టీఆర్‌ఎస్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్?

టీఆర్‌ఎస్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్? - Sakshi


పార్టీపై దృష్టిపెట్టలేకపోతున్నాననే భావనలో కేసీఆర్

 

 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వ్యవహారాల్లో నిరంతరం బిజీగా ఉన్న ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. తమ పార్టీ నిర్మాణాన్ని, కార్యకలాపాలను విస్తృతం చేయాలని భావిస్తున్నారా? పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాటు అవసరమని భావిస్తున్నారా? ఇందుకోసం టీఆర్‌ఎస్‌కు వర్కింగ్ ప్రెసిండెంట్ (కార్యనిర్వాహక అధ్యక్షుడు)ని నియమించాలని యోచిస్తున్నారా? అదీ కేసీఆర్ కుటుంబసభ్యుల్లోనే ఒకరిని ఈ పదవికి ఎంపిక చేయనున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ టీఆర్‌ఎస్ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో తాను తీరిక లేకుండా ఉంటే పార్టీ నిర్మాణం, నిరంతర మార్గదర్శకత్వం, పరిశీలన, సమీక్ష వంటివాటికి అవకాశం ఉండదనే భావనతో... పార్టీకోసం ప్రత్యేకమైన వ్యవస్థ అవసరమనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనికోసం వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించాలని యోచిస్తున్నట్లు సమాచారం.




 టీఆర్‌ఎస్ నిర్మాణాన్ని, కార్యకలాపాలను విస్తృతం చేయడానికి.. ప్రభుత్వానికి సమాంతరంగా ఒక వ్యవస్థ నిరంతరం పనిచేయాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు యోచిస్తున్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పాటుకావడం, అనుభవజ్ఞులైన అధికారుల కొరత, అరకొర ప్రభుత్వ యంత్రాంగం, కొత్త పథకాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో జాప్యం వంటివాటితో తీరిక లేకపోవడంతో పార్టీపై దృష్టిపెట్టలేకపోతున్నట్టుగా ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వంపై, పార్టీపై ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేర్చాలంటే మరింత శ్రమించాల్సి ఉందనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో ప్రత్యేకత ఉన్న అధికార యంత్రాంగాన్ని, తన అంచనాలకు అనుగుణంగా పనిచేస్తారనే విశ్వాసమున్న వారినే మంత్రివర్గంలోనూ, సలహాదారులుగానూ, ఇతర కార్పొరేషన్లలోనూ నియమించుకుంటున్నారు. సెప్టెంబర్ మూడోవారం తర్వాత రాష్ట్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అక్టోబర్ నెలాఖరు వరకు అన్ని ప్రభుత్వ అంతర్గత ప్రక్షాళనా వ్యవహారాలను, మంత్రివర్గం లోని శాఖల మార్పును పూర్తిచేసి, అనంతరం పార్టీ ప్రక్షాళనపై దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీకి నూతన రూపురేఖలపై తన మదిలో పలు నిర్మాణాత్మక, దూరదృష్టితో కూడిన ఆలోచనలను అమలుచేయనున్నారు.

 

 కుటుంబసభ్యుల్లోనే ఒకరికి..!

 

 కేసీఆర్ తమ కుటుంబ సభ్యుల్లోనే ఒకరిని కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేతగా ఉన్న కేసీఆరే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి కుటుంబం నుంచి టి.హరీశ్‌రావు, కె.తారక రామారావు మంత్రులుగా, కవిత ఎంపీగా ఉన్నారు. అక్టోబర్ తర్వాత వీరిలోనే ఒకరిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చేయాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. ఇందులో మంత్రులుగా ఉన్న హరీశ్‌రావు, కేటీఆర్‌లలో ఒకరైతే ఈ బాధ్యతలను సమర్థవంతంగా, విశ్వాసంతో నిర్వహిస్తారనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. వీరిలో ఎవరిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారనే దానిపై కేసీఆర్ సన్నిహితుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఒకరికి ప్రభుత్వపరమైన బాధ్యతలను, మరొకరికి పార్టీ పగ్గాలను అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం.

 

 బూత్ స్థాయి నుంచీ కార్యవర్గాలు

 

 పార్టీ నిర్మాణం, నిరంతర శిక్షణ, పార్టీ విస్తరణకు మార్గాలు వంటివాటిపై కేసీఆర్‌కు స్పష్టమైన అభిప్రాయాలున్నట్లు ఆయన సన్నిహిత నేతలు వివరిస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు శిక్షణా కార్యక్రమాల నుంచి సంస్థాగత వ్యవహారాల దాకా కేసీఆర్ పర్యవేక్షించారు. ఆ అనుభవంతో పాటు 13 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో వచ్చిన అనుభవాలకు తోడు కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ సంస్థాగతంగా ఉన్న వ్యవస్థల్లో మంచిచెడులపైనా ఆయనకు లోతైన అవగాహన ఉంది. వీటికి అనుగుణంగా లోపాల్లేని సంస్థాగత వ్యవస్థను తయారుచేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ మేరకు పార్టీకి  బూత్, గ్రామ, మండల, నియోజకవర్గ, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలతో పాటు అన్ని అనుబంధ సంఘాలకు కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ముందుగా అన్ని వర్గాల్లో సభ్యత్వాలు చేస్తారు.

 

 సింగపూర్‌కు కేటీఆర్!

 

 రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు మూడు రోజుల కింద సింగపూర్ పర్యటనకు వెళ్లినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కె.చంద్రశేఖరరావు ఇటీవలే ఐదు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించారు. ఆయన తిరిగి వచ్చిన రెండు రోజుల్లోనే అదే సింగపూర్‌కు కేటీఆర్ వెళ్లడం అటు పార్టీవర్గాల్లోనూ, ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. దీనికి తోడు మెదక్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ప్రకటనలోనూ కుటుంబ సభ్యుల్లో కొన్ని అభిప్రాయబేధాలు వ్యక్తమైనట్టుగా పార్టీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top