హాస్టల్ గదిలో ఉరేసుకొని యువతి మృతి

హాస్టల్ గదిలో ఉరేసుకొని యువతి మృతి


నల్లకుంట, న్యూస్‌లైన్: పేదరికం...ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదని బెంగ... అనారోగ్య సమస్య.  ఈ కారణాల నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.  నల్లకుంట ఇన్‌స్పెక్టర్ వి.జయపాల్‌రెడ్డి కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉంటున్న చెందిన  గజ్జల వీరబ్రహ్మచారికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె గజ్జల సరళ (29) హైదరాబాద్‌లో పీజీ, బీఎడ్ పూర్తి చేసింది.



ఉద్యోగ అన్వేషణ కోసం గత ఫిబ్రవరి 13న స్వగ్రామం నుంచి నగరానికి తిరిగి వచ్చి.. న్యూనల్లకుంట బాయమ్మవీధిలోని జననీ ఉమెన్స్ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది. హెడ్ నర్స్‌గా పనిచేస్తున్న ప్రణయసుధ, ఎంబీఏ విద్యార్థినులు రీణ, పద్మలు సరళతో పాటు హాస్టల్ గదిలో ఉంటున్నారు. గురువారం గదిలో ఒంటరిగా ఉన్న సరళ ఉదయం 9 గంటలకు హాస్టల్‌లోని కిచెన్ వద్దకు వెళ్లి వంట మనిషిని టీ కావాలని అడిగింది.



తిరిగి గదికి వెళ్లి తలుపులు బిగించుకొని ఫ్యాన్ హుక్‌కు నైలాన్ తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నైట్ డ్యూటీ ముగించుకొని ఉదయం 10 గంటలకు ఇంటికి వచ్చిన ప్రణయసుధ గది తలుపు తెరిచి చూడగా సరళ ఉరేసుకొని కనిపించింది. హాస్టల్ నిర్వాహకుడి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా... సరళ రాసిన సూసైడ్‌నోట్ దొరికింది.  ‘నిస్సాహాయతతోనే ఆత్మహత్య చేసుకుంటున్నా.. నా మృతదేహాన్ని, లగేజీని మా ఉరికి చేర్చండి.. రవాణా ఖర్చుల కోసం బెడ్ కింద రూ.600 పెడుతున్నా’ అని రాసి ఉంది.

 

టీచర్ ఉద్యోం చేస్తానని వచ్చింది: వీరబ్రహ్మచారి మృతురాలి తండ్రి

 

ఏదైన ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తానని చెప్పి హైదరాబాద్‌కు వచ్చింది. వెళ్లొద్దని వారించినా.. గ్యాస్ వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న నీకు ఆసరాగా ఉంటానని చెప్పింది. రెండు రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడింది. 28న ఇంటి వస్తానని చెప్పింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నా. అంతలోనే నా బిడ్డ ఎందుకిలా చేసిందో అర్థం కావడంలేదని సరళ తండ్రి వీరబ్రహ్మచారి రోదించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top