అర్ధరాత్రి ప్రసవ వేదన

అర్ధరాత్రి ప్రసవ వేదన


పురిటినొప్పులతో వస్తే హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు

అంబులెన్స్‌లో వెళ్తుండగా మార్గ మధ్యంలో ప్రసవం

వికారాబాద్‌ ఆస్పత్రి వైద్యుల నిర్వాకంపై ఆగ్రహం




బంట్వారం: ఓ నిండు గర్భిణి పురిటినొప్పులతో ఆస్పత్రికి వెళ్తే.. ప్రసవం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. బీపీ ఎక్కువగా ఉందనే నెపంతో హైదరాబాద్‌కు రిఫర్‌ చేశా రు. అంబులెన్స్‌లో నగరానికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రసవం జరిగింది. వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి మండలం కరీంపూర్‌ గ్రామానికి చెందిన నస్రీన్‌ బేగం (25) నిండు గర్భిణి. శనివారం రాత్రి 11 గంటలకు పురిటి నొప్పులు రావడంతో భర్త హసన్, ఆడపడుచు మహబూబ్‌బీ కలసి ఆటోలో వికారాబాద్‌కు తీసుకొచ్చారు. రాత్రి ఒంటి గంటకు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించేందుకు యత్నించగా నైట్‌ డ్యూటీలో ఉన్న డాక్టర్లు నిరాకరించారు. బీపీ ఎక్కువగా ఉందని, తల్లీబిడ్డకు ప్రమాదకరమని హైదరాబాద్‌లోని నయాపూల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు.



ఇక తప్పని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ రూ.3 వేలకు అంబులెన్స్‌ మాట్లాడుకొని నగరానికి బయలుదేరారు. మార్గంమధ్యలో చేవెళ్ల సమీపంలోకి చేరుకోగానే ఆదివారం తెల్లవారుజామున  నస్రీన్‌ బేగానికి ప్రసవం జరిగి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చేవెళ్లలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి బాలింతకు ఇంజెక్షన్‌ చేయించారు. అదే అంబులెన్స్‌లో ఆదివారం ఉదయం 6.30 గంటలకు  తిరిగి వికారాబాద్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చారు. అప్పుడు నస్రీన్‌బేగంను అడ్మిట్‌ చేసుకున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.



వికారాబాద్‌ ఆస్పత్రిలో పట్టించుకోలేదు: హసన్, నస్రీన్‌ భర్త వికారాబాద్‌ ఆస్పత్రిలో నైట్‌ డూటీలో ఉన్న డాక్టర్, సిబ్బంది ఎవ్వరూ పట్టించుకోలేదు. బీపీ ఎక్కువగా ఉంది హైదరాబాద్‌ వెళ్లాలని చెప్పారంతే. నా దగ్గర డబ్బులు లేకపోతే మా సర్పంచ్‌ను పంపించి అంబులెన్స్‌ ఏర్పాటు చేయించారు. అల్లా దయతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇంతపెద్ద దవాఖానాలో పట్టించుకోకపోతే ఎట్టా..?



బీపీ చాలా ఎక్కువగా ఉన్నందునే: జావిద్, డ్యూటీ డాక్టర్‌  నస్రీన్‌కు బీపీ 180 కంటే ఎక్కువగా ఉంది. బ్లడ్‌ బ్యాంక్‌లో ఆమె గ్రూప్‌ రక్తం లేదు. అనస్థీషియన్‌ (మత్తు) డాక్టర్‌ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో జరగరానిది జరిగితే తల్లీబిడ్డకు ప్రమాదకరమే. అందుకే ఆమెను హైదరాబాద్‌కు రిఫర్‌ చేయాల్సి వచ్చింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top