పూడికమట్టితో కార్బన్ ఉద్గారాల కట్టడి


మిషిగాన్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం

 

 హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’ మేలైన ఫలితాన్నిస్తుందని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తోడ్పడుతుందని అమెరికాకు చెందిన మిషిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు పేర్కొన్నారు. భూగర్భజలాల పెంపు, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, పంటల ఉత్పాదకత పెంచడంలో చెరువుల నుంచి తీసిన పూడికమట్టి ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటించి చెరువుల పునరుద్ధరణ పనులపై అధ్యయనం చేసిన ఐదుగురు విద్యార్థుల బృందం తమ అనుభవాలను గురువారం సచివాలయంలో మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా  బృందం సభ్యుడు డి.ఆదిత్య అధ్యయనంలో తేలిన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడుతున్న దృష్ట్యా ఎకరాకు 200 కేజీల కార్బన్ డై ఆక్సైడ్ గాలిలో కలుస్తోందని తెలిపారు. అదే చెరువుల నుంచి తీసిన పూడిక మట్టిని పంట పొలాలకు వాడటం ద్వారా జింక్, పాస్ఫరస్, ఐరన్, మాంగనీస్ వంటి సూక్ష్మధాతువులు భూమిలో చేరి ఎరువుల అవసరం తగ్గుతుందన్నారు.



దీంతో ప్రభుత్వంపై ఎరువులపై భరిస్తున్న సబ్సిడీ భారం, దిగుమతుల భారం, సరుకు రవాణాతో జరిగే కార్బన్ ఉద్గారాలు త గ్గుతాయన్నారు. చెరువుల పూడికతీతతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. దీంతో బోర్ మోటార్ల వినియోగం, మోటార్లపై పడే కరెంట్ లోడ్ భారం తగ్గుతుందని, ఫ్లోరైడ్ శాతం భూమి కింది పొరలకు చేరుతుందని వివరించారు. ఈ బృందంలోని విదేశీ విద్యార్థులు, జాన్, లియాన్, షమితలు మాట్లాడుతూ తాము రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించామని, అక్కడి రైతుల నుంచి వివరాలు సేకరించామన్నారు. తెలంగాణలో రైతుల జీవన ప్రమాణాలను పెంచి, వారిపై పడే రసాయన ఎరువుల భారాన్ని తగ్గించేందుకు మిషన్ కాకతీయను ప్రభుత్వం చేపట్టడం తమను ఆకర్షించిందన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top