గోవర్ధనగిరిధారిగా..

గోవర్ధనగిరిధారిగా.. - Sakshi

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజున స్వామివారు ఉదయం గోవరర్ధన గిరిధారిగా అలంకారం చేసుకుని రాత్రి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో నిత్య పూజలతో పాటు హవనం నిర్వహించి, వేద పారాయణాలు పఠించారు. భక్తులకు ప్రసాదాన్ని అందచేశారు. –యాదగిరికొండ 

 

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు సుప్రభాత సేవతో మేల్కోలిపి ఆరాధన చేశారు. బాలభోగంతో నిత్య కైంకర్యాలు నిర్వహించి పట్టు పీతాంబరాలను ధరింపచేశారు. స్వామిని చేతిలో చిటికెన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినట్లు, చేతిలో మురళీ పట్టుకుని అమ్మవారిని తన పక్కన నిలబెట్టుకునే తీరుగా అందంగా అలంకారం చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలతో ప్రత్యేక వాహనంలో  ఊరేగించారు. కార్యక్రమంలోదేవస్థానం చైర్మెన్‌ బి నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆలయ  ప్రధానార్చకులు నల్లందీగళ్‌ లక్ష్మీ నరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, సురేంద్రాచార్యులు, మధు సూదనాచార్యులు,భాస్కరశర్మ, మేడి శివకుమార్, యాదగిరి,వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

 

అలంకారం ప్రత్యేకత :  గోకులం వాసులు  నిరంతరం  శ్రీకృష్ణుని తలచుకుంటుండగా ఇంద్రుడు మదగర్వంతో భారీ వర్షాలు కురిపిస్తాడు. ఆ సమయంలో శ్రీ కృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తి గోవులను , గోకులం వాసులను కాపాడుతాడు.  అప్పుడు ఇంద్రుడు తన తప్పులను తెలుసుకుని జగన్నాటకుడైన శ్రీ కృష్ణుడిని శరణు వేడుకుంటాడు. 

సింహ వాహనంపై ఊరేగిన నారసింహుడు 

ఆలయ అర్చకులు ఆరో రోజు శనివారం రాత్రి స్వామి అమ్మర్లను సింహవాహనంపై అధిష్టింపజేసి బాలాలయం తిరువీధుల్లో ఊరేగించారు.  

సింహ వాహనం  ప్రత్యేకత :  యాదాద్రిశుడి బ్రహ్మోత్సవాల్లో అలంకార సేవలన్నీఅనంద దాయకుములే భక్త జన కోటిని ఉద్ధరించడానికి నర మృగ హరుడు, సింహవాహన రూఢుడై వెంచేయడం మరింత విశేషాన్ని సంతరించుకుంది. పంచ నారసింహ క్షేత్రంలో సాక్షాత్‌ నరసింహుడే అభయ ప్రదాతయై సింహ వాహనంపై భక్తులను అనుగ్రహిస్తున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. 

ఆలయంలో  హవనం : బ్రహ్మోత్సవాల్లో ఓ వైపు అలంకార, వాహన సేవలు జరగుతుండగా మరోవైపు వేద పారాయణాలు, మూల మంత్ర , మూర్తి మంత్ర జపాలు చేస్తూ సకల దేవతల బీజాక్షరాలతో, హవనం నిర్వహించారు. ఇందులో లక్ష్మీ, గరుడ, ఆంజనేయం, సుదర్శనం,  నారసింహం, తదితర దేవతల మూలమంత్రాలతో హవనం చేశారు.

వేద పారాయణాలు :  సుమారు 50 మంది రుత్విక్కులు వివిధ వేద పారాయణాలను నిర్వహించారు. రామాయణం, మహాభారతం, భాగవతం,  సుదర్శన కవచం, నారసింహం కవచం పారాయణాలను నిర్వహించారు. 

నేటి అలంకార  సేవలు :  ఉదయం  జగన్మోహినీ అలంకారం సేవ , రాత్రి అశ్వవాహన సేవ బాలాలయంలో స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top