గుట్ట మాస్టర్‌ప్లాన్‌పై చిన్నజీయర్ సలహాలు : కేసీఆర్

గుట్ట మాస్టర్‌ప్లాన్‌పై చిన్నజీయర్ సలహాలు : కేసీఆర్ - Sakshi


కల్యాణానికి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పణ

నల్లగొండ (భువనగిరి/యాదగిరికొండ ): యాదగిరి దివ్యక్షేత్రం అభివృద్ధి కోసం మాస్టర్‌ప్లాన్ తయారు చేయడానికి త్రిదండి చినజియర్ స్వామితో కలిసి వారంరోజుల లోపు మళ్లీ యాదగిరిగుట్టకు వస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం జరిగిన స్వామి, అమ్మవారి కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలను తీసుకొచ్చిన ఆయన ఆలయ ప్రధాన అర్చకులతో కలిసి మరోమారు ఆలయ ప్రాంగణంలో కాలినడకన కలియదిరిగారు. భూసేకరణను వేగవంతం చేయాలని ఆయన జేసీని ఆదేశించారు. వారంలోపు జియర్‌స్వామితో కలిసి వచ్చి కొండపైన చేపట్టే మాస్టర్‌ప్లాన్‌పై సలహాలు, సూచనలు తీసుకుంటానని అర్చకులతో చెప్పారు. మరోసారి భక్తులు, మీడియాప్రతినిధులు, పూజారులు, దేవస్థానం ఉద్యోగులు పోలీసుల నిర్బంధం ఎదుర్కొన్నారు. కేసీఆర్ కొండపైనుంచి వెళ్లే వరకు ఎక్కడవారిని అక్కడ నిర్బంధించారు.



స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలు అందజేత

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన కల్యాణోత్సవానికి రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా వచ్చి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు అందజేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, విప్ గొంగిడిసునిత, ఎమ్మెల్యేలతో కలిసి వచ్చిన సీఎం దంపతులకు ఆలయ ముఖద్వారం వద్ద అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. సీఎం మొదట ధ్వజస్తంభం వద్దకు చేరుకుని నమస్కరించి గర్భాలయంలోనికి వెళ్లారు. ఆక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో అర్చకులు, వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. అనంతరం సీఎం 12:30 గంటలకు స్వామివారి హనుమంత వాహనసేవలోని స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. అక్కడే కల్యాణానికి సంబంధించిన పట్టువస్త్రాలు, అమ్మవారికి పువ్వులు, పసుపు కుంకుమ, గాజులను అర్చకులకు అందజేశారు. అక్కడినుంచి ఆండాళ్ నిలయంలోకి వెళ్లిన ఆయన సుమారు గంటపాటు అక్కడే గడిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top