‘బెల్టు’ తీస్తాం!


- మద్యం దుకాణాలు నిర్వహిస్తే సహించం

- దుకాణాదారులకు మహిళల హెచ్చరిక

- మహాత్ముడి సాక్షిగా సీసాలు ధ్వంసం  

- పాములపర్తిలో  పిడికిలి బిగించిన నారీ లోకం

- నిర్వహిస్తే సహించం

- పాములపర్తిలో ఘటన

వర్గల్ : 
అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్న బెల్టు షాపులు నిర్వహిస్తే ఇకపై సహించబోమంటూ మండలంలోని పాములపర్తిలో మహిళలు మంగళవారం ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్న మహిళలు సంఘటితంగా బెల్టు షాపులు లక్ష ్యంగా మూకుమ్మడి దాడులు ప్రారంభించారు. హోటళ్లు, ఇళ్ల మాటున కొనసాగుతున్న అక్రమ మద్యం దుకాణాలపై దాడులు చేసి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.



కుటుంబాలను కూల్చుతున్నాయని ఆరోపిస్తూ ‘బెల్టు’ నిర్వాహకులపై తిట్ల దండకం కొనసాగించారు. బెల్టు షాపులు నిర్వహిస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. బెల్టు దుకాణాల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను, ఖాళీ బాటిళ్లను గ్రామ కూడలిలోని గాంధీ విగ్రహం ముందు వేసి ధ్వంసం చేసారు. గ్రామంలో 20 దాకా మద్యం బెల్టు దుకాణాలు నడుస్తున్నప్పటికి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.



రాత్రి పగలు తేడా లేకుండా మద్యం సేవిస్తూ యువత మత్తులో మునిగి తేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో గొడవలు పెచ్చరిల్లుతున్నాయని, తాగుబోతుల ఆగడాలతో కుటుంబాలు తీవ్ర అశాంతికి, అలజడికి లోనవుతున్నాయని ఈ సందర్భంగా మహిళలు తమ బాధ వెల్లగక్కుకున్నారు. ఇలాంటి పరిస్థితిలోనే తాము ‘బెల్టు’ షాపులపై విరుచుకుపడ్డామని వివరించారు. గ్రామంలో బెల్టు దుకాణాలు కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top