రెప్పపాటులో ఘోరం

కొడుకు మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి.. రాజేంద్రప్రసాద్‌ (ఫైల్‌) (ఇన్‌సెట్‌లో) - Sakshi

♦ మంచిర్యాల బస్టాండ్‌లో వెనక నుంచి ఢీకొన్న బస్సు 

♦ సీసీసీకి చెందిన యువకుడు మృతి 

♦ ఉద్యోగం వచ్చిన నెల రోజులకే విషాదం

 

మంచిర్యాల: మంచిర్యాల బస్టాండ్‌లో మంగళవారం సాయంత్రం రెప్పపాటులో ఘోరం జరిగింది. ఫ్లాట్‌ఫాంపై నిలిపిన బస్సును డ్రైవర్‌ వెనక్కు తీస్తుండగా బస్సు వెనుకాల ఉన్న యువకుడిని ఢీకొంది. తలకు తీవ్రగాయమైన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సీసీసీ ఫిష్‌ మార్కెట్‌ ప్రాంతానికి చెందిన బైరపు మల్లయ్య– ఆనందమ్మ దంపతులకు కుమారుడు రాజేంద్రప్రసాద్‌(24), ఇద్దరు కూతు ళ్లు ఉన్నారు. మల్లయ్య డ్రైవర్‌గా పనిచేస్తూ పిల్లలను చదివిస్తున్నాడు.

 

ఇటీవలే బీటెక్‌ పూర్తిచేసిన రాజేంద్రప్రసాద్‌కు నెల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ పైపుల కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. సెలవుపై మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చిన రాజేంద్రప్రసాద్‌ తల్లిదండ్రులు, సోదరిలతో సంతోషంగా గడిపాడు. కుమారుడికి ఉద్యోగం రావడంతో ఇక తమ కష్టాలు గట్టెక్కినట్టేనని తల్లిదండ్రులు భావించారు. సోమవారమే హైదరాబాద్‌ వెళ్తానన్న కొడుకును మరొక్క రోజు ఉండి వెళ్లాలని కోరారు. దీంతో మంగళవారం సాయంత్రం రాజేంద్రప్రసాద్‌ హైదరాబాద్‌ వెళ్లేందుకు బయల్దేరగా కుటుంబ సభ్యులు సంతోషంగా పంపారు. మంచిర్యాల బస్టాండ్‌ చేరుకున్న రాజేంద్రప్రసాద్‌ బస్సుకోసం వెళ్తుండగా.. ఫ్లాట్‌ఫాంపై నిలిచి ఉన్న ఆసిఫాబాద్‌ డిపోకు చెందిన బస్సును డ్రైవర్‌ వెనక్కు తీశాడు. ఈ క్రమంలో వెనక భాగం తలకు బలంగా ఢీకొనడంతో తీవ్ర రక్తస్రావమైంది.

 

అంబులెన్స్‌లో హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ‘ఇక మీ కష్టాలు తీరుతయని చెప్పినవు కద కొడుకా... అంతలోనే అందరినీ విడిచిపొట్టి పోయినవ బిడ్డా.. అంటూ తల్లి ఆనందమ్మ కొడుకు మృత దేహం పై పడి రోధించడం అందరినీ కలిచి వేసింది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే నిండు ప్రాణాన్ని బలితీసుకుందని ప్రయాణికులు పేర్కొన్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్సై బి.స్వామి తెలిపారు.   
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top