కృష్ణానీటి సరఫరాకు.. మార్గం సుగమం


సర్కార్ నిర్ణయంతో తొలగిన అడ్డంకులు

ఔటర్ లోపల జలమండలి పరిధిలోనే నీటి సరఫరా

శంషాబాద్‌లో కొనసాగుతున్న ట్రయల్ రన్

వారం రోజుల్లో సరఫరా జరిగే అవకాశం!


 

శంషాబాద్: ఔటర్ రింగురోడ్డులోపల ఉన్న శివారు ప్రాంతాల నీటి సరఫరా బాధ్యతను జలమండలి పరిధిలోనే ఉంచాలని సర్కారు తీసుకున్న నిర్ణయంతో శంషాబాద్‌కు కృష్ణా నీటి సరఫరాకు మార్గం సుగమమైంది. ‘వాటర్‌గ్రిడ్’తో కృష్ణా నీటి సరఫరాకు మరింత ఆలస్యమయ్యే అవకాశాలుండడంతో ప్రభుత్వం ఔటర్‌లోపల ఉన్న గ్రామాలను వీటి నుంచి మినహాయించింది. శంషాబాద్‌కు నీటి సరఫరా చేయడానికి చెల్లించాల్సిన రూ.13 కోట్ల వన్‌టైమ్ కనెక్షన్ డిపాజిట్ ప్రక్రియను సర్కారు వేగంగా పూర్తి చేయడానికి అంగీకరించడంతో నీటి సరఫరాకు జలమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.



2008 అక్టోబరులో శంషాబాద్‌కు కృష్ణా నీటి సరఫరాకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 8 కోట్లతో పనులు ప్రారంభించారు. 2013లో పనులు పూర్తయ్యాయి. రాజేంద్రనగర్ సర్కిల్ దుర్గానగర్ రిజర్వాయర్ నుంచి లక్ష్మీగూడ, మామిడిపల్లి మీదుగా శంషాబాద్‌కు నీటి సరఫరాను ప్రారంభించినా రెండుమూడు రోజులకే పరిమితమైంది. జలమండలిలో నీటి కొరతతో పాటు పంచాయతీ నుంచి వన్‌టైమ్ కనెక్షన్ డిపాజిట్ కింద రూ.13 కోట్లు చెల్లించాల్సి ఉండడంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది.

 

స్పందించిన సర్కారు...

మండలంలోని అన్ని ప్రాంతాలకు వాటర్‌గ్రిడ్ ద్వారా నీటిని సరఫరా చేయడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. శంషాబాద్ పట్టణం వరకు అన్ని విధాలా పనులు పూర్తయి కూడా నీటి సరఫరా జరగడం లేదని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి తోడు ఔటర్‌లోపల ఉన్న ప్రాంతాలన్నింటికీ జలమండలి నుంచే నీటి సరఫరా జరగాలని ప్రభుత్వం నిర్ణయించడం కూడా శంషాబాద్‌కు కృష్ణా నీటి సరఫరాకు అడ్డంకి తొలగినట్లయింది.



నాలుగైదురోజులుగా జలమండలి అధికారులు నీటి సరఫరా కోసం ఆయా సంపులను శుభ్రపర్చడంతో పాటు ట్రయల్ రన్ షురూ చేశారు. మరో వారం రోజుల్లోపు నీటి సరఫరా జరిగే అవకాశాలున్నట్లు అధికారవర్గాలు వె ల్లడిస్తున్నాయి. ఔటర్ పరిధిలో శంషాబాద్‌తో పాటు సాతంరాయి గ్రామాలు మాత్రమే ఉండడంతో ప్రస్తుతం ఈ రెండింటికే నీటి సరఫరా జరగనుంది. మిగతా 22 గ్రామపంచాయతీలు, తండాలన్నింటికీ వాటర్‌గ్రిడ్ పథకంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top