లేదంటూనే... వడ్డీ వసూలు!


సిద్దిపేట రూరల్: బుస్సాపూర్ గ్రామస్తురాలు గనగోని అమృత ధనలక్ష్మి గ్రూపు అధ్యక్షురాలు. మహిళల సాధికారతకు కృషి చేస్తున్నామని, వడ్డీలేని రుణంతో ఆడపడుచులకూ ఆర్థిక స్వావలంభన కలిగిస్తున్నామన్న పాలకుల మాటలు నమ్మింది. సమైక్య సంఘ సభ్యులతో బ్యాంక్ ద్వారా రుణాన్ని పొంది ఆర్థికపరిపుష్టతకు, సమాజంతో గౌరవ ప్రదమైన బతుకు కోసం పరితపించింది. అయితే తీరా తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించాల్సిందేనంటూ బ్యాంక్ అధికారులు కరాఖండిగా చెప్పేయడం, బదులివ్వాల్సిన ఐకేపీ ప్రతినిధులు ముఖం చాటేయ్యడంతో  అమృత పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది.  

 

వడ్డీలేని రుణం ప్రకటనకే పరిమితమా?

 సిద్దిపేట మండలం బుస్సాపూర్ గ్రామంలో 36 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. అందులో ధనలక్ష్మి గ్రూపు ఒకటి. గ్రామంలో మిగతా ఏ గ్రూపుకు వడ్డీ వసూలు చేయకుండా ఒక్క ధనలక్ష్మి గ్రూపు సభ్యులే గత 18 నెలల నుంచి ఆంధ్రాబ్యాంక్‌లో తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు వడ్డీలేని రుణాన్ని అందిస్తున్నామని చెప్పుతున్నప్పటికీ, అధికారులు మాత్రం ధనలక్ష్మి గ్రూపు నుంచి ముక్కుపిండి వడ్డీ వసూలు చేస్తున్నారు. ధనలక్ష్మి గ్రూపు సభ్యులు 2013 సంవత్సరంలో ఆంధ్రాబ్యాంక్‌లో రూ. 4 లక్షలు అప్పు గా తీసుకున్నారు. నెలనెల రూ.12వేలు బ్యాం క్‌లో చెల్లించారు.  



ఇప్పటి వరకు 18 నెలలుగా క్రమం తప్పకుండా బ్యాంక్‌లో సొమ్ములు చెల్లించారు. బ్యాం క్‌లో చెల్లించిన డబ్బుకు ఇప్పటి వరకు రూ. 90 వేలు మిత్తి తీసుకున్నారని ఆ సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ఐకేపీ ఏపీఎం ధర్మసాగర్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఐకేపీ ఏసీ మధుసూదన్‌ను వివరణ కోరగా.. రుణాలపై వడ్డీ వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని, తమ దగ్గరికి వస్తే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top