నాకు బెయిల్ వచ్చింది.. కేసీఆర్ కు జ్వరం వచ్చింది: రేవంత్

నాకు బెయిల్ వచ్చింది.. కేసీఆర్ కు జ్వరం వచ్చింది: రేవంత్ - Sakshi


ఓటుకు కోట్లు కేసులో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీసం తిప్పారు. అభిమానుల కోలాహలం మధ్య భారీ ఊరేగింపుగా ఆయన చర్లపల్లి జైలు నుంచి పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆయన అభిమానులను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. వచ్చే 30 ఏళ్లు తాను కేసీఆర్ మీదే పోరాటం చేస్తానని, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని అన్నారు. తనకు బెయిల్ రావడంతో కేసీఆర్ కు జ్వరం వచ్చిందని వ్యాఖ్యానించారు.



తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్తో పాటు మంత్రులను కూడా నేరుగా పేర్లు పెట్టి మరీ దూషించారు. తనపై పోలీసులను, ఏసీబీని ప్రయోగించారని.. తనపై పెట్టిన కేసు కుట్రపూరితమని ఆయన అన్నారు. తెలంగాణ అంతా తిరిగి కేసీఆర్ చేసిన తప్పులను ఎండగడతానని రేవంత్ రెడ్డి చెప్పారు.



'కేసీఆర్ దోపిడీ, కుటుంబ పాలనను ఎత్తిచూపినందుకే నాపై కుట్ర పన్ని కేసులో ఇరికించారు. కేసీఆర్‌కు రాజకీయ జీవితం లేకుండా చేస్తా..అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా తనను ఏమీ చేయలేరనన్నారు. బుధవారం ఓటుకు కోట్లుకేసులో చర్లపల్లి జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం తొడగొట్టి, మీసాలు మెలేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేక కేసులో ఇరికించారని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.



'రెండు పెగ్గులు తాగితే కాని మాట్లాడలేని కేసీఆర్‌కు అంతా తొత్తులుగా మారారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇస్తున్నావు.. దమ్ముంటే వారితో రాజీనామాలు చేయించి పోటీ చేయించు. వారు గెలిస్తే ముక్కు నేలకు రాస్తా' అని సవాలు విసిరారు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలని కలలు కంటున్నారని, కానీ టీడీపీకి రేవంత్‌రెడ్డి ఉన్నాడని పేర్కొన్నారు. 'ఒడ్డూ పొడుగు ఉన్న హరీశ్‌రావుకు మెదడు మోకాళ్లలో ఉంది. మామ చేసిన బ్రోకర్ దందాలు ఆయనకు తెలియవా? అవినీతి.. అవినీతి.. అంటున్న కేసీఆర్‌కు నిజామాబాద్‌లో కొడుకు చేస్తున్న ఇసుక మాఫియా గురించి తెలియదా' అని ప్రశ్నించారు. సన్నాసులంతా తాగుబోతు పక్కన చేరారు. మందులో సోడా పోసే వాళ్లంతా మంత్రులయ్యారు అని విమర్శించారు.



పార్టీ అభిమానుల కోలాహాలం మధ్య రేవంత్‌రెడ్డి.. చర్లపల్లి జైలు నుంచి ర్యాలీగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు చేరుకున్నారు. ఉదయం నుంచే టీడీపీ శ్రేణులు జైలు వద్ద హంగామా చేశాయి. సాయంత్రం జైలు నుంచి విడుదలైన తర్వాత అభిమానులు అందజేసిన గండ్ర గొడ్డలిని పట్టుకొని గాల్లో తిప్పారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ మహిళ అధ్యక్షురాలు బండ్ర శోభారాణి జైలు వద్ద రేవంత్‌కు స్వాగతం పలికారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top