‘కృషి విజ్ఞానం’ వృథా!


 వ్యవసాయంలో రోజురోజుకు వస్తున్న ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి వారిని అభివృద్ధి పరిచేందుకు కమాన్‌పూర్ మండలం రామగిరిఖిల్లా ప్రాంతంలో నెలకొల్పిన కృషి విజ్ఞాన కేంద్రం అన్నదాతలకు అక్కరకు రాకుండా పోయింది. దీని నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.50లక్షలు వెచ్చిస్తున్నా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు.    

 - మంథని

 

 మంథని నియోజకవర్గం కమాన్‌పూర్ మండలం రామగిరిఖిల్లా ప్రాంతంలో 2010లో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.85లక్షలతో రైతు వసతిగృహం, శిక్షణ కేంద్రంతోపాటు ఇతర  పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని మంథని, మహదేవపూర్ సబ్ డివిజన్‌లతోపాటు జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మెట్‌పల్లి సబ్‌డివిజన్‌ల రైతులకు వ్యవసాయంపై అవగాహన, వివిధ పంటల సాగుపై శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రం పనిచేయాలి. ప్రతీ బ్యాచ్‌లో 30నుంచి 40మందికి శిక్షణ ఇచ్చి వారిని వ్యవసాయ రంగంలో రాణింపజేయాలి.

 

 కానీ మొక్కుబడిగా కేంద్రం పనిచేస్తుండడంతో రైతులు ఇంకా వ్యవసాయికంగా వెనుకబడే ఉన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుపోషణ, గృహవిజ్ఞానం, తెగుళ్ల నివారణపై శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కేంద్రం పరిధిలోకి వచ్చే ఆయా సబ్‌డివిజన్‌లలోని గ్రామాల్లో శాస్త్రవేత్తలు పర్యటించి అవగాహన కల్పించాలి. శిక్షణ పొందేందుకు ముందుకు వచ్చే రైతులకు తమ కేంద్రంలో శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పాటునందించాలి. అయితే ఈ కేంద్రంలో ఏడుగురు శాస్త్రవేత్తలు పనిచేయాల్సి ఉండగా, కేవలం తెగుళ్ల నివారణ శాస్త్రవేత్త మాత్రమే ఉన్నారు. ఈయనే అన్నీ తానై పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. మిగతా రంగాల శాస్త్రవేత్తల నియామకం రెండేళ్లుగా జరగలేదు. రైతుల మేలు కోసం పనిచేసే కేంద్రం ఉన్న విషయం కూడా చాలామందికి తెలియదు. గత సర్కారు కేంద్రం నిర్వహణ, నిధుల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపయోగంగా మారింది.

 

 ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ పరిధిలోనే..

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెంకటాపూర్ యూనివర్సిటీ పరిధిలో రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విభజనల తర్వాత కూడా కేంద్రాన్ని అలాగే ఉంచడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని కాంట్రాక్ట్ పద్ధతిన పూరించే వీలు లేకుండా పోయింది.

 

 భూమి కేటాయించినా అభివృద్ధికి నిధులు కరువు..

 కృషి విజ్ఞాన కేంద్రానికి ప్రభుత్వం 64ఎకరాల భూమిని కేటాయించినా దాని అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయకపోవడంతో నిరుపయోగంగా ఉంటోంది. రెండో విడత మంజూరు చేసిన రూ.7లక్షల్లో రెండు బోరువెల్‌లు ఏర్పాటు చేయగా, వాటికి విద్యుత్ సౌకర్యం కోసం నిధులు మంజూరు చేయడంలో సర్కారు జాప్యం చేసింది.

 

 రెండు నెలల క్రితం రూ. 3లక్షలు ఇవ్వగా విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కొద్దిపాటి భూమిని చదును చేసి మామిడి మొక్కలు నాటారు. ప్రభుత్వం కేంద్రం నిర్వహణకు అవసరమైన నిధులు, శాస్త్రవేత్తలను నియమిస్తే రైతులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వమైనా దీనిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top