పేరుకే ఆమె.. పెత్తనం ఆయనది

పేరుకే ఆమె.. పెత్తనం ఆయనది - Sakshi


యాచారం:  ఆకాశంలో సగం.. అన్నింటా సగం అంటున్నా.. అవకాశాలను అందిపుచ్చుకుని అడుగు ముందుకేసినా.. విమానాలు నడిపినా.. విల్లు ఎక్కుపెట్టినా.. రాజ్యాధికారం దక్కించుకున్నా.. అధికార పీఠమెక్కినా ఇంకా భర్త చాటు భార్యలే అవుతున్నారు. నడిచేది ఆమే అయినా వెనుకుండి నడిపించేది ఆయనే అవుతున్నాడు. రిజర్వేషన్లతో అధికారం చేజిక్కించుకున్నా పెత్తనం మాత్రం వారిదే.

 

స్థానిక, ప్రాదేశిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించుకోగలిగినా... చాలామంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఇప్పటికీ వంటిం టికే పరిమితమవుతున్నారు. గ్రామాల్లో పర్యటించినా.. సమస్యలపై అధికారుల వద్దకు వెళ్లినా.. ఓ ఎమ్మెల్యేనో.. ఎంపీనో.. మంత్రినో... కలిసినా మహిళా ప్రజాప్రతినిధుల భర్తలో.. లేక బంధువులో దర్శనమిస్తున్నారు. ప్రజలు తమ బాధలు చెప్పుకోవాలన్నా వారికే చెప్పుకోవాలి. పనులు కావాలన్నా వారే చేయాలి. మండలంలోని 20 గ్రామాల్లో తొమ్మిది మంది మహిళా సర్పంచ్‌లుగా ఎన్నికవగా, 14 ఎంపీటీసీ స్థానాల్లో ఏడుగురు మహిళలు ఎన్నికయ్యారు.

 

ఎంపీపీ పీఠం సైతం మహిళనే వరించింది. ప్రజాప్రతినిధులుగా గెలిచినా వారు తమ అధికారాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. గ్రామ, మండల సమావేశాల్లోనో.. ప్రభుత్వ కార్యక్రమాల్లోనే అధికారికంగా కనిపిస్తున్నారు. అధికారం మాత్రం సతులకు బదులు పతులే చలాయిస్తున్నారు. అధికారులు అత్యవసర సమయాల్లో మహిళా ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని ఫోన్ చేసినా చెప్పండి పరవాలేదు అంటూ వారి గొంతే వినిపిస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది పెద్దగా చదువుకోకపోవడం కూడా వారికి కలిసివస్తోంది.

 

మహిళా సాధికారతను కాలరాయడమే..

‘‘రిజర్వేషన్లతో వచ్చిన అవకాశాన్ని మహిళా ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలి. పాలనా వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తలు, బంధువుల జోక్యాన్ని సహించొద్దు. స్వతహాగా పరిపాలన చేసేలా చైతన్యం రావాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. సమావేశాల్లో, సదస్సుల్లో బాగా మాట్లాడాలి. గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా కృషి చేయాలి’’ ఈనెల 24న మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ‘మన ఊరు-మన ప్రణాళిక ’ సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మహిళా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన మాటలివి.

 

 ఈ మాటలు మండలంలో చర్చనీయాంశమయ్యాయి. పాలనాపరమైన అనుభవలేమి నేపథ్యంలో కొంతవరకు కుటుంబ సభ్యులు సహాయపడినా పరవాలేదు కాని మొత్తంగా అధికారాన్నే లాగేసుకోవడం మహిళా సాధికారతను కాలరాయడమే అనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా మహిళా ప్రజాప్రతినిధులు రిజర్వేషన్లతో తమకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని తోటి మహిళలు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top