కడుపు ‘కోత’

కడుపు ‘కోత’


అవసరం లేకున్నా సిజేరియన్లు

ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్వాకం

అనారోగ్యం బారిన మహిళలు

హెచ్చరికలు చేశాం: డీఎంహెచ్‌ఓ

పాలమూరు: కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే చేసే ఆపరేషన్.. అవసరం ఉన్నా లేకున్నా చేస్తున్నారు. జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, మెటర్నిటీ నర్సింగ్‌హోమ్‌ల కాసులకక్కుర్తి కొంతమంది తల్లులకు కడుపుకోతను మిగిల్చుతోంది. ఏడాదికాలంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న శస్త్రచికిత్స(సిజేరియన్లు)లను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. పురిటినొప్పులతో బాధపడుతూ ఆస్పత్రులను ఆశ్ర యించే వారి అమాయకత్వాన్ని కొందరు వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో మెటర్నిటీ ఆస్పత్రులు 100కు పైగా ఉన్నాయి.



రోజుకు ఐదు నుంచి ఏడు వరకు కే సులు వస్తే వారంలో రెండు లేదా మూడు కేసులకు మాత్రమే సహజ ప్రసవాలు జరుగుతున్నాయి. మూడేళ్లుగా ప్రసవాలరికార్డులను పరిశీలిస్తే సహజ ప్రసవాలు తగ్గాయి. జిల్లాలో ఏటా దాదాపు 50వేల కాన్పులు జరుగుతుండగా.. అందులో 30వేల వరకు ప్రైవేట్ దవాఖానాల్లోనే జరుగుతున్నాయి. జిల్లాలోని చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వసతులు లేకపోవడం, సకాలంలో వైద్యం అందదన్న కారణంతో చాలామంది ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా స్త్రీ వైద్య నిపుణులు, ఎనస్తీషియా వైద్యుల కొరత తదితర కారణాలతో సర్కారు వైద్యంపై నమ్మకం లేకుండా పోయింది.

 

సిజేరియన్ ఎప్పుడు అవసరం

శిశువు మెడకు రెండు వరసలు పేగుచుట్టుకున్న సందర్భంలో సిజేరియన్ అవసరమని స్త్రీవైద్య నిపుణులు సూచిస్తున్నారు. బిడ్డ అడ్డంగా తిరిగి ఉండటం, సాధారణంగా శిశువు తలకిందకు.. కాళ్లు పైకి ఉండాలి. అలా కాకుండా శిశువు తలపైకి, కాళ్లు కిందకి ఉన్నప్పుడు తల్లీబిడ్డకు ప్రమాదం ఉంటుంది.. ఈ సందర్భంలో సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీయాల్సి ఉంటుంది.

  ప్రసవాల కోసం జరిపే శస్త్రచికిత్సల సమయంలో ఇచ్చే మత్తుమందు ప్రభావం మహిళలపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వెన్నుపూసకు ఇచ్చే మత్తు ప్రభావం కొందరు మహిళలపై భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

 

కొన్ని సందర్భాల్లో మాత్రమే..

వైద్యులు రోగి పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకుని అందుకనుగుణంగా కొన్ని పద్ధతుల ద్వారా నార్మల్ డెలివరీనే చేయాలి. ఇటీవల చాలామంది తమకు సిజేరియన్ చేయమని వైద్యులను కోరుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అటువంటి వారికి వైద్యులు తగిన విధంగా అవగాహన కల్పించి నార్మల్ డెలివరీకి ఒప్పించాలి. సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫొటోగ్రామ్ పరీక్ష ఆధారంగా కూడా సాధారణ డెలివరీకి అవకాశం లేని సందర్భంలో సిజేరియన్ చేయాలి. వయసు పెరిగిన తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడం, ఆలస్యంగా గర్భం దాల్చడం వంటి కారణాలవల్ల కూడా నార్మల్ డెలివరీ అయ్యేపరిస్థితులు ఉండటంలేదు. గర్భందాల్చిన మహిళకు హైబీపీ ఉండటం, ఇతర ఇబ్బందికర పరిస్థితుల్లో సిజేరియన్ జరుగుతుంది. 

- లక్ష్మి పద్మప్రియ, స్త్రీవైద్య నిపుణురాలు, మహబూబ్‌నగర్

 

శస్త్రచికిత్సలపై హెచ్చరించాం

అవసరమైతేనే శస్త్రచికిత్సలు చేయాలి. పురిటి నొప్పులు ఎక్కువయ్యాయని శస్త్ర చికిత్సల ద్వారా కాన్పుచేయాలని వైద్యులపై ఒత్తిడి పెంచడం సరికాదు. గర్భిణుల బంధువులు కూడా వైద్యులకు సహకరించాలి. ముందుగా పట్టించుకోరు.. ఇబ్బందిగా ఉన్నప్పుడే ఆస్పత్రులకు వస్తుంటారు. దీంతో వైద్యులకు ఇబ్బంది కలుగుతోంది. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాలపై వివరణ కావాలని హెచ్చరికలు జారీచేశాం. ఇతర జిల్లాలతో పోల్చితే మనజిల్లాలో శస్త్రచికిత్సల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లాలో జరుగుతున్న ప్రసవాల్లో 30 శాతం మాత్రమే సిజేరియన్లు ఉన్నాయి. ఈ సంఖ్యను కూడా తగ్గించేందుకు కృషిచేస్తున్నాం. 


- సరస్వతి, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top