‘ఢీ’పీసీ..


సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఎన్నికల్లో కీలక ప్రక్రియ ముగిసింది. మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. దీంతో బుధవారం జిల్లా పరిషత్‌లో ఓటింగ్ ప్రక్రియ జరుగనుంది. ఇందుకు జెడ్పీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. డీపీసీలో 24 మంది సభ్యుల ఎన్నికకు సంబంధించి ఈ నెల 8న జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నామినేష్ల స్వీకరణ, వాటి పరిశీలన పూర్తిచేయగా.. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ క్రమంలో 21 స్థానాల్లో సింగిల్ నామినేషన్లే ఉండడంతో వాటి ఎన్నిక ఏకగ్రీవమే. మున్సిపల్ కోటాలోని బీసీ జనరల్ కోటాలో ఉన్న మూడు స్థానాలపై నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో వాటికి ఓటింగ్ అనివార్యమైంది.



మూడు బీసీ జనరల్ సీట్లకు ఓటింగ్..

డీపీసీ సభ్యుల ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 24 సభ్యులకుగాను 10 మందిని జెడ్పీటీసీలు ఎన్నుకోనుండగా, 14 మందిని మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో జెడ్పీటీసీ కోటాలో 10 సీట్లకుగాను 11 మంది, మున్సిపల్ కౌన్సిలర్ కోటాలో 14 సీట్లకుగాను 25 మంది పోటీపడ్డారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన రాజకీయ పార్టీలు.. పోటీకంటే సర్దుకుపోవడమే మేలని భావించి బలాబలాల ప్రకారం సీట్లు దక్కించుకునేలా ఎత్తుగడ వేశాయి. ఈ క్రమంలో ఏకాభిప్రాయానికి వచ్చి పార్టీల వారీగా సీట్ల సంఖ్యను ఖరారు చేసుకున్నాయి.



దీంతో పోటీలో ఉన్న పలువురిని పార్టీ నేత లు బుజ్జగించి రాజీయత్నానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో జెడ్పీటీసీ కోటాలో అదనంగా ఉన్న ఒకరు పోటీ నుంచి తప్పుకున్నారు. మున్సిపల్ కోటాలోనూ ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ.. బీసీ జనరల్ కోటాలోని 3సీట్లపై అభ్యర్థులు పట్టుబట్టారు. దీంతో ఆ సీట్లు మినహా మిగతా అన్ని స్థానాల్లో సింగిల్ నామినేషన్లు మిగలడంతో వాటి ఓటింగ్ నామమాత్రమే అయ్యింది. బీసీ జనరల్ కోటాలోని మూడు సీట్లకు సంబంధించి జిల్లా పరిషత్‌లో బుధవారం ఓటింగ్ జరగనుంది. ఈ మూడు సీట్లకుగాను ఐదు మంది బరిలో ఉన్నారు.ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు ఓటింగ్ కొనసాగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.



గుర్తింపు కార్డులు తప్పనిసరి..

జెడ్పీటీసీ కోటాలోని సీట్ల ఎన్నికలు ఏకగ్రీవం కాగా, మున్సిపల్ కౌన్సిలర్ల కోటాలో ఉన్న మూడు బీసీ జనరల్ స్థానాలకు ఓటింగ్ అనివార్యమైంది. ఈ క్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లంతా ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది.  వీరిలో ముగ్గురికి ఓట్లు వేసి గెలిపించాలి. ఓటింగ్‌కు హాజరయ్యే కౌన్సిలర్లు తప్పకుండా వారి గుర్తింపు కార్డులు తీసుకురావాల్సి ఉంటుంది. లేకుంటే అనుమతించబోమని జిల్లాపరిషత్ సీఈఓ చక్రధర్‌రావు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top