మహిళలే అతడి టార్గెట్..

మహిళలే అతడి టార్గెట్..


ఒంటరిగా ఉన్న మహిళలే అతడి టార్గెట్. భార్య సహాయంతో వారితో మాటలు కలుపుతాడు. తర్వాత కిడ్నాప్ చేస్తాడు. ఆభరణాలు దోచుకుని కొట్టి చంపేస్తాడు. తర్వాత ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని దూరంగా తీసుకెళ్లి తగలబెట్టేస్తాడు. ఇలా ఐదు హత్యలు చేశాడు. పాపం పండింది. గుర్తుతెలియని మహిళల హత్యల మిస్టరీ వీడింది. హంతకుడు కటకటాల పాలయ్యాడు.

 

కామారెడ్డి : సెప్టెంబర్ 30.. పూర్తిగా తెల్లవారకముందే నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. జాతీయ రహదారి పక్కన టేక్రియాల శివారులో ఓ మహిళ మృతదేహం ఉందని కాల్ సారాంశం. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. హంతకులు హత్య చేసి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు. శవం పూర్తిగా కాలిపోయి ఉండడంతో గుర్తుపట్టడానికి వీలు కాలేదు. దీంతో హతురాలెవరో.. హంతకులెవరో తెలుసుకోవడం సవాల్‌గా మారింది.



గుర్తు తెలియని మహిళ హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత.. నవంబర్ 4వ తేదీన ఇదే రకంగా జాతీయ రహదారిపై దగ్గి చౌరస్తా వద్ద మరో మహిళ శవం పడిఉందని పోలీసులకు సమాచారం అందింది.



టేక్రియాల వద్ద మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోగా.. ఇక్కడ ముఖం కొంచెం గుర్తుపట్టే విధంగా ఉండడంతో పోలీసులు మృతదేహాన్ని ఫొటోలు తీయించి జిల్లాలోని పోలీసు స్టేషన్లతోపాటు పొరుగు జిల్లాలకు పంపించారు. అంతటితో ఆగకుండా ఆయా ప్రాంతాల్లో అదృశ్యం కేసులను పరిశీలించారు. కామారెడ్డి డీఎస్సీ ఏ.భాస్కర్ ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ సీఐ కోటేశ్వర్‌రావు పరిశోధన మొదలుపెట్టారు.



ఫోటో ఆధారంగా హతురాలి గుర్తింపు

ఫొటో ఆధారంగా హతురాలెవరో తెలిసిపోయింది. హత్యకు గురైన మహిళను మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన గౌరిశెట్టి పుష్ప(53)గా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు పోస్టుమార్టం గదిలో శవాన్ని పరిశీలించి, ఆమె పుష్ప అని నిర్ధారించారు. నవంబర్ 3న రాత్రి పుష్పకు ఎవరో ఫోన్ చేయడంతో ఇప్పుడే వస్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదని వారు పోలీసులతో తెలిపారు.



ఆమె ఫోన్ కాల్ లిస్ట్‌ను పోలీసులు పరిశీలించారు. చివరి కాల్స్ ఆధారంగా కేసు ఓ కొలిక్కి వచ్చింది. హతురాలు పుష్ప ఇంటి పనిమనిషి మల్లవ్వ నంబర్ నుంచి ఫోన్ రావడంతో బయటికి వెళ్లిందని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.



సిద్దిపేటకు సమీపంలోని నారాయణరావుపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ సలీం భార్య మల్లవ్వ. ఆమె పుష్ప ఇంట్లో పనిమనిషిగా ఉండేది. ఆమె ద్వారా సలీం పుష్పను ఇంటి నుంచి బయటకు రప్పించాడు. మాయమాటలు చెప్పి తన కారులో తీసుకెళ్లాడు. పుష్ప మెడలో ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలను వారు దోచుకున్నారు. పుష్ప తలపై కర్రతో కొట్టడంతో ఆమె చనిపోయింది. అదే కారులో మృతదేహాన్ని తీసుకుని దగ్గి చౌరస్తా వద్దకు వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారు. బంగారం కోసమే హత్య చేసినట్లు అంగీకరించారు.



సిద్దిపేటకే చెందిన మరో మహిళ

టేక్రియాల వద్ద మహిళను తగలబెట్టిందీ తామేనని నిందితులు అంగీకరించారు. హతురాలు సిద్దిపేటకు చెందిన గోదాం రాజవ్వ అని పేర్కొన్నారు. ‘సిద్దిపేటకు చెందిన గోదాం రాజవ్వ(60) సెప్టెంబర్ 29 వ తేదీ రాత్రి సిద్దిపేట బస్టాండ్‌లో మల్లవ్వ, సలీంలకు కనిపించింది. ఆమెకు మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకున్నారు. సిద్దిపేట దాటగానే రాజవ్వను చంపేసి, ఆమె మెడలోఉన్న రెండున్నర తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం శవాన్ని కారులో వేసుకుని, టేక్రియాల శివారులో తగలబెట్టారు.



కరీంనగర్ జిల్లాలో..

సిద్దిపేట నుంచి వృద్ధ మహిళలను కిడ్నాప్ చేసి ఆభరణాలు దోచుకున్న తర్వాత కొట్టి చంపి తీసుకెళ్లి కామారెడ్డి ప్రాంతంలో పడేసి దహనం చేసిన హంతకుడు సలీం.. కరీంనగర్ జిల్లాలోనూ పలు హత్యలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ జిల్లాలో ముగ్గురిని చంపినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. బంగారం కోసమే హత్యలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.



మాయమాటలతో మహిళలను కారులో ఎక్కించుకుని, ఆభరణాలు దోచుకుని, చంపి, తగలబెట్టడం సలీంకు అలవాటుగా మారింది. ఎక్కడా పోలీసులకు చిక్కకుండా సలీం జాగ్రత్తపడేవాడు. అయితే దగ్గి వద్ద దహనం చేసిన మహిళ ముఖం పూర్తిగా కాలకపోవడం వల్ల హతురాలిని గుర్తించడం సులువైంది. తద్వారా హంతకుడు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top