర్‌లో..

 పుల్‌కల్ మండలం మంతూర్ గ్రామ జనాభా 698. ఎక్కువ మంది దళితులు, బీసీ వర్గాలే. ఇందులో సన్నకారు రైతులు, జులాయిగా తిరిగే వారు మద్యానికి బానిసలవుతున్నారు. వ్యవసాయంపై ఆధార పడ్డ కుటుంబాలు సుమారు 20 నుంచి 30 మధ్య ఉంటాయి. సింగూర్ ప్రాజెక్టు ముంపు గ్రామం కావడంతో చాలామంది వలసలు వెళ్లారు. పొద్దట్నుంచీ తాగుడు అలవాటున్న వారు సుమారు 10 మంది వరకుంటారు. తాగుడు అలవాటున్న వారంతా పనిచేయకుండా జులాయిగా తిరుగుతున్నారు. డబ్బులు లేకపోతే అప్పు చేస్తారు. అప్పు దొరకక పోతే రెండు లేక మూడు రోజులు కూలికి వెళ్తుంటారు. కుటుంబ సభ్యులు పనులు చేయగా వచ్చిన డబ్బులను కూడా వీరు మందుకు ఖర్చు చేస్తున్నారు.

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top