పుర.. పాయే..


రూ.168 కోట్ల  పథకం రద్దు

పనులు ప్రారంభం కాకపోవడమే కారణం  

ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం

నిధులు వెనక్కి పంపాలని కేంద్రం ఆదేశం


 

వరంగల్ :   గ్రామీణ ప్రాంతాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మంజూరైన పుర (ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియా) పథకం... ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో రద్దయిపోయింది. నిధులు మంజూరై మూడేళ్లు గడుస్తున్నా పనులు మొదలుకాకపోవడంతో పథకాన్ని రద్దు చేస్తున్నామని.. నిధులను వెనక్కి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాకు మంజూరైన రూ.168 కోట్ల పథకం ఆగిపోయింది. పనులు మొదలుపెట్టని కారణంగా పుర పథకాన్ని రద్దు చేస్తున్నట్లు వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు ముందే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) అధికారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ వచ్చింది. పుర పథకం అమలు కోసం తొలి దశలో మంజూరు చేసిన రూ.25 కోట్లను వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో

 డీఆర్‌డీఏ వెంటనే చర్యలు చేపట్టింది. దాదాపు ఎనిమిది బ్యాంకుల్లో నుంచి ఈ నిధులను వెనక్కి తెప్పిస్తోంది. నాలుగేళ్లుగా వడ్డీ రూపంలో మరో ఆరు కోట్ల రూపాయలు జమ అయినట్లు తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లో మొత్తం నిధులు వెనక్కి రానున్నాయి. నిధులు రాగానే కేంద్రానికి పంపించేందుకు వీలుగా డీఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదించేందుకు సిద్ధమైంది.

 

పర్వతగిరి ఎంపిక


 పుర ప్రాజెక్టు అమలుకు జిల్లాలో పర్వతగిరి మండలంలోని గ్రామాలు ఎంపికయ్యాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో పథకం అమలు చేయాలని నిర్ణయించారు. యుగాంతర్, ఎస్‌వీఈసీ సంస్థలకు టెండర్ల పనులు అప్పగించారు. పుర పథకం మొత్తం నిధులు రూ.168.52. దీంట్లో కేంద్ర ప్రభుత్వం రూ.123.34 కోట్లు(73శాతం), రాష్ట్ర ప్రభుత్వం రూ.25.80 (15 శాతం), భాగస్వామ్య సంస్థలు రూ.19.38కోట్లు (11శాతం) చొప్పున చెల్లించాలి. 13 ఏళ్లపాటు ప్రాజెక్టు నిర్వహణ చేయాల్సి ఉంటుంది. మొదటి మూడేళ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. పదేళ్లపాటు పనులను నిర్వహణ బాధ్యతలు చేట్టిన సంస్థలు పర్యవేక్షిస్తాయి. తరువాత ఆ ప్రాంతంలోని స్థానిక సంస్థలకు నిర్వహణ భాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ప్రణాళిక ప్రకారం 13 ఏళ్ల తర్వాత పథకం ఫలాలు సామాన్యులకు అందుతాయి. దానిపై వచ్చే లాభాల్లో కొంత మొత్తాన్ని గ్రామ పంచాయతీల ఆమోదంతో పన్నుల రూపంలో వసూలు చేసి తదుపరి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసేలా దీన్ని రూపొందించారు.

పుర పథకంతో గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తారు. నగరాల స్థాయిలో సాంకేతిక సేవలు అందుబాటులోకి వస్తాయి. సాగునీరు, తాగునీరు, రోడ్ల విస్తరణ, మురుగునీటి వ్యవస్థ, వీధి లైట్లు, వాటర్ షెడ్, టెలి కమ్యూనికేషన్స్, అపరల్ పార్క్, సోలార్, వైఫై, పర్యాటక, వ్యవసాయ సేవలు, శీతల గిడ్డంగులు, మార్కెట్ యార్డులు, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధి కల్పన లక్ష్యాలతో పుర పథకం రూపొందించారు. 2012 ఆర్ధిక సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్, కృష్ణా  జిల్లాలకు ఈ పథకం మంజూరైంది. రెండు జిల్లాలకు రూ.25 కోట్ల చొప్పున తొలి దశ నిధులు విడుదలయ్యాయి. కృష్ణా జిల్లాలో పనులు వెంటనే ప్రారంభించారు. మన జిల్లాలో పుర పథకం పనులను యుగాంతర్ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. పర్వతగిరి మండలంలోని గ్రామాలన్నింటికీ పుర పథకంలో చేర్చారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వచ్చే మందు రోజు జిల్లాలో హడావుడిగా ప్రారంభించారు. అప్పటికే ఆలస్యమైంది. ప్రారంభించి ఏడాదిన్నర గడిచినా పనులు మొదలుపెట్టలేదు. పుర పథకాన్ని కేంద్రంలోని గత ప్రభుత్వం (యూపీఏ) అమలు చేసింది. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం ఉంది. అరుుతే గతంలో మొదలైన పనులకు దశలవారీగా నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. తొలి దశలో విడుదల చేసిన నిధులనే వెనక్కి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో గ్రామాల అభివృద్ధి ఆగిపోతోంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top